Tuesday, November 26, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandikotkuru: కర్నూలు రోడ్డులో రియల్ మాఫియా, అంతేలేని అక్రమ వెంచర్లు

Nandikotkuru: కర్నూలు రోడ్డులో రియల్ మాఫియా, అంతేలేని అక్రమ వెంచర్లు

నందికొట్కూరు పట్టణంలోని కర్నూలు రహదారిలో అక్రమ వెంచర్లకు పెద్ద ఎత్తున తెరలేపారు రియాల్టర్లు.  అమాయక ప్రజలను నమ్మించి ఎలాంటి అనుమతులు లేని వెంచర్లలో లక్షలకు లక్షలు వసూళ్లు చేసి, అమ్మకాలు జరుపుతున్నారు. ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మున్సిపాలిటీల పరిధిలో ప్రభుత్వ నిబంధనల ప్రకారమే వెంచర్లు అన్ని అనుమతులతో వేయాలని కఠిన నిబంధనలు విధించి జీఓ నెంబర్ 145 విడుదల చేశారు. అయితే ప్రభుత్వ నియమ నిబంధనలు, మున్సిపల్ యాక్ట్ ప్రకారం జిల్లాలోని కొన్ని మున్సిపాలిటీలలో ఎక్కడా కూడా నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా ఎక్కడ పడితే అక్కడ వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చకుండానే అక్రమంగా వెంచర్లను వేస్తున్నారు.  మున్సిపాలిటీ అధికారులు కళ్ళకు గంతలు కట్టినట్లు ప్రవర్తిస్తూండటం ఇక్కడ విశేషం. మండల రెవెన్యూ శాఖ అధికారులు కూడా ల్యాండ్ కన్వర్షన్ కాకపోయినా పట్టించుకోవడం లేదని పలు విమర్శలు వినిపిస్తున్నాయి.  రియల్ మాఫియా యజమానులకు అనుమతులు లేకుండా వెంచర్లు వేస్తున్న కొందరు మున్సిపల్ శాఖ, కుడా అధికారులు ఈ మాఫియాకు అండగా ఉంటూ చోద్యం చూస్తున్నారని పట్టణ ప్రజలు విమర్శిస్తున్నారు. దీనివల్ల అటు ప్రభుత్వానికి, ఇటు మున్సిపాలిటీ ఆదాయానికి భారీగా గండి పడుతోంది.

- Advertisement -

నోటీసులిచ్చి చేతులు దులుపుకుని..

            నందికొట్కూరు పట్టణంలో కర్నూలు రోడ్డులో ఎలాంటి అనుమతులు లేకుండా వెంచర్లు వేసి తారు రోడ్లు వేస్తున్నారు రియాల్టర్లు. కర్నూలు రహదారిలో మున్సిపల్ అధికారులు గతంలో అక్రమ వెంచర్లో పాతిన రాళ్లు తెచ్చారు అధికారులు.  కనీసం ల్యాండ్ కన్వర్షన్ కూడా పూర్తి కాకుండా వెంచర్లు వేస్తున్నప్పటికీ రెవెన్యూ శాఖ అధికారులు కూడా చోద్యం చూస్తున్నారని ప్రజలు విమర్శలు చేస్తున్నారు. వెంచర్లు ఇష్టారాజ్యంగా వేస్తుంటే పట్టించుకోవాల్సిన మున్సిపల్, కుడా అధికారులు రియల్టర్లకు నోటీసులు ఇచ్చి వదిలేస్తున్నారు.  పత్రికల్లో ఎన్ని కథనాలు వచ్చిన అప్పుడు మాత్రమే అనుమతులు లేని వెంచర్లపై యజమానులకు నోటీసులు ఇవ్వడం లేదంటే వెంచర్లను పరిశీలించి మామూళ్ళు తీసుకొని వదిలేస్తున్నట్లు పలు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ప్రభుత్వ నియమ నిబంధనలు జీవో నెంబర్ 145 ప్రకారం ఎకరా స్థలంలో 5 శాతం ప్రభుత్వ గృహాలకు పేదలకు కేటాయించాలి. అందులో ప్రభుత్వం పేదలకు ఇళ్ళ నిర్మాణం చేపడుతోంది.  ఒకవేళ 5శాతం వెంచర్ యజమాని కేటాయించడం ఇష్టం లేకపోతే స్థలానికి సంబంధించిన 3 కిలోమీటర్లు దూరంలో 5 శాతం మార్కెట్ విలువ రేటు ప్రకారం మొత్తం ప్రభుత్వానికి డిపాజిట్ చేయాలి. కానీ నందికొట్కూరు లో ప్రభుత్వ నియమ నిబంధనలు కానీ మున్సిపల్ యాక్ట్ ప్రకారం లే అవుట్లు కానీ వేయడం లేదు.

