వృద్ధులకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు గానీ, వారి సంరక్షణకు సంబంధించిన చట్టాలు గానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఏమాత్రం పట్టడం లేదనిపిస్తోంది. నిజానికి, భారతీయ పురాణ సాహిత్యమంతా పిల్లలు తమ వృద్ధ తల్లితండ్రుల సంరక్షణ కోసం పాటుపడిన కథలతోనే నిండి ఉంటుంది. అయితే, ప్రస్తుత భారతదేశంలో పిల్లల మీద పాశ్చాత్య దేశాల ‘వ్యక్తి ప్రాధాన్యం’, ‘పరిపూర్ణ స్వేచ్ఛ’ వగైరాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. నిజానికి ఇప్పటి భారతీయ యువత సాంప్రదాయికత, నవీనతల మధ్య అడకత్తెరలో పోక చెక్క మాదిరిగా నలుగుతున్న సూచనలు కూడా కనిపిస్తున్నాయి. యువతలో వస్తున్న మార్పుల ప్రభావం వృద్ధుల జీవన శైలి మీద ఎటువంటి ప్రభావాన్ని కనబరుస్తోందన్నది ప్రస్తుత పరిస్థితుల్లో అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.
సుమారు ఇరవయ్యేళ్ల క్రితం, అంటే 2004 ప్రాంతంలో ఎన్.ఎస్.ఎస్ దేశవ్యాప్తంగా వృద్ధుల మీద ఒక సమగ్ర అధ్యయనాన్ని నిర్వహించినప్పుడు, వృద్ధులలో అత్యధిక శాతం మంది తమ పిల్లల మీదో, మనవళ్ల మీదో ఆర్థికంగా ఆధారపడుతున్నట్టు వెల్లడైంది. 2011 సేకరించిన జనాభా లెక్కల ప్రకారం, భారతదేశంలో 60 ఏళ్లు పైబడిన వృద్ధుల సంఖ్య 11 కోట్ల వరకూ ఉంది.ఇందులో 5.30 లక్షల మంది మహిళలు కాగా, మిగిలినవారు పురుషులు.ఇళ్లలో వృద్ధుల బాగోగులను పిల్లలు ఎలా చూసుకుంటున్నారనే దానిపై 2015లో హెల్పేజ్ ఇండియా సర్వే చేసినప్పుడు 73 శాతానికి పైగా వృద్ధులను పిల్లలు పట్టించుకోవడం లేదని, పైగా వారిని హింసిస్తున్నారని వెల్లడైంది. ఆందోళనకర విషయమేమిటంటే, వృద్ధుల పట్ల ఎవరెవరు ఏ విధంగా వ్యవహరిస్తున్నారని అధ్యయనం చేసినప్పుడు, బంధువులలో 32.5 శాతం మంది, స్నేహితులలో 21 శాతం మంది, ఇరుగు పొరుగువారిలో 20 శాతం మంది వృద్ధులను వేధిస్తున్నట్టు తెలియవచ్చింది. ప్రస్తుతం వైద్య రంగం ఎంతగానో పురోగతి సాధిస్తుండడం, ఆరోగ్య సంరక్షణ అనేది అందరికీ అందుబాటులోకి వస్తుండడం వంటి కారణాల వల్ల వృద్ధుల సంఖ్య బాగా పెరుగుతోంది. 2026 నాటికి వృద్ధుల జనాభా 17.5 కోట్లు దాటుతుందని అంచనా.
కఠిన శిక్షలు అవసరం
ఈ వృద్ధులు వారు యవ్వనంలో అనుభవించిన జీవితం లాగే ఇప్పుడు కూడా అనుభవించడానికి వీలైన సౌకర్యాలను, వాతావరణాన్ని కల్పించడం ప్రభుత్వాల ముందున్న పెద్ద సవాలు. అటువంటి అవకాశాలేవీ కనుచూపు మేరలో కనిపించకపోగా, వారిని వేధించడం, పట్టించుకోకపోవడం, చులకనగా చూడడం వంటివి రానురానూ పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. పెద్దవాళ్లను ఈ విధంగా నిర్లక్ష్యం చేయడం, వేధించడం, హింసపెట్టడం వంటివి రోజు రోజుకూ పెరుగుతున్నప్పుడు ఈ పరిస్థితిని నిరోధించడానికి సామాజికంగా, పాలనాపరంగా జరుగుతున్నదేమైనా ఉందా? నిజానికి, వృద్ధుల పట్ల పెరుగుతున్న నిరాదరణను తగ్గించడానికి, వారికి తగిన భద్రత కల్పించడానికి, వారి మీద వేధింపులు జరగకుండా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం 2007లో తల్లితండ్రులు, వృద్ధుల నిర్వహణ, సంక్షేమ చట్టాన్ని రూపొందించడం జరిగింది. తల్లితండ్రుల సొమ్ము లేదా ఆస్తి తింటూ కూడా పిల్లలు వారిపై దౌర్జన్యాలు జరపడాన్ని, వేధించడాన్ని, నిర్లక్ష్యం చేయడాన్ని ప్రభుత్వం అప్పట్లో సీరియస్‌గా తీసుకుంది.
