YS Sharmila : ప్రగతిభవన్‌ను ముట్టడించేందుకు కారులో వెలుతున్న వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న దాడిలో అద్దాలు పగిలిన కారును స్వయంగా ఆమె డ్రైవింగ్ చేసుకుంటూ వస్తుండగా పంజాగుట్ట చౌరస్తా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. కారు నుంచి షర్మిలను బయటికి రావాలని పోలీసులు ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా అందుకు ఆమె నిరాకరించారు. ప్రగతి భవన్‌కు వెళ్లి తీరుతానని పట్టుబట్టారు.
కారు డోర్ లాక్ చేసి అందులో ఉండిపోయారు. చేసేది లేక పోలీసులు డ్రైవింగ్ సీటులో షర్మిల ఉండగానే క్రేన్ ద్వారా లిఫ్ట్ చేసి ఎస్ఆర్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం అతి కష్టం మీద కారు డోర్లు ఓపెన్ చేసి షర్మిలను పోలీస్ స్టేషన్‌లోకి తరలించారు. షర్మిలను ఎస్ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఉంచడంతో వైఎస్ఆర్‌టీపీ కార్యకర్తలు అక్కడకు చేరుకుని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీంతో వైఎస్ఆర్‌టీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు.
ఇంకోవైపు ఇక తన కుమారై షర్మిలను అరెస్ట్ చేశారని తెలియడంతో వైఎస్ విజయమ్మ ఎస్ఆర్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలని ప్రయత్నించారు. అయితే.. పోలీసులు ఇంటి వద్దే విజయమ్మను అడ్డుకున్నారు.
మరోవైపు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో షర్మిల పై కేసు నమోదైంది. వీఐపీ రహదారిపై ట్రాఫిక్ అంతరాయం కలిగించారనే ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేశారు. 333, 353, 337 సెక్షన్ల కింద షర్మిల పై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.