రాహుల్ గాంధీ సలహాదారులే ఆయన్ను భ్రష్టుపట్టిస్తున్నారని, స్వతహాగా ఎలాంటి మాలిన్యం లేని రాహుల్ ను సొంత పార్టీ నేతలే బలి పశువు చేసి బలిపీఠంపై కూర్చోబెడుతున్నారంటూ బీజేపీ ఎంపీ లహర్ సింఘ్ సిరోయా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. రాహుల్ ను బలహీనపరిచేందుకు సొంత పార్టీలోనే కుట్రలు సాగుతున్నాయని లహర్ సింఘ్ ఆరోపించటం విశేషం. రాహుల్ ను ఆయన సలహాదారులు తప్పుదోవ పట్టిస్తున్నారని, రాహుల్ గాంధీది క్లీన్ హార్ట్..సొంత పార్టీనే బలిపశువు చేస్తోందంటూ కర్నాటక బీజేపీ ఎంపీ అయిన లహర్ సింఘ్ వ్యాఖ్యానించారు.
బీజేపీ రాహుల్ పై ఎటువంటి విషం చిమ్మటం లేదని, రాహుల్ పార్లమెంట్ కు రావాలని, చర్చల్లో పాల్గొనాలనే తమ పార్టీ భావిస్తున్నట్టు ఆయన వివరించారు. రాహుల్ నాన్నమ్మ ఇలాంటిదే తనకు జరిగినప్పుడు స్పందించిన తీరును ప్రస్తావించిన ఆయన..తనపై పడ్డ అనర్హతను తొలగించుకునేందుకు ఆమె తక్షణం అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారన్నారు. ఆతరువాత ఇందిర సుప్రీంకు కూడా వెళ్లారనే విషయాన్ని ఆయన ప్రస్తావించటం విశేషం.
తనకు ఉండేందుకు ఇల్లు లేదని, బంగ్లాను ఖాళీ చేస్తాననే లాంటి మాటలు రాహుల్ ఎలా మాట్లాడతారని, అదే ఇందిరా గాంధీ అయితే 1977లో ఓటమిపాలైనప్పుడు, 1988లో ఎంపీగా ఆమె ఓడిపోయినప్పుడు అప్పటి ప్రధాని మొరార్జీ దేసాయ్ ను ఆమె అకామడేషన్ కావాలని కోరారను గుర్తుచేశారు. తక్షణం స్పందించిన మొరార్జీ ఆమెకు 12 విల్లింగ్డన్ క్రిసెంట్ లో వసతిని కల్పించినట్టు చరిత్రను చెప్పుకొచ్చారు బీజేపీ ఎంపీ. రాహుల్ ను ఆయన సలహాదారులు ఇంకా ఎంత అధఃపాతాళానికి తోసేస్తారని, ఆ పార్టీకి సీనియర్లంతా దూరమయ్యారని జీ-23 నేతలను ఉద్దేశించి లహర్ సింగ్ ప్రస్తావించారు.