ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ బీజేపీలో చేరారు.
కాంగ్రెస్ పార్టీ కురువృద్ధ నేత, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన ఏకే ఆంటోనీ కుమారుడు భారతీయ జనతా పార్టీలో చేరటం రాజకీయ సునామీగా చర్చించుకుంటున్నారు. కేరళ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కే సురేంద్రన్ తో కలిసి ఇప్పటికే బీజేపీ హెడ్ క్వార్టర్స్ కు వచ్చిన అనిల్ బీజేపీలో చేరారు.
కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ డిజిటల్ మీడియా సెల్ కన్వీనర్ గా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా ఉన్న అనిల్ కొంత కాలం క్రితమే పార్టీని వీడారు. ప్రధాని మోడీపై బీబీసీ డాక్యుమెంటరీ విషయంపై ఆయన కాంగ్రెస్ అధిష్ఠానంతో విభేదిస్తూ పార్టీని వీడారు. నిజానికి ఆంటోనీ లాంటి గాంధీ కుటుంబ లాయలిస్టు కుమారుడు, యువ నేత, నెక్ట్స్ జనరేషన్ లీడర్ అయిన అనిల్ పార్టీని వీడేందుకు కారణాన్ని మీడియా సాక్షిగా, సోషల్ మీడియా సాక్షిగా విడమరిచి చెప్పినా అనిల్ లేవనెత్తిన విషయాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం అస్సలు ఖాతరు చేయలేదు. దీంతో అనిల్ పార్టీ నుంచి తప్పుకుంటూ పార్టీలో కోటరీ, చెంచాగాళ్లదే రాజ్యంగా మారిందంటూ చాలా ఘాటైన మాటలతో రాజీనామా లేఖను సమర్పించారు.
కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్క కార్యకర్త తాను ఒక కుటుంబం కోసం పనిచేస్తున్నట్టు భావిస్తారని తాను మాత్రం కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నట్టు భావించేవాడినంటూ కాంగ్రెస్ పార్టీలో తన ప్రయాణాన్ని ఆయన వివరించారు.