వృద్ధులకు ఆర్థికంగా ఆసరాగా ఉంటూనే, పిల్లలు వారి బాగోగులు చూసుకోవాలని, వారికి ఇంట్లో రక్షణ కల్పించాలని ఈ చట్టం నిర్దేశిస్తోంది. వారసత్వంగా వచ్చిన సంపదను, తల్లితండ్రుల ప్రావిడెంట్‌ఫండ్, పింఛను సౌకర్యాలను అనుభవిస్తున్న పిల్లలు తప్పనిసరిగా తమ తల్లితండ్రుల బాగోగులను చూసుకోవలసి ఉంటుందని కూడా ఆ చట్టం స్పష్టంగా చెబుతోంది. ఈ చట్టాన్ని 2019లో సవరించడం కూడా జరిగింది. వృద్ధులను బాధించి బయటకు పంపేసిన పక్షంలో వారికి నిర్వహణ ఖర్చుల కింద పది వేల రూపాయలను చెల్లించాలనే నిబంధనను, ఆ పరిమితిని తొలగించడం జరిగింది. వృద్ధులు భౌతికంగా, మానసికంగా ఆరోగ్యంగా బతకడానికి కావలసిన సౌకర్యాలను కల్పించాల్సిన బాధ్యత పిల్లలదేనని చెప్పి, పిల్లలకు సంబంధించిన నిర్వచనాన్ని కూడా మరింత విస్తృతం చేసింది.
ఈ చట్టం గానీ, ఇందులో చేసిన సవరణలు గానీ వృద్దులకు ఏమాత్రం ఉపశమనం కలిగించేవిగా లేవు. ప్రభుత్వాలు ఈ బాధ్యతను కొంత తాము తీసుకోకపోగా, పూర్తిగా వారి పిల్లలకే ఆబాధ్యతను వదిలేయడం వల్ల పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు సాధ్యంకావడం లేదు. పైగా, ప్రభుత్వం ఈ బాధ్యతను పిల్లలకే వదిలేసి, తనబాధ్యత తీరిందన్నట్టు చేతులు కడిగేసుకోవడం వృద్ధుల సమస్యల్ని మరింతగా పెంచింది. ఇందిరా గాంధీ జాతీయ వృద్ధాప్య పింఛన్ పధకం కిందదారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వృద్ధులకు నెలకు 200 నుంచి 500 రూపాయలు చెల్లించడం వృద్ధుల సమస్యకు ఏ విధంగా పరిష్కారం అవుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. హుందాగా జీవించడానికి, ఇతరుల మీద ఆధారపడకుండా బతకడానికి ఇది ఏమాత్రం సరిపోదనే సంగతి ఎవరికైనా తేలికగా అర్థమవుతుంది.
