మహారాష్ట్ర నుంచి బిఆర్ఎస్ లోకి చేరికలు కొనసాగుతున్నాయి. బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో అన్ని వర్గాలకు అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణ మోడల్ గా దేశవ్యాప్తంగా ప్రజారణ పొందుతున్నవి.
ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా రాజకీయ నాయకులతో పాటు, రైతు సంఘాల నేతలు, ముస్లిం మైనారిటీ వర్గాల నేతలు కూడా సీఎం కేసీఆర్ ప్రజారంజక పాలనపట్ల ఆకర్షితులవుతున్నారు. తెలంగాణలో అమలవుతున్న రైతు మోడల్ మాదిరిగా తెలంగాణ మైనారిటీ అభివృద్ధి మోడల్ మహరాష్ట్ర సహా దేశ వ్యాప్తంగా అమలు చేయాలని బలంగా కోరుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో శనివారం నాటి మహారాష్ట్ర రైతు సంఘాల నేతల చేరిక జాతీయస్థాయిలో ప్రాధాన్యత సంతరించుకోగా, దీని కొనసాగింపుగా ఆదివారం నాడు మహారాష్ట్ర ముస్లిం మైనారిటీ నేత సయ్యద్ అబ్దుల్ ఖదీర్ మౌలానా, హైదరాబాద్ లో సీఎం కేసీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అధినేత సీఎం కేసీఆర్ గులాబీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
సయ్యద్ అబ్దుల్ ఖదీర్ మౌలానా., మహారాష్ట్ర కు చెందిన ప్రముఖ నేత. ఎన్ సి పి పార్టీ ఉపాధ్యక్షుడు. వీరు మహారాష్ట్ర లోని ఔరంగబాద్ సెంట్రల్ నియోజకవర్గం నుండి 2019 సంవత్సరంలో ఎన్ సి పి నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. గతంలో ఎన్ సి పి జాతీయ పార్టీ ఉపాధ్యక్షులుగా మరియు, మహారాష్ట్ర ఎన్ సి పి పార్టీ మైనార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా పని చేశారు. వారు ఎన్సిపి మహారాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు కూడా.