టాటా గ్రూప్ ఆధ్వర్యంలో ఉన్న ఎయిరిండియా విమానయాన సంస్థ తన సేవలను మరింత విస్తరించనుంది. ఎయిరిండియాలో విస్తారా ఎయిర్ లైన్స్ విలీనానికి టాటా సన్స్, సింగపూర్ ఎయిర్ లైన్స్ (ఎస్ఐఏ) అంగీకరించాయి. ఈ విలీన ప్రక్రియను 2024 మార్చి నాటికి పూర్తి చేయాలని గడువు నిర్దేశించుకున్నట్టు వెల్లడించాయి. ఈ విలీనం పూర్తయితే ఎయిరిండియా-విస్తారా-ఎయిరిండియా ఎక్స్ ప్రెస్-ఎయిరేషియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్(ఏఏఐపీఎల్)లో టాటా సన్స్ వాటా 74.9 శాతం ఉంటుంది. అదే సమయంలో సింగపూర్ ఎయిర్ లైన్స్ కు 25.1 శాతం ఉంటుంది.
ఈ విలీనం పూర్తయితే సింగపూర్ ఎయిర్ లైన్స్ రూ.2,042 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. దాంతో ఎయిరిండియా విలువ రూ.8,169 కోట్లకు పెరగనుంది. దీనిపై టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖర్ స్పందిస్తూ, ఎయిరిండియాలో విస్తారా విలీనం ఒక ముఖ్యమైన మైలురాయి అని, ఎయిరిండియాని అసలుసిసలైన ప్రపంచస్థాయి విమానయాన సంస్థగా మలచడంలో ఇదొక కీలక ఘట్టం అని అభివర్ణించారు.
సింగపూర్ ఎయిర్ లైన్స్ సీఈవో గో చూన్ ఫాంగ్ మాట్లాడుతూ.. 2013లో టాటా గ్రూప్ తో కలిసి విస్తారాను ఏర్పాటు చేశామన్నారు. అతితక్కువ సమయంలోనే విస్తారా లాభాలబాట పట్టిందన్నారు. ఇప్పుడు పూర్తిగా టాటాగ్రూప్ లో విలీనంతో విస్తారా కొత్త ఎత్తులకు చేరుకుంటుందని తెలిపారు. తమ భాగస్వామ్యం కూడా బలపడుతుందని పేర్కొన్నారు. 2024 మార్చి నాటికి ఎయిర్ ఇండియాలో విస్తారా విలీనం పూర్తికానుంది.