బాగా అల్లరిచేసే, గొడవలు పెట్టే చిన్నారులను నియంత్రించడం చాలా కష్టం. పిల్లలు అలా వాళ్లు ప్రవర్తించడానికి ఎన్నో అంతర్గత కారణాలు ఉంటాయి. అలాంటి చిన్నారులను దారిలో పెట్టాలంటే పెద్దవాళ్లు ప్రశాంతచిత్తంతో వ్యవహరించాలి. వారిపై ఎదురు కోపం తెచ్చుకుంటే పరిణామాలు అవాంఛనీయంగా ఉంటాయి. ఇలాంటి చిన్నారులను నిలువరించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేమిటంటే…
ఇలాంటి పిల్లలతో ప్రశాంతచిత్తంతో వ్యవహరించాలి. వారితో నెమ్మదిగా ప్రవర్తించడం ద్వారా మాత్రమే పరిస్థితిని అదుపులోకి తేగలము. తద్వారా నెమ్మదైన ప్రవర్తనను పిల్లల్లో కూడా పెంపొందించగలం.
పిల్లల్లో తీవ్ర కోపస్వభావం పెరగడానికి వారిలోని నిరాశా నిస్ప్రహలు, తీవ్రమైన మానసిక భంగపాటు వంటి కారణాలు ఎన్నో ఉంటాయి. ఈ తరహా పిల్లల్లో కోపం, ప్రతికూల భావోద్వేగాలు అధికంగా కనిపిస్తాయి. వీరితో వ్యవహరించేటప్పుడు వారి మనసులోని ఫీలింగ్స్ ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. వాళ్లు చెప్పే మాటలను ఓర్పుగా వినాలి. ఇలాంటి చిన్నారుల మనసులో దాగున్న బాధ ఏమిటో, వారేం కోరుకుంటున్నారో పెద్దవాళ్లు మొదట అర్థంచేసుకోవాలి. అప్పుడే వారిని నిలువరించడం, చిన్నారుల్లో ప్రశాంత స్వభావాన్ని పెంపొందించడం సాధ్యమవుతుంది.
పిల్లలు అప్సెట్ అయినట్టు గ్రహిస్తే వారిని కాసేపు ఒంటరిగా వదిలేయాలి. ఇలా చేయడం వల్ల వారిలో ఉద్రేకం కొంతసేపటికి తగ్గుతుంది. కోపంతో ఉన్న చిన్నారులు ప్రశాంత స్థితిని పొందేదుకు మంచి వాతావరణంలో వారిని ఒంటరిగా కాసేపు ఉండనివ్వాలి. వాళ్లు తమ మనసుకు నచ్చినట్టు గడిపేలా వారిని స్వేచ్చగా కాసేపు వదిలేయాలి.
మూడ్ సరిగా లేని పిల్లలను వేరే పనిపై ద్రుష్టిసారించేట్టు చేయడం మరో దారి. పిల్లల చేత శ్వాస వ్యాయామాలు చేయించడం, నచ్చిన వాటిని చూపించడం వంటివి చేయాలి.
పిల్లల్లోని కోపం, ఉద్రేక స్వభావాల్ని నివారించడం కష్టం అవుతుంది అనుకున్నప్పుడు, ఆ గుణాలు వారిలో పోవడం లేదని గమనించినపుడు అందుకు మూలకారణాలు ఏమిటో తెలుసుకోవాలి. అవసరమైతే ఛైల్డ్ సైకాలజిస్టు సహాయాన్ని తీసుకోవాలి. పిల్లల్లోని ఈ తీరును తగ్గించకపోతే పెద్దయ్యే కొద్దీ ఈ ధోరణి వారిలో మరింత ఎక్కువుతుంది. అది పలు విష పరిణామాలకు దారితీస్తుంది. అందుకే మానసిక నిపుణుల సలహా సూచనలతో, కుటుంబసభ్యుల తోడ్పాటుతో ఇలాంటి పిల్లల్లోని ఉద్రేకస్వభావం, దుందుడుకు ప్రవర్తనను ఆదిలోనే నివారించాలి.