సంక్షేమం, సంరక్షణ శూన్యం
మొత్తం మీద దేశంలో వృద్ధులకంటూ పటిష్ఠమైన సామాజిక సంక్షేమ కార్యక్రమాలేవీ అమలు జరగడం లేదన్నది వాస్తవం. పేదలకు, మహిళలకు, బలహీనవర్గాలకు వర్తించే కొన్ని సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను వృద్ధులకు వర్తింపజేయవచ్చు. ఈ పథకాలను వృద్ధులకు చేర్చాల్సిన లేదా అందించాల్సిన సంక్షేమ అధికారులు సహజంగానే వృద్ధుల పట్ల నిర్లక్ష్యంతో వ్యవహరించడం జరుగుతోంది. తమకు పింఛనులు, ఇతర ఆర్థిక సహాయాలు అందనప్పుడు వారు ఫిర్యాదు చేసుకోలేకపోతున్నారు. ఫిర్యాదు చేయడానికి వెళ్లినా అధికారులు వీరిని పట్టించుకోవడం లేదన్నది జగమెరిగిన సత్యం. వృద్ధులను నిర్ణక్ష్యం చేయడం, వారిని వేధించడం, వారిని దుర్భాషలాడడం వంటి చట్ట ప్రకారం నేరం కిందకే వస్తాయి. కానీ, అధికారులకు ఇవేమీ పట్టడం లేదు. ఇక చాలామంది వృద్ధులకు తమ హక్కుల గురించి, వాటి కోసం పోరాడాల్సిన అవసరం గురించి పెద్దగా తెలియదు. న్యాయస్థానాల తలుపులు తట్టడం అనేది అంత తేలిక కాదనే విషయం మాత్రమే వారికి తెలుసు.
ఇక ఈ తల్లితండ్రులు, వృద్ధుల నిర్వహణ, సంక్షేమ చట్టం ఉద్దేశాలన్నీ సదుద్దేశాలే కానీ ఈ చట్టంలో అనేక లోపాలు, లొసుగులు కూడా ఉన్నాయి. ఈ చట్టం సివిల్ కేసులకు సంబంధించినది. అందువల్ల ఈ కేసులను పట్టించుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ఉంటారు. వృద్ధులను, సీనియర్ సిటిజెన్లను నిర్లక్ష్యం చేయడానికి సంబంధించిన కేసులను విచారించడానికి ట్రైబ్యునల్స్ ఉన్నాయి కానీ, ఇవి చాలా తక్కువ ప్రాంతాలకు మాత్రమే పరిమితం. పైగా వృద్ధులను వేధించడం, దుర్భాషలాడడం, సతాయించడం, నిర్లక్ష్యం చేయడం వంటి చర్యలకు ప్రత్యేక నిర్వచనాలు అంటూ ఏమీ లేవు. వాటిని నిర్ధారించడం కూడా జరిగే పని కాదు. చాలా సందర్భాలలో ఇటువంటి కేసులు కుటుంబ సభ్యుల మధ్యే పరిష్కారం అవుతుంటాయి. అంతేకాదు, ఈ చట్టం ఒకటి ఉందన్న విషయంకూడా చాలామందికి తెలియదు. హెల్ప్‌లైన్స్ ఉన్నా చాలామందికి వీటిని ఉపయోగించుకోవడం తెలియదు. ఒకవేళ ఈ చట్టాన్ని ప్రయోగించినా దాన్ని సమర్థంగా, పటిష్ఠంగా, కఠినంగా ప్రయోగించడం జరగడం లేదు.
అధికారుల్లోనూ నిర్లక్ష్యం
వృద్దుల పట్ల పిల్లలు గానీ, మరెవరైనా గానీ నిర్లక్ష్యంతో వ్యవహరించినప్పుడు, వేధించినప్పుడు, దుర్బాషలాడినప్పుడు అధికారులు వెంటనే రంగంలోకి దిగి ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాల్సి ఉంటుంది. మీడియాకూడా దీనికి శీఘ్రంగా స్పందించాల్సి ఉంటుంది. వృద్ధులను సతాయించడం అనేది ఒక్కొక్కసారి ఉద్దేశపూర్వకంగా జరగకపోవచ్చు. వృద్ధుల మానసిక ఆరోగ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన చట్టాన్ని మరింత పకడ్బందీగా, కఠినంగా ఉపయోగించడం వల్ల వృద్ధుల జీవితాలు సాఫీగా సాగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఐక్యరాజ్య సమితి 2021-30ని వృద్ధుల సంక్షేమ దశాబ్దంగా ప్రకటించింది.ఈ దశాబ్ద కాలంలో వృద్ధుల హక్కుల పరిరక్షణకు అటు ప్రభుత్వాలు, ఇటు సమాజాలు తీవ్రంగా పాటుపడాల్సి ఉంటుంది. వృద్దులు హుందా అయిన జీవితాన్ని గడపడానికి దోహదం చేయాల్సి ఉంటుంది. భారతదేశం వృద్ధుల పాలిటి స్వర్గధామంగా పేరు తెచ్చుకోవాల్సి ఉంటుంది.
డాక్టర్ వి. కనకదుర్గ