Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Thirst for knowledge: డబ్బును కాదు జ్ఞానాన్ని వెంబడించండి

Thirst for knowledge: డబ్బును కాదు జ్ఞానాన్ని వెంబడించండి

భారత్ లోని ఐటి దిగ్గజ కంపెనీలలో ఒకటైన ఇన్ఫోసిస్, బ్రాండ్ ఫైనాన్స్ ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన మొదటి మూడు ఐటి సేవల బ్రాండ్‌లలో ఒకటిగా నిలిచినట్లు ప్రకటించింది. బ్రాండ్ ఫైనాన్స్ గ్లోబల్ 500 2023 నివేదిక ప్రకారం, 2020 నుండి బ్రాండ్ విలువలో 84 శాతం వృద్ధితో ఇన్ఫోసిస్ ఇప్పుడు ప్రపంచంలోని టాప్ 150 విలువైన బ్రాండ్‌ల సరసన చేరింది. ఇంతటి ఘనత సాధించిన ఈ కంపెనీ వ్యవస్థాపకుడు ఎన్ ఆర్ నారాయణ మూర్తిగా సుపరిచితుడైన నాగవర రామారావు నారాయణ మూర్తి ఆయన సతీమణి పద్మభూషణ్ సుధా మూర్తిలు అత్యంత నిరాడంబర జీవితాన్ని గడుపుతూ “ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండమని మొక్క నీకు చెబుతుంది” అన్న సూక్తిని ఆచరించే సజీవ ఉదాహరణలుగా మనకు దర్శనమిస్తారు.

- Advertisement -

1967 లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ (ఎన్ ఐ టి) నుండి ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్, 1969 లో కాన్పూర్ లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐ ఐ టి) నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత నారాయణ మూర్తి తనను కోరి వచ్చిన ఎయిర్ ఇండియా ఉద్యోగ ప్రతిపాదనను తిరస్కరించడమే కాక అందులో సగం జీతానికే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐ ఐ ఎం), అహ్మదాబాద్ లో చీఫ్ సిస్టమ్స్ ప్రోగ్రామర్‌గా చేరారు. ఆయన మొట్టమొదట ఉద్యోగం చేసిన సంస్థ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐ ఐ ఎం), అహ్మదాబాద్ లో 2 ఏప్రిల్ 2023న జరిగిన 58వ స్నాతకోత్సవానికి (కాన్వోకేషన్) ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆనాడు ఆయన ఎయిర్ ఇండియా ఉద్యోగ ప్రతిపాదనను తిరస్కరించడం వెనుక గల తన మనోగతాన్ని సభికులతో పంచుకున్నారు.

1981లో ముంబైలో ఒక పడకగది (Single Bed Room) అపార్ట్మెంట్ లో నిరాడంబరమైన మూలాలకు చెందిన ఏడుగురు యువ ఇంజనీర్లతో కేవలం 250 డాలర్ల పెట్టుబడితో నిరాడంబర మూలాలకు చెందిన ఏడుగురు యువ ఇంజనీర్లతో ప్రారంభమైన ఇన్ఫోసిస్ (Infosys) ప్రయాణం నేడు దాదాపు $80 బిలియన్ల మార్కెట్ క్యాపిటలైజేషన్, $16 బిలియన్ల కంటే ఎక్కువ ఆదాయం మరియు 3.35 లక్షల కంటే ఎక్కువ మంది ఉద్యోగులను కలిగి ఉంది. కార్పొరేట్ పాలన మరియు ప్రజాస్వామ్యబద్ధమైన సంపద సృష్టి దృష్ట్యా ఇది సరికొత్త నమూనాను సృష్టించి భారతదేశపు అత్యంత గౌరవనీయమైన కంపెనీలలో ఒకటిగా నిలుస్తోంది.

వ్యక్తిగత ప్రస్థానం:

