చాలామంది ‘నడిపించు నా నావా, నడి సంద్రమున దేవ’ వంటి క్రైస్తవ పాటలు అనేకం వినే ఉంటారు. క్రైస్తవులే కాక, క్రైస్తవేతరులు సైతం పాడుకునే ఈ శ్రావ్యమైన ఏసుక్రీస్తు భక్తి పాటలను రాసింది పురుషోత్తమ చౌదరి. 1803 సెప్టెంబర్‌లో పుట్టి 1890లో కన్నుమూసిన పురుషోత్తమ చౌదరి 19వ శతాబ్దంలో సాటి లేని మేటి క్రైస్తవ కవిగా, గీత రచయితగా ప్రసిద్ధి పొందారు. ఆయన క్రైస్తవ మత ప్రచారకుడు, బరంపురం చర్చిలో పాస్టర్‌గా పనిచేశారు. తెలుగునాట క్రైస్తవంలో భక్తి సంప్రదాయానికి సంబంధించినంత వరకు ఆయన ఓ వాగ్గేయకారుడుగా కూడా గుర్తింపు పొందారు. పశ్చిమ బెంగాల్‌లోని మదనపూర్‌లో కూర్మనాథ చౌదరి, సుభద్ర అనే దంపతులకు జన్మించిన పురుషోత్తం అతి తక్కువ కాలంలోనే ఒరియా, కన్నడ, తమిళం, తెలుగు భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు. అప్పట్లో ఈ ప్రాంతాలన్నీ మద్రాస్ ప్రెసిడెన్సీ కింద ఉండేవి. మదనపూర్‌లో కూడా తెలుగు మాట్లాడేవారి సంఖ్య చాలా ఎక్కువ. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం పట్టణాలు ఈ ప్రాంతానికి దగ్గరగా ఉండేవి. అందువల్ల ఆయనకు తెలుగు భాషలో ప్రావీణ్యం సంపాదించడం, తెలుగు సాహిత్యం పట్ల మక్కువ ఏర్పడడం సహజంగా జరిగిపోయింది.
ఇక 1825 ప్రాంతంలో ఆయన తన సోదరుడు జగన్నాథ చౌదరి ప్రోద్బలంతో క్రైస్తవ మతం గురించి తెలుసుకోవడం ప్రారంభించారు.1833 అక్టోబర్‌లో ఆయన క్రైస్తవ మతం స్వీకరించడం జరిగింది. శ్రీకాకుళం, విజయనగరం పట్టణాలలో చదువుకున్న పురుషోత్తం ఆ తర్వాత పర్లాకిమిడిలో ఉపాధ్యాయుడుగా పనిచేశారు. 1834లో ఆయన మద్రాసులో ఒక క్రైస్తవ మత ప్రచార సంస్థలో పనిచేస్తూ, మత ప్రచారం ప్రారంభించారు. మొదట్లో క్రైస్తవ బోధనలకే పరిమితమైన పురుషోత్తం ఆ తర్వాత క్రమంగా బైబిల్ కథలను, బైబిల్ సూక్తులను ప్రచారం చేయడం ప్రారంభించారు. అప్పట్లో మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న శ్రీకాకుళం, విజయనగరం, మద్రాస్, నెల్లూరు, బళ్లారి తదితర ప్రాంతాలలో విస్తృతంగా పర్యటిస్తూ ఆయన ఏసుక్రీస్తు బోధనలను ప్రచారం చేస్తుండేవారు. ఆ తర్వాత ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని అనేక ప్రాంతాలలో పర్యటించిన పురుషోత్తమ చౌదరి ‘గాస్పెల్ ఆఫ్ గాడ్’ వంటి ప్రసిద్ధమైన గ్రంథాలను రాశారు. అనేక క్రైస్తవ గ్రంథాలను తెలుగులోకి అనువాదం చేశారు. ఆయన మనుమడు జాన్ చౌదరి ఆయన జీవిత కథ ‘రెవరెండ్ పురుషోత్తం చౌదరి’ను రాయడం జరిగింది. పురుషోత్తం రాసిన ‘నీలాచల విలాసం’ అనే పద్య కావ్యం, ‘కులాచార పరీక్ష’, ‘ముక్తి మార్గ ప్రదర్శనం’, ‘ఏసుక్రీస్తు ప్రభు శతకం’, ‘అంధకార నాశనము’ వంటి గ్రంథాలు ఎంతో ప్రసిద్ధి చెందాయి.
నడిపించు నా నావా, సందేహమేలా, వచ్చుచున్నాను వంటి శీర్షికలతో పురుషోత్తం రాసిన పాటలు బాగా పాపులర్ అయ్యాయి. పందొమ్మిదవ శతాబ్దంలో గ్రామగ్రామాన ఈ పాటలు మార్మోగిపోతుండేవి. క్రైస్తవ గీతాలతో ఆయన రాసిన పుస్తకాలు, ఆయన రాసిన పద్యాలకు ఎంతగానో ప్రాచుర్యం, గుర్తింపు లభించాయి. ఈ రికార్డులు అమ్మకాలలో సరికొత్త రికార్డులు సృష్టించాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని గ్రామాల్లో ఆయన ఈ శ్రావ్యమైన గీతాలతోనే ప్రజలకు బాగా ఆకట్టుకున్నారు. నిజానికి ఈ పాటలకు, ఆయన రాసిన ఇతర గ్రంథాలకు ఇప్పటికీ జనాకర్షణ ఉందంటే అందులో అతిశయోక్తేమీ లేదు. 1890లో తుది శ్వాస విడిచేవరకూ ఆయన తన భక్తి మార్గాన్ని కానీ, మత ప్రచారాన్నిగానీ, గీత రచనను కానీ వదిలిపెట్టలేదు. ముఖ్యంగా ఆయన క్రైస్తవ సాహిత్య సేవకు పూర్తిగా అంకితమయిపోయారు. ఈ పాటలు ప్రజల నోళ్లలో నానుతున్నంత కాలం ఆయన పేరు తెలుగు నాట మార్మోగుతూనే ఉంటుంది. జి. రాజశుక