బనగానపల్లె పట్టణంతోపాటు మండలంలోని పలు రామాలయాల్లో , శ్రీఆంజనేయస్వామి ఆలయాలతోపాటు వైష్ణవాలయాలు, బాబా మందిరాల్లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వడపప్పు, పానకం పంపిణీతో పాటు పలుచోట్ల భక్తులకు అన్నదానం చేశారు. మండల పరిధిలో శ్రీరామ నవమి వేడుకలు నిరాడంబరంగా నిర్వహించారు. శ్రీసీతారామ లక్ష్మణ ప్రతిమలను ప్రత్యేకంగా అలంకరించారు. రామాలయాలు అధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంలోని శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో ఆలయంలో శ్రీరామనవమిని పురస్కరించుకొని శ్రీ స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దేవదేవేరులను కల్యాణమూర్తులుగా అలంకరించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య కల్యాణం కన్నుల పండుగలా నిర్వహించారు.
ఈ కళ్యాణోత్సవాల్లో పాణ్యం, బనగానపల్లె ఎమ్మెల్యేల కాటసాని సోదర ద్వయం పాల్గొన్నారు. అవుకు మండలంలోని గుండ్లశింగవరం, సీతారాంపురం శ్రీ కాశిరెడ్డి నాయన ఆశ్రమంలో అత్యంత వైభవంగా శ్రీరాములవారి కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆయా కళ్యాణోత్సవాల్లో పాణ్యం, బనగానపల్లె ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, కాటసాని రమిరెడ్డిలు శ్రీరాములవారి,అమ్మవారి తరపున సతీసమేతంగా దంపతులుగా కూర్చుని కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఈ కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు, మహిళలు తరలివచ్చి ఆద్యంతం కల్యాణోత్సవాన్ని తిలకించి శ్రీరామచంద్రుని కృపకు పాత్రులయ్యారు.