కాన్పూర్ లోని ఐ ఐ టి నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆయన ప్రతిభను గుర్తించిన ప్రతిష్టాత్మక సంస్థలైన టెల్కో, టిస్కో మరియు ఎయిర్ ఇండియా లు తమ సంస్థలలో పనిచేయడానికి ఆయనకు అప్పట్లోనే నెలకు దాదాపు రూ.1,600 జీతం ఇచ్చేలా ఉద్యోగ ప్రతిపాదనలు చేసాయి. అయితే, భారతదేశ ఐటి రంగానికి మార్గదర్శకునిగా సేవలందించడానికి వలచి వచ్చిన అధిక జీతాన్ని వదులుకుని అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో చీఫ్ సిస్టమ్స్ ప్రోగ్రామర్‌గా చేరడానికే ఆయన మొగ్గు చూపారు. 1969లో ప్రపంచంలోనే హార్వర్డ్ మరియు స్టాన్‌ఫోర్డ్ తర్వాత ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌, ఆహ్మదాబాద్ లో భారతదేశపు మొట్టమొదటి టైమ్-షేరింగ్ కంప్యూటర్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసే ప్రక్రియ కార్యరూపం దాల్చనుంచడంతో తాను ఆ నిర్ణయం తీసుకున్నానన్నారు. ఐఐఎం అహ్మదాబాద్ లో చేరడం ద్వారా తన విషయ పరిజ్ఞానం మెరుగుపర్చుకునేందుకు చాలా అవకాశాలుంటాయని తెలుసినప్పటికీ తక్కువ జీతం ఒక ప్రతిబంధకంగా అనిపించి ఏది ఎంచుకోవాలో తెలియని అనిశ్చితిలో మార్గదర్శనం కోసం తన గురువు వద్దకు వెళ్ళగా ఆయన “డబ్బుకు బదులుగా జ్ఞానాన్ని వెంబడించమని” సలహా ఇచ్చినట్లు ఐ ఐ ఎం అహ్మదాబాద్ ఆర్కైవ్స్ ఓరల్ హిస్టరీ ప్రాజెక్ట్‌లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆధునిక ఆపరేటింగ్ సిస్టమ్ గురించి తెలుసుకునే అవకాశాన్ని ఒడిసి పట్టుకోవాలని, ఎంతో తెలివైన విద్యార్థులతో పరస్పరం సంభాషించే అవకాశాన్ని చేజిక్కించుకోవాలని, చాలా మంది నిపుణులను సృష్టించే అవకాశం గురించి తెలుసుకోవాలనే తపనతో పాటు కంప్యూటర్ లను ఉపయోగించి విద్యార్థుల కోసం అకౌంటింగ్, సిమ్యులేషన్, ఫైనాన్స్, ప్రొడక్షన్ మొదలైన అంశాలలో పాఠ్యాంశాలను రూపొందించి నైపుణ్యం గల వ్యక్తులను తీర్చిదిద్దాలన్న సంకల్పంతో 16 మంది విద్యార్థుల బ్యాచ్ నుండి సగం జీతం తీసుకున్న ఏకైక వ్యక్తిని తానేనని ఆయన తెలిపారు. బహుశా అది తన జీవితంలో తీసుకున్న అత్యుత్తమ నిర్ణయం అని ఆయన వెల్లడించారు.

జీవితంలో అతిపెద్ద పశ్చాత్తాపం గురించి ఆయన మాట్లాడుతూ, తన స్వీయ హస్తాలతో పురుడుపోసుకుని ఇంతింతై వటుడింతై అన్నట్లు ఎదిగిన సంస్థ ఇన్ఫోసిస్‌ ను సందర్శించేందుకు తన తల్లిని జీవిత చరమాంకంలో ఆహ్వానించడం తన జీవితంలో తీరని బాధగా నిలిచిపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

“కారుణ్య పెట్టుబడిదారు”గా మారిన “అయోమయ వామపక్షవాది”:

