మిశ్రీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. నిత్యం మనం తీసుకునే డైట్ లో సైతం దీని వాడకం ఎంతో మంచిది. చక్కెరకు బదులు దీన్ని ఉపయోగిస్తే ఇంకా మంచిది. ఇందులో శరీరారోగ్యానికి మేలుచేసే పోషకాలు కూడా ఉన్నాయి. అందులోనూ వేసవి ఇది మంచి కూలింగ్ ఏజెంట్. సహజంగానే కూలింగ్ ఫుడ్స్ అనగానే పెరుగు, పుచ్చకాయ, కీరకాయ, కొబ్బరినీళ్లు, పుదీనా నీళ్లు వంటివి చెప్పుకుంటాం. ఇవి ప్రక్రుతి సిద్ధమైనవి మాత్రమే కాదు వేసవి కాలంలో శరీరానికి కావలసింత హైడ్రేషన్ అందిస్తాయి. వీటి వరుసలో మిశ్రీ కూడా
వస్తుందని ఎరిగినవారు కొద్దిమందే. మిశ్రీలోని పోషకాలు వేసవిలో ఉష్ణతాపాన్ని తగ్గించడంలో ఎంతో బాగా పనిచేస్తాయి. మిశ్రీని రాక్ షుగర్ అని కూడా అంటారు. దీన్ని కూడా చెరకు నుంచే తీస్తారు.
దీన్ని చక్కెర యొక్క స్వచ్ఛమైన పదార్థంగా చెప్తారు. ఇందులో బోలెడు ఖనిజాలు, విటమిన్లు, అమినోయాసిడ్లు ఉన్నాయి. ఇవి మీ శరీరాన్ని సహజసిద్ధంగా చల్లబరుస్తాయి. నేచురల్ కూలింగ్ ఏజెంట్లుగా పనిచేస్తాయి. నిత్యం వాడే టేబుల్ షుగర్ కు బదులు మిశ్రీ ని వాడితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. మిశ్రీ జీర్ణక్రియ బాగా జరిగేట్టు సహాయపడుతుంది. జలుబు, దగ్గు వంటి పలు సీజనల్ జబ్బులను కూడా మిశ్రీ తగ్గిస్తుంది. మిశ్రీ శరీరానికి ఎంతో ఎనర్జీని అందిస్తుంది కూడా. రక్తహీనతను తగ్గించడానికి సంప్రదాయంగా ఎన్నో ఏళ్లుగా మిశ్రీని మనవాళ్లు ఉపయోగిస్తూ వస్తున్నారు. ఇందులోని విటమిన్లు, ఖనిజాలు, అమినో ఆమ్లాల వల్ల శరీరంలో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. అంతేకాదు మిశ్రీ రక్తహీనత వల్ల తలెత్తే బలహీనత, అలసట, నీరసం వంటి వాటిని కూడా తగ్గిస్తుంది.
ద్రుష్టిలోపం, కాటరాక్టు సమస్యలు రాకుండా కూడా మిశ్రీ తోడ్పడుతుంది. చక్కెర, మిశ్రీ రెండు ప్రోసెస్డ్ ఫుడ్స్ అయినా కూడా చక్కెర కన్నా మిశ్రీ వాడకం మంచిదంటారు . ఎందుకంటే మిశ్రీలో చక్కెరలో లాగ ఎలాంటి కెమికల్స్ లేవు. అందుకే చక్కెర కన్నా దీని వినియోగం ఆరోగ్యానికి మంచిదంటారు. మిశ్రీ స్వభావసిద్ధంగా ఆల్కలైన్ గుణం కలిగి ఉంది. అందువల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుంది. వేసవిలో మిశ్రీ వినియోగం మంచిదంటారు. నిజానికి బెల్లం, మిశ్రీ రెండింటిలోనూ ఆరోగ్యానికి ఉపయోగపడే పలు పోషకాలు ఉన్నాయి. కానీ వేసవిలో బెల్లం వినియోగం మంచిది కాదు. ఎందుకంటే బెల్లం వల్ల శరీరం వేడి అవుతుంది. కానీ మిశ్రీ వాడకం మటుకు వేసవిలో శరీరానికి కావలసిన కూలింగ్ ఎఫెక్టు ఇస్తుంది. అంతేకాదు వేసవిలో బెల్లం తొందరగా కరిగిపోతుంది. మిశ్రీలోని చల్లబరిచే గుణం వల్లే వేసవిలో వండుకునే పలు వంటకాల్లో కూలింగ్ ఎఫెక్టుకోసం మిశ్రీని వాడతారు.
వేసవిలో మనం తీసుకునే డైట్ లో మిశ్రీ వాడకం మంచిది. ముఖ్యంగా వేసవిలో మనం తాగే టీ కాఫీల్లో చక్కెర కాకుండా మిశ్రీ వాడితే ఆరోగ్యానికి మంచిది. అంతేకాదు లైమ్ సోడా, షికాంజి వంటి సమ్మర్ కూల్ డ్రింకుల్లో కూడా మిశ్రీ వాడితేనే మంచిది. అలాగే మిశ్రీలోని చల్లబరిచే గుణాల కారణంగా వేసవికాలంలో మిశ్రీ నీళ్లు తాగితే శరీరానికి ఎంతో మంచిది. ఈ నీళ్లు శరీరంలోని మంటను తగ్గిస్తుంది. నోరు దుర్వాసన రాకుండా కూడా మిశ్రీని వాడొచ్చు. అన్నం తిన్నతర్వాత సోంపు తింటుంటాం. అలా మిశ్రీని కూడా తినొచ్చు. దీనివల్ల తిన్న ఆహారం బాగా జీర్ణమవుతుంది. అయితే మిశ్రీలోని తీపిగుణాన్ని మరవకూడదు. అందుకే దీన్ని పరిమితంగా తీసుకుంటే సర్వదా మంచిది. ఎక్కువ తీసుకుంటే శరీరంలో కాలరీలు పెరుగుతాయి. డయాబెటిస్ తో బాధపడేవాళ్లు, శరీరంలో కాలరీలు తగ్గించుకోవాలనుకునేవాళ్లు మిశ్రీని మితంగా వాడాలి.