National Sports Governance Bill 2025:జూలై 23న కేంద్ర క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రవేశ పెట్టిన లోక్‌సభ జాతీయ క్రీడా పాలన బిల్లు 2025ను లోక్ సభ నేడు ఆమోదించింది.
లోక్‌సభ జాతీయ క్రీడా పాలన బిల్లు 2025కు కేంద్రం ఆమోదం తెలిపింది. భారత్ ఒలింపిక్స్ నిర్వహణకు బిడ్ చేయాలనుకుంటున్న తరుణంలో ఈ బిల్లు కీలకంగా మారనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ చట్టం క్రీడా సమాఖ్యలను పారదర్శకంగా, జవాబుదారీగా, నీతివంతంగా నడిపేలా చేస్తుందని కేంద్రం అభిప్రాయపడుతుంది.
ఈ బిల్లు జాతీయ క్రీడా సమాఖ్యల (NSFలు)కు ఏకరూప చట్టపరమైన చట్రం ఏర్పాటు చేస్తుంది. అథ్లెట్ల భద్రత కోసం సురక్షిత ప్రోటోకాల్‌లు, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలను రూపొందిస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా డోపింగ్ నిరోధక (సవరణ) బిల్లు కూడా ఆమోదం పొందింది.
ALSO READ: https://teluguprabha.net/sports-news/jatiya-kreeda-pa…llo-kotta-shakam/
ఈ బిల్లులో ముఖ్యమైన నిబంధన ఏమిటంటే, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI)ని NSFగా గుర్తించడం. BCCI ఇకపై వార్షిక గుర్తింపు కోసం దరఖాస్తు చేయాలి. ఇంకా దాని వివాదాలను కొత్తగా ఏర్పాటు చేసిన జాతీయ క్రీడా ట్రిబ్యునల్ పరిష్కరిస్తుంది. నేరుగా కోర్టులను ఆశ్రయించే అవకాశం ఉండదు.
ఈ చట్టం భారత క్రీడల్లో 10 దీర్ఘకాల సమస్యలను పరిష్కరిస్తుంది, అథ్లెట్ల సామర్థ్యాన్ని పెంచుతుందని.. స్వాతంత్ర్యం తర్వాత క్రీడలకు తగిన ఆదరణ లభించలేదని మాండవీయ వ్యాఖ్యానించారు. గతంలో రెండుసార్లు తిరస్కరణకు గురైన ఈ బిల్లు, NDA ప్రభుత్వానికి పెద్ద విజయమని తెలిపారు. ఈ చట్టం భారత క్రీడలను ప్రపంచ స్థాయికి చేర్చడమే కాక, అథ్లెట్లకు సురక్షిత, న్యాయమైన వాతావరణాన్ని అందిస్తుందన్నారు


