Thursday, September 19, 2024
HomeదైవంVontimitta: అంగరంగ వైభవంగా శ్రీ కోదండ‌రామయ్య  క‌ల్యాణం

Vontimitta: అంగరంగ వైభవంగా శ్రీ కోదండ‌రామయ్య  క‌ల్యాణం

కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి బ్రహ్మోత్సవాల సందర్భంగా పౌర్ణమి రాత్రి శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జ‌రిగింది. వేలాదిగా హాజరైన భక్తులు స్వామివారి  క‌ల్యాణోత్స‌వాన్ని తన్మయత్వంతో  తిల‌కించారు.

- Advertisement -

రాములవారి కల్యాణానికి సంబంధించి సీతమ్మ వారి కోరికను శాస్త్రరీత్యా తెలిపే కాంతకోరిక కార్యక్రమాన్ని రాత్రి 7 గంటలకు వేదిక మీద అర్చకులు నిర్వహించారు. రాత్రి 7.30 గంటలకు ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు. 8 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం ప్రారంభమైంది. ముందుగా భగవత్‌ విజ్ఞాపనం, సభ అనుజ్ఞ, లోకకల్యాణం కోసం సంకల్పం చేయించారు. కల్యాణంలోని పదార్థాలన్నీ భగవంతునిమయం చేసేందుకు పుణ్యాహవచనం నిర్వహించారు. ఆ తరువాత రక్షాబంధనం, యజ్ఞోపవీతధారణ, వరప్రేశనం(కన్యావరణం), మధుపర్కార్చనం చేశారు. మహాసంకల్పం అనంతరం కన్యాదానం చేసి సీతారామచంద్రుల ప్రవరలను చదివారు. రాములవారి వంశస్వరూపాన్ని స్తుతించారు. అగ్నిప్రతిష్టాపన తరువాత సీతా రాముల తల మీద జీలకర్ర, బెల్లం ఉంచి శాస్త్రోకంగా కల్యాణ వేడుక నిర్వహించారు. తరువాత మంగళాష్టకం, చూర్ణిక పఠించి, మాంగళ్యసూత్ర పూజ, మంగళసూత్రధారణ, అక్షతారోపణం చేప‌ట్టారు. స్వామి నివేదన, వేదస్వస్తి, మహదాశీర్వచనంతో కల్యాణఘట్టం పూర్త‌యింది.

భ‌క్తులంద‌రికి ముత్యంతో కూడిన త‌లంబ్రాల పంపిణీ

            కల్యాణవేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గ్యాలరీల్లో కూర్చుని శ్రీ సీతారాముల క‌ల్యాణాన్ని తిలకించేందుకు విచ్చేసిన భ‌క్తులంద‌రికి శ్రీ‌వారి సేవ‌కులు ముత్యంతో కూడిన త‌లంబ్రాల‌ను పంపిణీ చేశారు.

.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News