Saturday, November 23, 2024
Homeనేషనల్Babu Jagjivan Ram Jayanti: ఆయనో స్ఫూర్తి ప్రదాత: కేసీఆర్

Babu Jagjivan Ram Jayanti: ఆయనో స్ఫూర్తి ప్రదాత: కేసీఆర్

దేశ స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త, భారత మాజీ ఉప ప్రధాని.. బాబూ జగ్జీవన్ రామ్ జీవితం స్పూర్తి దాయకమని, దళిత సమాజాభివృద్ధికోసం వారు చేసిన సేవలు గొప్పవని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కొనియాడారు. బాబూ జగ్జీవన్ రామ్ 116 వ జయంతి సందర్భంగా వారు దేశానికి చేసిన సేవలను సిఎం కేసీఆర్ స్మరించుకున్నారు.
దేశ స్వాతంత్ర్య సమరయోధుడిగా, గొప్ప రాజకీయవేత్తగా, సామాజిక సమానత్వం కోసం తన జీవితకాల పోరాటం చేసిన సంస్కరణ శీలిగా భారతదేశ రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచివుండే గొప్ప దార్శనికుడు బాబు జగజ్జీవన్ రామ్ అని సిఎం కేసీఆర్ అన్నారు. తన సుదర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఉపప్రధాని పదవితో పాటు, పలు మంత్రిత్వ శాఖలు చేపట్టి ఆయా రంగాల్లో తనదైన ముద్రను, భారతదేశ పురోభివృద్ధికి పునాదులు వేసారని సీఎం అన్నారు. దళితులు, వెనుకబడిన తరగతులు, అణచివేతకు గురైన వర్గాల ఉన్నతి కోసం, వారి హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటాలు, కార్మికోద్యమాలను నడిపారని తెలిపారు. కార్మికశాఖ మంత్రిగా, కార్మిక సంక్షేమ విధానాలకు బాటలు వేసిన బాబూ జగజ్జీన్ రామ్… కార్మిక లోక పక్షపాతి అని సీఎం కీర్తించారు. జీవిత పర్యంతం పేదలు, పీడిత వర్గాల సంక్షేమం, హక్కుల సాధన కోసం పనిచేసిన బాబు జగజ్జీవన్ రామ్ ప్రజలు ప్రేమగా పిలుచుకునే ‘బాబూజీ’ గా ప్రఖ్యాతులయ్యారని సీఎం తెలిపారు.
బాబూజీ స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం పేదలు, వెనుకబడిన వర్గాలు, గిరిజన, దళిత వర్గాల అభ్యున్నతి కోసం దేశం మునుపెన్నడూ ఎరుగని రీతిలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నదన్నారు. దేశమే ఆశ్చర్యపోయే రీతిలో ఫలితాలు సాధిస్తున్నదని సీఎం స్పష్టం చేశారు.
పలు పథకాలతో పాటు తెలంగాణ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని అమలు చేస్తూ, సామాజికంగా ఆర్థికంగా వివక్షకు గురైన దళితుల సమగ్రాభివృద్ధికి చర్యలు చేపడుతున్నదని సిఎం తెలిపారు. దళితుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దళిత సంక్షేమ మోడల్ గా, నేడు దేశానికే ఆదర్శంగా నిలిచాయని సీఎం తెలిపారు. ఎన్ని అడ్డంకులెదురైనా, దళితులు, అణగారిన వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ఇదే పట్టుదలతో ముందుకు సాగుతుందని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News