Bandi Sanjay : తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిప్పులు చెరిగారు. మిగులు రాష్ట్రంగా ఏర్పాటు అయిన తెలంగాణను కేసీఆర్ అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బైంసా సమీపంలో జరిగిన బహిరంగ సభలో బండి సంజయ్ పాల్గొని ప్రసంగించారు.
భైంసాకు రావాలంటే పర్మిషన్ తీసుకోవాలా అని ప్రశ్నించారు. భైంసాకు భరోసా కల్పించేందుకు వచ్చానని అన్నారు. తాము అధికారంలోకి రాగానే పేరు మారుస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న పేదలందరికీ ఉచిత విద్య, వైద్యం అందిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి. నిలువనీడలేని పేదలకు పక్కా ఇళ్లు నిర్మిస్తాం. ట్రిపుల్ ఐటీ విద్యార్థుల కోసం బీజేపీ ఎంతకైనా తెగించి పోరాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
నిర్మల్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ కూడా చేయలేని నిస్సహాయ స్థితిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారన్నారు. కేసీఆర్ మళ్లీ సీఎం అయితే మరో రూ.5లక్షల కోట్లు అప్పు చేస్తారన్నారు. భైంసాలో హిందూ సమాజం భయపడాల్సిన అవసరం లేదని, బీజేపీ వారికి అండగా ఉంటుందని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు.