Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Elections: ఆందోళనకర ఎన్నికలు

Elections: ఆందోళనకర ఎన్నికలు

ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టుగా ఉంది ప్రస్తుతం కర్ణాటక పరిస్థితి. త్వరలో ఇక్కడ జరగబోతున్న శాసనసభ ఎన్నికల తీరుతెన్నులు చూస్తుంటే మున్ముందు ఇతర రాష్ట్రాల్లో కూడాఇదే పరిస్థితి కళ్లకు కట్టే అవకాశం ఉందనిపిస్తుంది. ఎన్నికలకు ముందు నుంచి ఇక్కడ ధనబలం, కండబలం ఆందోళనకర స్థాయిలో వ్యక్తం కావడం మొదలైంది. ఇక ఉచితాల సంగతి చెప్పనే అక్కర లేదు. ఒక పార్టీని మించి మరొక పార్టీ ఓటర్లను ప్రలోభపెట్టడంలో పోటీలు పడుతున్నాయి. అలవికాని వాగ్దానాలతో అలరిస్తున్నాయి. సాధారణ ఓటరుకు సైతం ఈ పరిస్థితి, దీని పర్యవసానాలు అర్థమవుతున్నాయి కానీ, చేష్టలుడిగి చూడడం తప్ప గత్యంతరం లేకుండా పోతోంది. ఇంకా దీనిలో అనేక సమస్యలున్నాయి. కర్ణాటక శాసనసభకు ఎన్నికల తేదీలను ప్రకటిస్తూ చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ రెండు అతి ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల పట్ల ఓటరుకు ఆసక్తి తగ్గిపోతోందని, ఎన్నికల్లో ధన వినియోగానికి అడ్డూ ఆపూ ఉండడంలేదని ఆయన వ్యాఖ్యానించడం ఇక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది.
ఇటీవల కర్ణాటక వ్యాప్తంగా 93 కోట్ల రూపాయల మేరకు నగదు, విలువైన వస్తువులు పట్టుబడడం సంచలనం కలిగించింది. ఎన్నికల సమయంలో వివిధ పార్టీలు ఓటర్లకు పంచడానికి ఉద్దేశించిన వస్తువులు, నగదు ఇవి. ఇవి కాకుండా ‘ఉచితాలకు’ సంబంధించిన వాగ్దానాలు ఉండనే ఉన్నాయి. ఎన్నికల తేదీలను ప్రకటించడానికి చాలా కాలం ముందు నుంచి ఓటర్లను ప్రలోభపెట్టడం అనే కార్యక్రమం ప్రారంభం అయిపోయింది. నిజానికి అప్పటికింకా ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభం కాలేదని చెప్పవచ్చు. 2019 ఎన్నికల సమయంలో కూడా ఈ సమయానికి 89 కోట్ల రూపాయలు పట్టుబడ్డాయి. ఎన్నికల్లో గెలవడానికి, ఎమ్మెల్యే అనిపించుకోవడానికి వివిధ పార్టీల అభ్యర్థులు ఎంత దూరం వెళ్లడానికైనా, ఏ ప్రయత్నం చేయడానికైనా ఎంతకు తెగిస్తున్నదీ దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల తేదీలను ప్రకటించడానికి కొన్ని వారాల ముందు నుంచీ అభ్యర్థులు ప్రతి ఇంటి గడపా తొక్కుతూ కొన్నిరకాల ఉచితాలను పంచడం ప్రారంభం అయింది. ఉచితాలను పంచడానికి కొందరు పండుగ పేరు చెబితే మరి కొందరు జన్మదినాలు, పెళ్లిళ్లు, దేవుడి కల్యాణాలు వంటి కారణాలను చెప్పడం కూడా జరిగింది.
