Friday, November 22, 2024
Homeహెల్త్Masalas: మసాలా దినుసుల ఘాటు పోకుండా..

Masalas: మసాలా దినుసుల ఘాటు పోకుండా..

మసాలా దినుసులు వాడని వంటకాలు ఉండవంటే అతిశయోక్తి కాదు. దాల్చినచెక్క, ఏలకులు, మిరియాలు, లవంగాలు,మిరపకాయలు, ఇంగువ ఇలా ఎన్నో మసాలా దినుసులను మనం నిత్యం వంటల్లో వాడతాం. డిషెస్ రుచిని పెంచడంలో వీటి ప్రత్యేకత అలాంటిది మరి. బిర్యానీ, పులావ్, దాల్, చోలె, రాజ్మా, నాన్ వెజిటేరియన్ వంటకాలకు ఇవి పంచే రుచి, ఘాటు, సువాసనలు ఎంతో. శరీరారోగ్యానికి కూడా ఇవి చేసే మేలు ఎంతో. అంత ప్రాధాన్యం ఉన్న మసాలా దినుసులను ఎక్కువకాలం తాజాదనంతో ఉంచే కొన్ని టిప్స్ ఉన్నాయి. మసాలా దినుసులు రెండు మూడు సంవత్సరాల దాకా నిలవ ఉంటాయి. అయితే వీటిని సరిగా స్టోర్ చేయడం చాలా ముఖ్యం. లేకపోతే వీటి రంగు, వాసనలు దెబ్బతింటాయి. వాటిని వంటకాల్లో ఘాటు ఉండదు. ముఖ్యంగా వేడి ఉన్న చోట్లో వీటిని అస్సలు భద్రపరచకూడదు. మసాలా దినుసులకు సూర్యకాంతి తగలకూడదు.

- Advertisement -

గ్యాస్ స్టవ్ వేడి కూడా వాటి దరిచేరకూడదు. వేడి వల్ల మసాలా దినుసులు రంగు పోవడమే కాదు వాటి సువాసన కూడా పోతుంది. తేమ తగలకుండా గాలి సోకని జార్ల లో వీటిని భద్రం చేయాలి. తేమ తగిలితే మసాలా దినుసులు పాడవుతాయి. అందుకే గ్లాసు లేదా స్టీలు డబ్బాలో వీటిని పదిలపరచడం మంచిది. అయితే మసాలా దినుసులను స్టీలు డబ్బాలో లేదా గాజు జాడీలో పెట్టే ముందు వాటిని కాసేపు ఎండలో పెడితే లోపల ఉండే తేమదనం పోతుంది. ఆ తర్వాత అందులో మసాలా దినుసులు భద్రపరిస్తే రంగు పోవు. సువాసన కోల్పోవు. అందుకే కూల్, డార్కుగా ఉన్న చోట్లల్లో మసాలా దినుసుల డబ్బాలను భద్రం చేయాలి. తేమ ఉన్న ప్రదేశంలో వీటిని అస్సలు ఉంచొద్దే. అలాగ మసాలాదినుసుల రంగు ఎలా ఉందన్నది తరచూ గమనించుకోవాలి. అవి రంగు పోతున్నాయని గుర్తిస్తే వెంటనే వాటిని వాడేసేయాలి. అలాగే ఆరు నెలలకు వచ్చేలా మాత్రమే మసాలాదినుసులు కొనుక్కుని భద్రపరచుకుంటే మంచిది. బాగా డ్రై అయిన మసాలా దినుసులు పాడవవు కానీ వాటిని కొని ఎక్కువ కాలం అయిన కొద్దీ మసాలా రుచి, వాసన, ఘాటుదనం తగ్గిపోతూవస్తాయి.

ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మసాలాల తాజాదనం వాటి వాసన, ఘూటును బట్టి ఉంటుందని మర్చిపోరాదు. మసాలా దినుసులు కొని సంవత్సరం దాటితే వాటిని వాడకుండా ఉండడమే మంచిదంటున్నారు ఆహారనిపుణులు. మసాలా దినుసుల నిల్వ ఉండే కాలం వాటి ప్రోసెసింగ్ పద్ధతిపై, సీజనింగ్ తీరుపై,మసాలాలు స్టోర్ చేసిన విధానంపై ఆధారపడి ఉంటుందంటున్నారు. డ్రైడ్ హెర్బ్స్ సంవత్సరం నుంచి మూడు సంవత్సరాలు నిల్వ ఉంటాయి. మసాలా పొడులైతే రెండు నుంచి మూడు సవంత్సరాల వరకూ నిలువ ఉంటాయి.

పొడిచేయని హోల్ స్పైసెస్ అయితే నాలుగేళ్ల వరకూ నిలవ ఉంటాయి. ఎక్కువ కాలం నిలవ ఉండే మసాలా దినుసులను అవసరమైనపుడు కాఫీ గ్రైడర్ లో వేసుకుని పొడిచేసి వంటకాల్లో ఉపయోగించుకుంటే రుచి ఉంటుంది. మసాలా దినుసులను ఎప్పుడూ 70 డిగ్రీల ఫారెన్హీట్ ఉష్ణోగ్రతలో ఉంచాలి. గాలిచొరబడని సీసాలు లేదా స్టీలు డబ్బాల్లో వీటిని ఉంచాలి. మిరపకాయలు, ఎర్రమిరియాలను ఫ్రిజ్ లో భద్రపరిస్తే వాటి రంగు, ఘాటు పోవు. సో…ఈ టిప్స్ మర్చిపోకుండా అనుసరిస్తూ మసాలా రుచులను ఎంజాయ్ చేయండి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News