Thursday, September 19, 2024
Homeఓపన్ పేజ్Freedom of press: పత్రికా స్వేచ్ఛకు ప్రాధాన్యం

Freedom of press: పత్రికా స్వేచ్ఛకు ప్రాధాన్యం

కేరళకు చెందిన ‘మీడియా వన్‌’ అనే చానల్‌కు సంబంధించిన కేసులో సుప్రీం కోర్టు పత్రికా స్వేచ్ఛకు మళ్లీ పెద్ద పీట వేసింది. ఈ మీడియావన్‌ కేసులో కేరళ హైకోర్టు ఇంతకు ముందు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు తోసిపుచ్చుతూ, పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలు, పరిమితులు విధించడానికి సంబంధించి న్యాయవ్యవస్థ కొన్ని నిర్దిష్ట నిబంధనలను ప్రకటించాలని స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19(2) ప్రకారం, ఆంక్షలు, పరిమితులు విధించడానికి ప్రభుత్వ విధానాలను విమర్శించడం అనేది కారణం కారాదని తేల్చి చెప్పింది. అంతేకాక, బహిరంగ న్యాయానికే ప్రాధాన్యం ఇవ్వాలి తప్ప ‘సీల్డ్‌ కవర్ల’ న్యాయం సమంజసం కాదని రూలింగ్‌ ఇచ్చింది. చట్టం కింద పౌరులకు లభించే పరిష్కార మార్గాలను ప్రభుత్వాలు జాతీయ భద్రత పేరుతో తిరస్కరించడం జరుగుతోందని కూడా న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఇది రాజ్యాంగం ప్రకారం, చట్ట ప్రకారం సరైన చర్యగా కనిపించడంలేదనికూడాఅది పేర్కొంది.
కేరళకు చెందిన మలయాళం చానెల్‌ ‘మీడియా వన్‌’కు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పదేళ్ల క్రితం లైసెన్స్‌ మంజూరు చేసింది. అయితే, హోం మంత్రిత్వ శాఖ భద్రతకు సంబంధించిన ‘క్లియరెన్స్‌’ ఇవ్వనందువల్ల గత ఏడాది ఈ చానల్‌కు లైసెన్స్‌ రిన్యూవల్‌ కాలేదు. ఈ చానల్‌ ప్రమోటర్లకు, జమాత్‌-ఎ-ఇస్లామీ హింద్‌ అనే ముస్లిం సంస్థకు సంబంధాలు ఉన్నాయని, అందువల్ల భద్రతా కారణాల దృష్ట్యా ఈ చానల్‌కు క్లియరెన్స్‌ ఇవ్వడం లేదని ప్రభుత్వం తెలియజేసింది. ఈ చానల్‌కు లైసెన్స్‌ ఇవ్వడం అనేది జాతీయ భద్రతకు భంగకరమని అది స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన ఆధారాలను అది సీల్డ్‌ కవర్‌లో కేరళ హైకోర్టుకు అందజేసింది. జాతీయ భద్రతపై సుప్రీం కోర్టు నిర్మొహమాటంగా, ముక్కు సూటిగా కొన్ని అభిప్రాయాలను వ్యక్తం చేసింది. ఏది జాతీయ భద్రతో, ఏది కాదో నిర్ణయించాల్సింది, నిర్వచించాల్సింది న్యాయస్థానాలే తప్ప ప్రభుత్వాలు కాదని, ఇటువంటి అభిప్రాయాలకు రావడానికి తగిన ఆధారాలు కూడా ఉండాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
ప్రభుత్వం చేస్తున్న వాదన, అందజేసిన ఆధారాలు సరైనవా, కావా అని నిర్ణయించాల్సింది, తేల్చాల్సింది న్యాయస్థానాలని, అవసరమైతే ఒక అమికస్‌ క్యూరీని ఏర్పాటు చేసుకుని, ఈ ఆధారాలు సరైనవా, కావా అన్నది నిగ్గు తేల్చాల్సి ఉంటుందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. దీనివల్ల బాధితులకు న్యాయం జరగడమే కాకుండా, ప్రజలకు కూడా న్యాయవ్యవస్థ మీద నమ్మకం పెరుగుతుందని అది తెలిపింది. ఈ జమాత్‌-ఎ-ఇస్లామీ హింద్‌ అనే సంస్థ నిషేధిత సంస్థేమీ కాదని, ఈ సంస్థతో సంబంధాలు ఉన్నందువల్ల జాతీయ భద్రతకు, సార్వభౌమత్వానికి, దేశ సమగ్రతకు భంగం కలుగుతుందంటూ ప్రభుత్వం పేర్కొనడంలో అర్థం లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ సంస్థ దేశ భద్రతకు భంగం కలిగించే కార్యకలాపాలకు పాల్పడుతోందనడానికి ఆధారాలు ఉన్నప్పుడు ప్రభుత్వం ఆ సంస్థను నిషేధించి ఉంటే సరిపోతుందని కూడా న్యాయస్థానం స్పష్టం చేసింది.
దేశంలో ప్రజాస్వామ్యం సజావుగా, పటిష్ఠంగా పనిచేస్తూ ఉండాలంటే తప్పనిసరిగా పత్రికా స్వేచ్ఛ అనేది ఉండాలని సర్వోన్నత న్యాయ స్థానం అభిప్రాయపడింది. మీడియా వన్‌ చానల్‌ ప్రభుత్వ వ్యతిరేక అభిప్రాయాలను వ్యక్తం చేసినంత మాత్రాన జాతీయ భద్రతకు భంగం కలిగినట్టుగా భావించకూడదని, భావ వ్యక్తీకరణ హక్కును కాలరాయడం సమంజసం కాదని అది వివరించింది. ప్రభుత్వం జాతీయ భద్రత, దేశ సమగ్రత, సార్వభౌమాధికారం వంటి పదాలను ఉపయోగించడం వెనుక ఉద్దేశం పత్రికలు తమకు అనుకూలంగా రాయాలన్నదేనని అది తెలిపింది. పత్రికా స్వేచ్ఛ మీద పరిమితులు, ఆంక్షలు విధించడం వల్ల సమాజంలో మార్పుకు అవకాశం ఉండదని, ఆర్థిక, సామాజిక మార్పులు, వాటిలోని లోపాలు, సాధక బాధకాలు వివిధ రకాలుగా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంటుందని, ఇది పత్రికల వల్లే సాధ్యపడుతుందని అది గుర్తు చేసింది. వాస్తవానికి పత్రికలు మరింత స్వేచ్ఛగా, మరింత బాహాటంగా వ్యవహరించినప్పుడే ప్రజాస్వామ్యం మరింతగా బలపడుతుందని అది తెలిపింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News