Saturday, October 5, 2024
Homeహెల్త్Onion juice: జుట్టుకు ఉల్లిరసం పూయచ్చా ?

Onion juice: జుట్టుకు ఉల్లిరసం పూయచ్చా ?

ఉల్లిరసం మాడుకు రాసుకుంటే జుట్టు రాలిపోదని, రెండు వారాల్లో వెంట్రుకలు రావడమే కాదు జుట్టు ఒత్తుగా కూడా పెరుగుతుందని అంటారు. ఇది ఎంతవరకూ నిజం? అందరికీ ఉల్లిపాయరసం ఒకేలా పనిచేస్తుందా? లేదా? ఇలాంటి సందేహాలు చాలామందిలో తలెత్తుతున్నాయి.

- Advertisement -

అయితే ఉల్లిపాయరసం అందరికీ ఒకేలాగ పనిచేస్తుందనే విషయం మాత్రం చెప్పలేమంటున్నారు చర్మనిపుణులు. ఉల్లిపాయ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్ గుణాలు పుష్కలంగా ఉండడం వల్ల ఉల్లిరసం మంచి హెయిర్ మాస్కుగా పనిచేస్తుందనే అభిప్రాయం కొందరు పోషకాహార నిపుణులు వ్యక్తంచేస్తున్నారు.
ఉల్లి రసంలో సల్ఫర్ అధికంగా ఉంటుందని, అది జుట్టు చిట్లకుండా, పలచబడకుండా, రాలిపోకుండా సంరక్షిస్తుందని అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా సల్ఫర్ జుట్ట కుదుళ్లను పటిష్టం చేసి వెంట్రుకలు ఒత్తుగా పెరిగేలా చేస్తుందంటున్నారు. ఇందులోని యాంటాక్సిడెంట్ల వల్ల వెంట్రుకలు తొందరగా తెల్లబడవని చెప్తున్నారు. అయితే వీటిని రుజువుచేసే శాస్త్రీయ ఆధారాలేవీ ఇంతవరకూ లేవని కొందరు చర్మనిపుణులు అంటున్నారు.
ముఖ్యంగా జుట్టురాలడాన్ని అరికడుతుందని, తిరిగి జుట్టు పెరుగుతుందనే విషయాలపై వీరు సందేహాలు వ్యక్తంచేస్తున్నారు. ఉల్లిపాయరసం అంత మేలు చేసేదే అయితే బట్టతలతో బాధపడేవారే ఉండరని ఇలాంటి విమర్శకులు అంటున్నారు. పైగా ఉల్లిపాయరసం మాడుకు రాసుకోవడం వల్ల జుట్టు రాలిపోయే ప్రమాదం ఉందని కొందరు చర్మనిపుణులు హెచ్చరిస్తున్నారు.

‘ఉల్లిరసం రాసుకోవడం వల్ల చర్మంపై మంట, దురద, బర్న్స్ వంటివి తలెత్తడమే కాకుండా జుట్టు కూడా రాలిపోతుంద’ని అంటున్నారు. ఇంకొందరు చర్మనిపుణులు మాట్లాడుతూ అందరికీ ఉల్లిరసం సరిపడదని చెప్తున్నారు. ఉల్లిపాయరసాన్ని మాడుకు రాసుకోవాలని భావిస్తున్నవాళ్లు ముందర చర్మనిపుణులను సంప్రదించి వారి సలహా తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. అలాగే వెంట్రుకలు ఊడిపోవడానికి అనేక కారణాలు ఉంటాయని, అందుకే ముందర చర్మనిపుణులు లేదా శిరోజాల నిపుణులను సంప్రదించడం మంచిదని చెప్తున్నారు. సంబంధిత వైద్యనిపుణులను సంప్రదించకుండా ఇంటి వైద్యం చేసుకుంటే ఉన్న జుట్టు ఊడిపోయే, వెంట్రుకలు దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

సో… ఉల్లిరసం మాడుకు, వెంట్రుకలకు మంచిదా కాదా అనేది పక్కన పెడితే, మీ శిరోజాల సంరక్షణ కోసం తొలుత చర్మనిపుణులను సంప్రదించి వారిచ్చిన సూచలకనుగుణంగా జుట్టు సంరక్షకు పూనుకుంటే ఉత్తమమని సూచిస్తున్నవారే ఎక్కువమంది ఉన్నారు. అదీ సంగతి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News