కుడా అప్రూవల్ లేకుండానే..

వ్యవసాయ భూములను వ్యవసాయేతర  భూమిగా మార్పుకు ప్రొసీడింగ్స్ ఇస్తారు ఆర్ డి ఓ ఆ తరువాత లే అవుట్ అప్రూవల్ కుడా అధికారులు వద్ద  తీసుకోవాలి. కుడా అధికారులు పరిశీలించి వారు అప్రూవల్ ఇస్తే వెంచర్ వేసుకునేందుకు అవకాశం ఉంటుంది. వెంచర్ లో మార్కెట్ విలువ ఎంతైతే ఉందో అందులో 5 శాతం ప్రభుత్వానికి చెల్లించాలి. ఓపెన్ స్థలాలకు వెంచర్ ఎకర వేస్తే అందులో 10 శాతం భూమి మున్సిపాలిటీకి , 2 శాతం ఇతర అవసరాలకు కేటాయించాలి. తప్పనిసరిగా 40 అడుగుల అప్రోచ్ రహదారి వేయాలి. వీటన్నిటిని చెల్లిస్తే మున్సిపాలిటీకి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ని నిబంధనలు ఉన్నప్పటికీ కర్నూలు రహదారిలో వెలసిన వెంచర్లకు కనీస అనుమతులు కూడా లేకుండా వెంచర్లు వేశారని పట్టణ ప్రజలు  ఆరోపిస్తున్నారు. 

30 ఎకరాల్లో వెంచర్లు

కర్నూలు రోడ్డులో దాదాపు 30 ఎకరాలకు పైగా వెంచర్లు వేశారు. ఇందులో ప్రస్తుతం ఉన్న మార్కెట్ రేటు ప్రకారం ఒక ఎకరా రూ.1.5 కోట్ల పైమాటే. ఒక ఎకరా వెంచర్ వేస్తే మున్సిపాలిటీకి ఎకరాకు 10 సెంట్ల చొప్పున వెంచర్ల యజమానులు ఇస్తే అందులో ఆదాయం ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం రూ.30 లక్షలు. 30 ఎకరాల్లో  దాదాపు 3 ఎకరాలు మున్సిపాలిటీకి స్థలం ఇవ్వాలి. మున్సిపాలిటీ ఆదాయానికి అక్రమ వెంచర్ల వల్ల వచ్చే నష్టం కోట్ల పైమాటే. ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పటి వరకు 4.5 కోట్లకు పైగానే మున్సిపల్ ఆదాయానికి, ప్రభుత్వానికి వచ్చే ఆదాయం నష్టం జరిగి ఉండవచ్చని పట్టణ ప్రజలు అంచనా వేస్తున్నారు. అధికారులు స్పందించి అక్రమ వెంచర్లపై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

కొరడా ఝుళిపిస్తాం: కమిషనర్ పి. కిషోర్

మున్సిపాలిటీ పరిధిలో వెలుస్తున్న అక్రమ వెంచర్లపై కఠిన చర్యలు తప్పవని కమిషనర్ కిషోర్ హెచ్చరించారు. వెంచర్ నిర్వహకులు ప్రభుత్వ నిబంధనలు తప్పని సరిగా పాటించాలని, మున్సిపాలిటీ అనుమతులు పొంది ఉండాలని సూచించారు.  ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలు పాటించని అక్రమ వెంచర్లపై ఇది వరకే నోటీసులు జారీ చేశామన్నారు. ప్రభుత్వ నిబంధన తప్పనిసరిగా పాటించాలని కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News