Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్న్యాయ వ్యవస్థలో సంస్కరణలు తక్షణావసరం

న్యాయ వ్యవస్థలో సంస్కరణలు తక్షణావసరం

ఒక కొలీజియమ్ ద్వారా ఉన్నత న్యాయ వ్యవస్థలో నియామకాలు జరపడమనే విధానం దేశంలో మరోసారి చర్చనీయాంశం అయింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు చేసిన విమర్శనాత్మక వ్యాఖ్యల కారణంగా న్యాయ నిపుణులు, మేధావులు, విశ్లేషకులు, మీడియా ఈ విధానంపై దృష్టి పెట్టడం ప్రారంభమైంది. ఒక రాజ్యాంగ సవరణను కొట్టివేయడంతో పాటు, నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్ మెంట్ కమిషన్ (ఎన్.జె.ఎ.సి)ను ఏర్పాటు చేయడానికి చట్టాన్ని రూపొందించడాన్ని తిరిగి పరిశీలించాల్సిందిగా కోరుతూ ఒక న్యాయవాది పిటిషన్ దాఖలు చేయడంతో కొలీజియం విధానంపై వాదోపవాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ పిటిషన్ త్వరలో సుప్రీంకోర్టు పరిశీలనకు వస్తోంది. కాగా, అత్యున్నత స్థాయి న్యాయ వ్యవస్థలో నియామకాలకు సంబంధించి మరో పరిణామం కూడా ప్రభుత్వానికి న్యాయవ్యవస్థకు మధ్య ఘర్షణ పరిస్థితిని సృష్టిస్తోంది. నియామకాలకు సంబంధించి ప్రభుత్వం చేసిన కొన్ని సిఫారసుల విషయంలో న్యాయవ్యవస్థ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని, కొలీజియమ్ చేసిన సిఫారసులను రెండు మూడు సార్లు ప్రభుత్వానికి పంపినప్పటికీ, వాటి మీద చర్య తీసుకోవడంలో జాప్యం చేస్తోందని ఇటీవల సుప్రీంకోర్టు ధర్మాసనం విమర్శించింది.

- Advertisement -

చివరికి తమను న్యాయమూర్తులుగా నియమించడానికి సమ్మతించిన న్యాయ నిపుణులు తమ పేర్లను ఉపసంహరించుకోవడం కూడా జరిగింది. కొందరిని న్యాయమూర్తులుగా నియమించడానికి సంబంధించి న్యాయ వ్యవస్థ చేసిన సిఫారసులను నిర్లక్ష్యం చేయడంలో ప్రభుత్వ ఉద్దేశం, అభ్యర్థులు తమకు తాముగా తమ పేర్లను ఉపసంహరించుకోవడానికేనని కూడా సుప్రీంకోర్టు బెంచి వ్యాఖ్యానించింది. అత్యున్నత న్యాయ వ్యవస్థలో నియామకాలు జరిగే అధికారాన్ని న్యాయ వ్యవస్థ నుంచి తిరిగి తన హస్తగతం చేసుకోవాలన్నదే ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది. అయితే, రివ్యూ పిటిషన్ ద్వారా ఇది సాధ్యమవుతుందా అన్నది ఆలోచించాల్సిన విషయమే. నిజానికి, 4:1 నిష్పత్తితో ఇచ్చిన తీర్పును రివ్యూ చేయాలంటే అదే నిష్పత్తితో బెంచి ఆమోదించాల్సి ఉంటుంది. పైగా, ప్రభుత్వం ఇన్నేళ్లుగా రివ్యూను కోరనే లేదు. కొలీజియమ్ వ్యవస్థను అనేక పర్యాయాలు విమర్శించిన కిరణ్ రిజిజు న్యాయ నియామకాల విషయంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందని, అయితే, ఈ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం లేకపోవడం వల్ల ప్రభుత్వం మౌనంగా ఉండాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు.

కొలీజియమ్ చేసిన కొన్ని విమర్శలు సరైనవేననే అభిప్రాయం కూడా కలుగుతోంది. కొలీజియమ్ లో ప్రధానంగా పారదర్శకత లేమి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. న్యాయమూర్తులుగా కొలీజియమ్ సిఫారసులు చేస్తున్న అభ్యర్థుల పూర్వాపరాలు, మంచి చెడుల గురించి కొలీజయమ్ సభ్యులకు తప్ప మరెవరికీ తెలియదు. ఈ సభ్యులు అభ్యర్థుల నైపుణ్యం, నిజాయితీకి, ప్రతిభకు సంబంధించి ఎటువంటి విషయాలనూ బయటపెట్టడం లేదు. ఈ నియామకాల మీద ప్రభుత్వ ప్రభావం, ప్రభుత్వ అభిప్రాయాలను ఇది పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఈ లోపాన్ని కొలీజియమ్ మొట్టమొదటగా సవరించుకోవాల్సి ఉంది. ఇక 99వ రాజ్యాంగ సవరణను, ఎన్.జె.ఎ.సి. కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా ఈ లోపాలను, లొసుగులను వేలెత్తి చూపింది. అయితే, కొలీజియమ్ పనితీరును మెరుగుపరచి, కొనసాగించాలన్న అభిప్రాయం మాత్రం సర్వత్రా వ్యక్తమయింది. నిజానికి, దీన్ని మెరుగుపరిచే ప్రక్రియ కూడా చివరికి మూలనపడింది. ఈ కొలీజియమ్ వ్యవస్థను చక్కదిద్దాలన్న పక్షంలో నియామకాలకు అడ్డుకట్ట వేయడం సరైన పద్ధతి కాదు. కొలీజియమ్ కు భిన్నంగా, కొలీజియమ్ లో కనిపించిన లోపాలేవీ లేకుండా, ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి వెంటనే చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. వాస్తవానికి, న్యాయ వ్యవస్థలో ఎక్కువ నియామకాలు ప్రభుత్వం ద్వారా జరిగినవే. న్యాయ వ్యవస్థ నియామకాల్లో ప్రభుత్వ ఆధిపత్యం పేరుతో వ్యవస్థలో లోపాలు చోటు చేసుకోకుండా ఒక కొత్త వ్యవస్థను రూపొందించడం ఎంత వీలైతే అంత త్వరగా చేయడం మంచిది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News