అభ్యర్థులు మాత్రమే కాదు. వారి పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా ప్రస్తుతం ఓటర్లను లోబరచుకోవడం ఎట్లా అనే ఆలోచనల్లోనే పూర్తిగా నిమగ్నం అయి ఉన్నారు. నాయకులు కూడా ప్రతి ఇంటికీ వెళ్లి యథాశక్తి ఏదో ఒక కారణంతో ఉచితాలను పంచడం జరుగుతోంది. ఆర్థికంగా బలహీన స్థితిలో ఉన్న కుటుంబాలను, అందులోనూ ఆ కుటుంబాలలోని మహిళలను వీరు లక్ష్యంగా చేసుకుని, ప్రలోభపెట్టడం జరుగుతోంది. కుక్కర్లు, మిక్సీలు, స్టవ్‌లు, చీరెలు, వెండి వస్తువులను కానుకలుగా కూడా ఇస్తున్నారు. సహజంగానే వీటన్నిటితో పాటు స్వీట్లు, పలహారాలను కూడా సరఫరా చేస్తున్నారు. అయితే, ఈ మితిమీరిన ఔదార్యాన్ని సంబంధిత అధికారులు కనిపెట్టకపోలేదు. వారు అభ్యర్థులకు, ఎమ్మెల్యేలకు, నాయకులకు సంబంధించిన గోడౌన్ల మీద దాడులు చేసి నగదును, విలువైన వస్తువులను స్వాధీనం చేసుకోవడం జరుగుతోంది కానీ, వీటిని పూర్తిగా నియంత్రించడం మాత్రం సాధ్యమయ్యే పనిగా కనిపించడం లేదు. యువ ఓటర్లకైతే నగదు, మద్యం, మాదక ద్రవ్యాల పంపిణీ కూడా జరుగుతోందని అధికారులదాడుల్లో వెల్లడైంది.
దాదాపు ప్రతి పార్టీ ఈ విధంగా ఓటర్లను కొనడంలో పోటీపడుతోంది. ధన ప్రవాహంతో పాటు, మద్య ప్రవాహం కూడా ఏరులై పారుతోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, ఎక్సైజ్‌ డిపార్ట్‌మెంట్‌, వాణిజ్య పన్నులు తదితర శాఖల అధికారులకు ఈ అభ్యర్థులను పట్టుకోవడమే పెద్ద పనిగా మారిపోయింది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఈ ఉచితాలు, ప్రలోభాలు మరీ శ్రుతిమించి పోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నికల సందర్భంగా డబ్బు నీరులా ప్రవహిస్తున్నట్టు ఎన్నికల కమిషనరే స్వయంగా ఒప్పుకున్నారంటే, ఎన్నికలు ఎంత స్వేచ్ఛగా, సజావుగా జరగబోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. రాజకీయ పార్టీ నాయకుల మీదా, అభ్యర్థుల మీదా నిఘాను పెంచుతామని ఎన్నికల అధికారులు చెబుతున్నప్పటికీ, ఇది ఎంత సమర్థంగా అమలు జరుగుతుందన్నది ఆలోచించాల్సిన విషయమే. అధికారులు భారీగా ఖర్చు చేయడానికి అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికే ఫ్లైయింగ్‌ స్క్వాడ్లను, నిఘా అధికారులను, పరిశీలకులను భారీ సంఖ్యలో నియమించడం జరిగింది. రాష్ట్రాల సరిహద్దుల దగ్గర కూడా నిఘా పెట్టారు కానీ, రాజకీయ పార్టీల ఎత్తులు, పైఎత్తుల ముందు ఈనియంత్రణ చర్యలేవీ పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. వీటివల్ల బ్యాలెట్‌ బాక్స్‌ల విలువ పోవడమే కాదు, నిజాయతీపరులైన ఓటర్లకు ఎన్నికల పట్ల పూర్తిగా న మ్మకం పోతుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండి, ఇటువంటి ఉచితాలను, ఇతర ప్రలోభాలను నిర్దంద్వంగా తిరస్కరిస్తే తప్ప ఎన్నికల విలువ పెరగదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News