Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్AP High court: జస్టిస్ గంగారావుకు ఘనంగా వీడ్కోలు

AP High court: జస్టిస్ గంగారావుకు ఘనంగా వీడ్కోలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా పనిచేసి పదవీ విరమణ చేస్తున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యం.గంగారావుకు మంగళవారం నేలపాడులో గల రాష్ట్ర హైకోర్టులోని ప్రఛమ కోర్టు హాల్లో పుల్ కోర్టు ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ వీడ్కోలు కార్యక్రమంలో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ.. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి న్యాయవాద పట్టా పొందిన జస్టిస్ గంగారావు 1988లో న్యాయవాదిగా నమోదు అయిన పిదప జస్టిస్ బిఎస్ఏ స్వామి వద్ద జూనియర్ న్యాయవాదిగా చేరి ప్రాక్టీసు ప్రారంభించారన్నారు.ప్రభుత్వ న్యాయవాదిగా,కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్ గాను సేవలందించిన తదుపరి 2017 సెప్టెంబరు 21న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టారని తెలిపారు.న్యాయమూర్తిగా జస్టిస్ గంగారావు 8వేల 100 కేసుల్లో తీర్పులు ఇచ్చారని పేర్కొన్నారు.

- Advertisement -

న్యాయమూర్తిగా ఆయన ఇచ్చిన తీర్పుల్లో కొన్ని ప్రత్యేక ల్యాండ్ మార్క్ తీర్పులు కూడా ఉన్నాయని జస్టిస్ మిశ్రా పేర్కొన్నారు.అంతేగాక జస్టిస్ గంగారావు అనేక కమిటీలకు సభ్యునిగా సేవలందించారని అన్నారు.నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక మంచి న్యాయమూర్తిని కోల్పోతోందని ఆయన సేవలు హైకోర్టుకు అవసరమని పేర్కొంటూ జస్టిస్ గంగారావు శేష జీవితం ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో గడవాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఆకాంక్షించారు.
న్యాయమూర్తిగా పదవీ విరమణ చేస్తున్నజస్టిస్ గంగారావు మాట్లాడుతూ 1971-76 మధ్య అనంతపురం జిల్లా పత్తికొండలో తన పాఠశాల విద్య సాగిందని,1987లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి లా డిగ్రీ పూర్తి చేసి 1988లో న్యాయవాదిగా ఎన్రోల్ అయి బిఎస్ఏ స్వామి వద్ద తన న్యాయవాద వృత్తిని ప్రారంభించినట్టు గుర్తు చేశారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అసిస్టెంట్ జిపిగా,జిపిగా,కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్ గా తదుపరి న్యాయమూర్తిగా పనిచేసే అవకాశం కలిగిందన్నారు.తన కేరీర్ లో ఎంతో మంది సీనియర్ న్యాయమూర్తులు,జూనియర్ న్యాయమూర్తులు,న్యాయవాదులు తదితరులు అందరూ తనకు ఎంతో సహాయ సహకారాలను అందించినందుకు వారందరికీ పేరుపేరున జస్టిస్ గంగారావు ప్రత్యేక కృతజ్ణతలు తెలిపారు.వ్యక్తులు వస్తుంటారు పోతుంటారు కాని వ్యవస్థ అనేది శాశ్వతమని కావున న్యాయవాద వృత్తిని చేపట్టే ప్రతి న్యాయవాది వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు తగిన సత్వర న్యాయసేవలను అందించేందుకు ప్రయత్నం చేయాలని జస్టిస్ గంగారావు సూచించారు.
ఈకార్యక్రమంలో రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ మాట్లాడుతూ జస్టిస్ గంగారావు న్యాయవాదిగా,ప్రభుత్వ న్యాయవాదిగా,కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్ గా ప్రస్తుతం న్యాయమూర్తిగా వివిధ హోదాల్లో పనిచేసి ప్రజల న్యాయవాదిగా నిలిచారన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు జానకి రామిరెడ్డి మట్లాడుతూ 1961 ఏప్రిల్ 8న అనంతపురం జిల్లాలో జన్మించిన జస్టిస్ గంగారావు 1987లో ఉస్మానియా విశ్వ విద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో పట్టా పొంది వివిధ హోదాల్లో పనిచేసిన తదుపరి 2017 సెప్టెంబరు 21 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టారని గుర్తు చేశారు. ఎల్లపుడూ చిరునవ్వుతో చురుకుగా ఉండే జస్టిస్ గంగారావు తన పదవీ కాలంలో అనేక విప్లవాత్మకమైన తీర్పులను ఇచ్చారని గుర్తు చేశారు.ఎపి హైకోర్టు బార్ కౌన్సిల్ అధ్యక్షులు ఘంటా రామారావు మాట్లాడుతూ జస్టిస్ గంగారావు సామాన్యుల న్యాయమూర్తిగా పేరు తెచ్చుకున్నారన్నారు.డిప్యూటీ సొలిసిటర్ జనరల్ హరనాధ్ మాట్లాడుతూ జస్టిస్ గంగారావు శేష జీవితం ఆయురారోగ్యాలతో కొనసాగాలని ఆకాంక్షించారు.
ఈవీడ్కోలు కార్యక్రమంలో పలువురు హైకోర్టు న్యాయమూర్తులు,పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగిరెడ్డి,రిజిష్ట్రార్లు,రిజిష్ట్రార్ జనరల్,సీనియర్ న్యాయవాదులు,బార్ అసోయేషన్,బార్ కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News