YSRCP: ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా వినిపిస్తున్న మాట ఏపీలో ముందస్తు ఎన్నికలు జరగనున్నాయా?.. తెలంగాణలో కూడా కేసీఆర్ గతంలో మాదిరి ఈసారి కూడా అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు జై కొడతాడా? అంటూ చర్చలు జరుగుతున్నాయి. తెలంగాణ ఎన్నికలపై సీఎం కేసీఆర్ ఒకవైపు ముందస్తుకు ఛాన్స్ లేదంటూనే.. డిసెంబర్ నుండి ఎన్నికల ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. జాతీయ స్థాయికి వెళ్ళబోతున్నాం కనుక ముందుగా ప్రచారం తెలంగాణ నుండే మొదలు పెట్టనున్నామని టీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్నారు. మరోవైపు డిసెంబర్ లో ప్రణాళికలు మొదలు పెట్టి ఫిబ్రవరిలో ఎన్నికలు వెళ్లనున్నారని ప్రచారం జరుగుతుంది.
ఇక, ఏపీ విషయానికి వస్తే సీఎం జగన్ ముందస్తుకు మొగ్గుచూపుతున్నాడని తీవ్రంగా ప్రచారం జరుగుతుంది. ప్రజలలో వ్యతిరేకత భావన మొదలైందని సర్వేలతోనే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నాడని ప్రచారం జరుగుతుంది. గడప గడపకు కార్యక్రమంలో వ్యతిరేకత చూసిన నేతలు కూడా అధిష్టానానికి మొరపెట్టుకున్నారని.. అందుకే ముందస్తుతో వ్యతిరేకత మరికాస్త పెరగకముందే తాడో పేడో తేల్చుకోవాలని అధిష్టానం సిద్దమైపోయిందని రాజకీయ వర్గాలలో తీవ్ర ప్రచారం జరిగిపోతుంది.
ఇప్పటికే ఒకరిద్దరు ప్రభుత్వంలో కీలక నేతలు ఇదే విషయంపై మాట్లాడినా నర్మగర్భంగానే తోసిపుచ్చారు తప్ప.. రాదు లేదు అని ఖరాకండిగా చెప్పలేదు. అయితే, మంత్రి అప్పలరాజు మాత్రం దాదాపుగా ముందస్తు ఎన్నికలు రావడం గ్యారంటీ అనే స్థాయిలో మాట్లాడారు. పలాసలో ఆయన పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ.. ఎప్పుడైనా ఎన్నికలు వస్తాయి కనుక సిద్ధంగా ఉండాలన్నారు. మనం ఇప్పటికే ఎన్నికల ప్రచారం చేస్తున్నామని కూడా ఆయన వారికి గుర్తు చేశారు. ఆయన ఉద్దేశం ప్రకారం గడప గడపకూ వెళ్తున్నది ఎన్నికల ప్రచారం అన్నమాట. మొత్తంగా అప్పలరాజు అన్న మాటలు ఒక్క సారి రాష్ట్రం మొత్తం వైరల్ అవుతున్నాయి.
ఏమో ఏదైనా జరగొచ్చు.. ఎందుకంటే నిజానికి రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఏ మాత్రం బాగోలేదు. పెరిగిన అప్పులకు తోడు వడ్డీలు భారమైపోతున్నాయి. పోనీ.. పరిశ్రమలు, ఇండస్ట్రీలు, కార్పొరేట్ ఆఫీసులు వస్తే ఆదాయం పెరుగుతుందన్న ఆశ కూడా కనిపించడం లేదు. ఏ నెలకు ఆ నెలా బొటాబొటీ ఆదాయం.. అప్పులతో ప్రభుత్వం నెట్టుకొస్తుందని ఆర్ధిక విశ్లేషకులు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే మరో ఏడాది పాటు ఇలాగే ప్రభుత్వాన్ని నడపడం అంటే అప్పటి పరిస్థితులలో ఏదైనా జరగొచ్చు. అందుకే ముందొస్తే ముద్దని వైసీపీ ఫిక్స్ అయిపోయిందని బలంగా వినిపిస్తుంది.