కరీంనగర్ పర్యాటక శోభను పెంచుతూ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తీగల వంతెన నిర్మాణ పనులను ఏప్రిల్ 14 నాటికి పూర్తిచేయాలని రాష్ట్ర బీసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కరీంనగర్ రూపురేఖలను అభివృద్దిపరుస్తూ విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో పర్యాటకులను ఆకర్షించి, పర్యాటకశోభ ఉట్టిపడేలా నిర్మిస్తున్న తీగల వంతెన నిర్మాణ పనులను మంత్రి గంగుల కమలాకర్, నగర మేయర్, జిల్లా కలెక్టర్, పోలీస్ కమీషనర్ మరియు ఇతర ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, కరీంనగర్ లోయర్ మానేరుపై విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న తీగల వంతెన నిర్మాణ పనులను సత్వారం పూర్తి చేసి ఏప్రిల్ 14 నుండి రాకపోకలు ప్రారంభించాలని, సంబంధిత శాఖల అధికారులను మంత్రి ఆదేశించారు. బ్రిడ్జి మొదలు సదాశివల్లి వరకు రోడ్డు నిర్మాణ పనులను యుద్దప్రాతిపదికన పూర్తయ్యేలా చర్యలను తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ వై. సునీల్ రావు, జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్, సిపి సుబ్బారాయుడు, ఈ ఈ సాంబశివరావు,అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గోన్నారు.