Congress Party: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పదవికి ఎసరొచ్చిందా? అంటే, పార్టీలోని సీనియర్ నాయకులు అవుననే అంటున్నారు. అలాగే, ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత ఆయన పలికిన పలుకులు, చేసిన వ్యాఖ్యలు అలాంటిది ఏదో జరుగుతోందనే అనుమానాలకు తావిచ్చే ఉన్నాయి. రేవంత్ రెడ్డి, ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సహా పార్టీ పెద్దలను కలిసి వచ్చిన తర్వాత ఆయన మాట మారింది. అదే రేవంత్ కు ఉద్వాసన తప్పదన్న భావనకు కారణం అయ్యింది.
నిజానికి, రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్ష పదవి చేపట్టిన నాటి నుంచే ఆయనకు వ్యతరేకత ఆరంభమైంది. కాంగ్రెస్ పార్టీలో పైకి వెళ్ళే వారిని కాలు పట్టి గుంజే సంస్కృతి కొత్తేమీ కాదు. పార్టీలోని కొదరు సీనియర్లు తనను పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పించి ఆ కుర్చీలో కూర్చునేందుకు ప్రయత్నిస్తున్నట్లు హస్తిన నుంచి వచ్చిన తరువాత ఆయన తన ఆవేదనను బహిరంగంగా వెల్లడించారు.
అయితే, పార్టీలో నలుగురైదుగురు మాత్రమే తన నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని, మిగిలిన వారంతా తనకు హరతులిస్తున్నారని, తన నాయకత్వాన్ని సమర్దిస్తున్నారని రేవంత్ రెడ్డి చెప్పుకున్నారనుకోండి అది వేరే విషయం. కానీ వాస్తవమేమిటో గాంధీ భవన్ వర్గాలే చెప్పేస్తున్నాయి. నలుగురైదుగురు మాత్రమే రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని సమర్దిస్తున్నారని గాంధీ భవన్ వర్గాల సమాచారం. కోమటిరెడ్డి, జగ్గారెడ్డి, నిన్న మొన్న పార్టీ వదిలి పోయిన మర్రి శశిధర్ వంటి కొందరు బహిరంగంగా రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తే, పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ కుమార్ రెడ్డి, సీఎల్పీ మాజీ నాయకుడు జానా రెడ్డి వంటి సీనియర్లు లోపాయికారిగా ఆ వ్యతిరేకించేవారికి మద్దతునిస్తున్నారని ఆ వర్గాలు చెబుతున్నాయి.