జన గణనలో కుల గణన చేయాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి బీసీ కులగణనకు కార్యాచరణ స్టడీ కమిటీ వేయటం ముదావహం అని ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖామాత్యులు, సమాచార మరియు పౌర సంబంధాల శాఖామాత్యులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భారత సామాజిక విప్లవోద్యమ పిత మహాత్మా జ్యోతిబా పూలే 197వ రాష్ట్ర స్థాయి జయంతి మహోత్సవ వేడుకలను విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకల్లో భాగంగా మంత్రులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు కళాక్షేత్రం వద్ద ఉన్న పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
రాష్ట్రంలో బీసీలు 139 కులాలు ఉన్నా వారి సంఖ్య తెలియని పరిస్థితి నెలకొని ఉందని, బీసీ సంఘాల ఆభ్యర్ధన మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జనగణనలో బీసీ కులగణన చేయాలని సంకల్పించి బీసీ మంత్రిగా ఆ బాధ్యతను నాపై ఉంచారని, బీసీ కులగణనకు అవసరమైన కార్యాచరణ స్టడీ కమిటీని ఏర్పాటు చేశారన్నారు. స్టడీ కమిటీ సభ్యులు కులగణన చేపడుతున్న ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్లి అధ్యాయనం చేస్తారన్నారు. బీసీలు వెన్నెముకగా నిలవాలన్న ఆలోచన చేసిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బీసీలకు కారణ జన్ముడని కొనియాడారు. పుట్టిన వారు సంఘంలో పేరు ప్రఖ్యాతులు సాధించాలంటే విద్య ఒక ఆయుధం అని, ప్రతి ఒక్కరికి విద్య అందాలని కడుపులో బిడ్డ నుంచి ఉన్నత చదువుల వరకు యువతకు వివిద దశల్లో అనేక పథకాలతో జగనన్న అండగా నిలుస్తున్నాడని, అమ్మ ఒడి నుంచి విదేశీ విద్య దీవెన వరకు పేద వారి చదువుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం జగనన్న ప్రభుత్వమని అన్నారు.
కార్యక్రమంలో రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్ ఛైర్మన్ పి. గౌతమ్ రెడ్డి, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ తోలేటి శ్రీకాంత్, గౌడ కార్పొరేషన్ ఛైర్మన్ యం. శివరామకృష్ణ, ఇండస్ట్రీయల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ బండి శివశక్తి పుణ్యశీల, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్ పర్సన్ టి. జమల పూర్ణమ్మ, శ్రీమతి పడమట స్నిగ్ధ, తన్నేరు నాగేశ్వరరావు, సంపత్ విజేత, అవుతు శ్రీశైలజా రెడ్డి, మామిడి శ్రీకాంత్, జింకా విజయ లక్ష్మీ, బీరక సురేంద్రబాబు, శెట్టి అనంతలక్ష్మీ, వై. రుద్ర గౌడ్, పిల్లి సుజాత, ఆంధ్రప్రదేశ్ బీసీ కార్పొరేషన్ల సమన్వయకర్త ఎ. ప్రవీణ్, వెనుకబడిన తరగతులు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి జి. జయలక్ష్మీ, ఎన్టీయార్ జిల్లా కలెక్టర్ యస్. ఢిల్లీ రావు, వెనుకబడిన తరగతులు సంక్షేమ శాఖ డైరక్టర్ పి. అర్జున రావు వివిధ శాఖాధిపతులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.