ప్రారంభంలో తనలో నిగూఢంగా నిక్షిప్తమై ఉన్న “అయోమయ వామపక్షవాది” ఆ తర్వాత సంవత్సరాలలో “కారుణ్య పెట్టుబడిదారు”గా ఎలా రూపాంతరం చెందాడో ఆయన గుర్తు చేసుకున్నారు. సాధారణంగా మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన వ్యక్తులకు చిన్ని చిన్ని ఆశలు, కలలు ఉంటాయని తాను కూడా అందుకు మినహాయింపు కాదని ఆయన అన్నారు. జీవితపు తొలినాళ్లలో తన సామాజిక, ఆర్థిక నేపథ్యం ఆధారంగా జీవితంలో తన పురోగతి పరిమితంగానే ఉంటుందని తాను ఎప్పుడూ భావించేవాడినని ఆయన గుర్తుచేసుకున్నారు. మొదట్లో ప్రభుత్వ యంత్రాంగంలో వేళ్ళూనుకున్న అవినీతి మరియు ప్రభుత్వాధికారులతో మానవ సంబంధాలు విజయానికి ముఖ్యమని తాను భావించేవాడినని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు అన్నారు. అయితే ఫ్రెంచ్ కంపెనీలో పని చేయడం, జీవితంలో విజయంపై తన దృక్పథాన్ని ఎలా మార్చివేసిందో గుర్తు చేసుకున్నారు. తాను పారిస్‌లోని ఒక ఫ్రెంచ్ రియల్ టైమ్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేయడానికి వెళ్ళిన సందర్భంగా తనలోని తిరోగమన మనస్తత్వం పూర్తిగా మారిపోయిందన్నారు. స్వేచ్ఛా విపణి, కారుణ్య పెట్టుబడిదారీ విధానం నేపథ్యంలో దేశంలో ఉపాధి అవకాశాలు సృష్టించడంతో పాటు దేశాభివృద్ధిలో వ్యవస్థాపకత (Entrepreneurship) గొప్ప శక్తివంతమైన పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు. పెట్టుబడిదారీ విధానం పట్ల ప్రజలను ఆకర్షింపచేయడానికి అవలంబించాల్సిన పద్ధతులను ఆయన వివరించారు. ప్రపంచవ్యాప్తంగా మరీ ముఖ్యంగా ఎక్కువ మంది పేద ప్రజలు నివసించే భారత్ లాంటి దేశాలలో కార్పొరేట్ నాయకులు స్వీయ నిగ్రహాన్ని పాటిస్తూ వారి జీతభత్యాలు, ప్రోత్సాహకాలను వీలైనంత మేర కుదించుకోవడం, ఆడంబర జీవితాలను త్యజించడం లాంటి చర్యలను చేపట్టడం ద్వారా పెట్టుబడిదారీ విధానం పట్ల ప్రజలను ఆకర్షింపచేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ధైర్యం, త్యాగం, ఆశావహ దృక్పథం, ఆత్మవిశ్వాసం, నూతన ఆవిష్కరణలపై అనురక్తి, కృషి, సత్యపరిపాలన, న్యాయబద్ధత, పారదర్శకత, జవాబుదారీతనం, కాఠిన్యం, క్రమశిక్షణ లాంటి ఉన్నత విలువలను ప్రదర్శిస్తూ సమాజానికి ఒక ఉదాహరణగా నిలచేలా కార్పోరేట్ లీడర్లు ఎదగాలని ఆయన అన్నారు. స్వల్ప మరియు మధ్యకాలిక ఫలితాలను రాబట్టడంలో వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా కంపెనీ ప్రయోజనాల కోసం కృషి చేసినప్పుడు దీర్ఘకాలికంగా వ్యక్తిగత ప్రయోజనాలు కూడా సిద్ధిస్తాయన్న విషయాన్ని కార్పోరేట్ లీడర్లు గుర్తించాలన్నారు.

సుధామూర్తి మాటల్లో:

“ప్రతి నెలా కొంత డబ్బు ఆదా చేయాలని, ఆ డబ్బును కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించాలని తన తల్లి చేసిన సూచన మేరకు తాను నారాయణ మూర్తి తో వివాహం తరువాత కొంత డబ్బు ఆదా చేసానని 1981 లో ఆయన సాఫ్ట్‌వేర్ విప్లవం యొక్క ప్రాముఖ్యతను నాకు వివరించినప్పుడు నేను అక్కటే అనుకున్నాను. ఆయన కలలు కంటున్న ఒక ఔత్సాహికుడు. అతని కలలు సాకారమవుతాయో లేదో తెలియనప్పటికీ, అతను కష్టపడి పనిచేసే వ్యక్తి అని మాత్రం నాకు తెలుసు. అతను ఏదో చేయాలని తాపత్రయపడుతున్నాడు. ఇది నాకు అత్యవసరమనిపించింది. ఈ సమయంలో నేను చేయూతనందించక పొతే అతను తన జీవితాంతం పశ్చాత్తాపపడతాడు. పశ్చాత్తాపం వైఫల్యం కంటే ఘోరమైనది. తన ప్రయత్నంలో ఆయన వైఫల్యం పొందినా పర్వాలేదు. ఒకవేళ అదే జరిగితే తన వైఫల్యాన్ని అంగీకరించి ఆయన ఉద్యోగంలో చేరవచ్చు, కానీ చింతించడం దారుణం అనిపించి నేను దాచుకున్న పది వేలు ఇచ్చాను” అన్నారు.

వ్యక్తిగతం:

20 ఆగష్టు 1946 న కర్ణాటక రాష్ట్రం చిక్కబళ్ళాపూర్ జిల్లాలోని సిద్లఘట్ట పట్టణంలో ఒక మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన నారాయణ మూర్తి అక్టోబర్ 2022 నాటికి 4.5 బిలియన్ డాలర్ల వ్యక్తిగత నికరవిలువ తో ప్రపంచంలోని ధనవంతుల జాబితాలో 654వ స్థానంలో ఉన్నట్లు ఫోర్బ్స్ (Forbs) ప్రకటించింది. ఆయనను ప్రపంచంలోని 12 మంది అతి గొప్ప వ్యవస్థాపకుల (entrepreneur) లో ఒకరిగా అమెరికా లోని న్యూయార్క్ నుండి వెలువడే మల్టీనేషనల్ వాణిజ్య పత్రిక “ఫార్చ్యూన్” (Fortune) పేర్కొంది. 1981లో ఆయన తన సహధర్మచారిణి, ప్రముఖ సంఘసేవకురాలు, పద్మభూషణ్ డా సుధామూర్తి అందించిన పది వేల రూపాయల ఆర్ధిక సాయంతో మరో ఆరుగురు ఐ టి నిపుణులతో కలిసి ఇన్ఫోసిస్‌ను ప్రారంభించి, 1981 నుంచి 2002 వరకు ఆ సంస్థ ముఖ్య కార్య నిర్వహణాధికారి (CEO) గా, 2002 నుంచి 2011 వరకు చైర్మన్‌గా కొనసాగారు. 2011లో బోర్డు నుంచి వైదొలిగి ఎమిరిటస్ చైర్మన్ అయ్యారు. జూన్ 2013లో, ఐదేళ్ల కాలానికి ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. భారతదేశంలో ఔట్‌సోర్సింగ్‌ విధానం కోసం ఆయన చేసిన కృషిని కీర్తిస్తూ “టైమ్” మ్యాగజైన్ మరియు సి ఎన్ బి సి (CNBC) లు ఆయనను “భారత ఐటి రంగ పితామహుడు”గా అభివర్ణించాయి. 2005లో, ఆయన స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన “వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌”కు సహాధ్యక్షుడిగా వ్యవహరించారు. ఐ టి రంగానికి ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఆయనను పద్మవిభూషణ్ మరియు పద్మశ్రీ పురస్కారాలతో సత్కరించింది.

ఆయన HSBC యొక్క కార్పొరేట్ బోర్డులో స్వతంత్ర డైరెక్టర్ గానే కాక DBS బ్యాంక్, యూనిలీవర్, ICICI మరియు NDTV బోర్డులలో డైరెక్టర్‌గా ఉన్నారు. అతను కార్నెల్ విశ్వవిద్యాలయం, INSEAD, ESSEC, ఫోర్డ్ ఫౌండేషన్, UN ఫౌండేషన్, ఇండో-బ్రిటిష్ పార్టనర్‌షిప్, ఆసియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ సహా అనేక విద్యా మరియు దాతృత్వ సంస్థల సలహా బోర్డులు మరియు కౌన్సిల్‌లలో సభ్యుడుగా, ఇన్ఫోసిస్ ప్రైజ్, ప్రిన్స్‌టన్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్‌డ్ స్టడీ, రోడ్స్ ట్రస్ట్ ల ధర్మకర్తగా, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా పాలక మండలి ఛైర్మన్‌గా, బ్రిటిష్ టెలికమ్యూనికేషన్స్ యొక్క ఆసియా పసిఫిక్ అడ్వైజరీ బోర్డులో కూడా ఉన్నారు.

నాలుగు దశాబ్దాల క్రితం కేవలం పది వేల రూపాయల పెట్టుబడితో పాటు అచంచలమైన దృఢ విశ్వాసం, అకుంఠిత దీక్ష, కఠోర పరిశ్రమ, క్రమశిక్షణ లతో భారత్ లోనే కాక యావత్ ప్రపంచంలో కీర్తిప్రతిష్టలు పొందేలా ఇన్ఫోసిస్ ను తీర్చిదిద్దిన నారాయణ మూర్తి ఇతివృత్తాన్ని ఆదర్శంగా తీసుకుని యువత డబ్బును కాక జ్ఞానాన్ని ఛేదించిన నాడు “విజయం” దానంతట అదే వారి ముందు మోకరిల్లుతుంది.

యేచన్ చంద్ర శేఖర్

మాజీ రాష్ట్ర కార్యదర్శి

ది భారత్ స్కౌట్స్ & గైడ్స్, తెలంగాణ,

హైదరాబాద్

మొబైల్: 8885050822

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News