ఇటీవల జాతీయ అవార్డులు పొందిన తెలంగాణ గ్రామాలు, మండలాలు, జిల్లా పరిషత్ ల ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఈ నెల 17న ఢిల్లీ లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా తీసుకోవడానికి వెళుతున్న సందర్భంగా వారికి, హైదారాబాద్ లోని మంత్రుల నివాసంలో అల్పాహార విందు ఇచ్చి సాగనంపారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ములుగు జిల్లా చైర్మన్ కుసుమ జగదీశ్, కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ హనుమంతరావు, ప్రత్యేక కమిషనర్లు ప్రసాద్, ప్రదీప్ శెట్టి, అవార్డులు పొందిన గ్రామాల సర్పంచులు, కార్యదర్శులు, ఎంపీపీ లు, dpo లు, తదితరులు పాల్గొన్నారు.
ఒకప్పుడు వరంగల్ జిల్లా గంగదేవి పల్లె ను చూసి గర్వపడే వాళ్ళం, అక్కడికీ అందరూ వెళ్ళి చూసేవాళ్ళం, ఇప్పుడు తెలంగాణలో అన్ని గంగదేవి పల్లెలుగా మారి దేశానికి ఆదర్శంగా మారాయని మంత్రి ఎర్రబెల్లి ఈ గెట్ టుగెదర్ లో వివరించారు. సీఎం కెసిఆర్ గారి ముందు చూపు వల్ల ఇవ్వాళ గ్రామాల రూపు రేఖలు మారిపోయినట్టు ఆయన వివరించారు. ఈ ఘనత మన ప్రజా ప్రతినిధులు, అధికారులకే చెందుతుందన్న ఎర్రబెల్లి, గ్రామీణాభివృద్ధిలో ఇప్పటి వరకు 79 అవార్డులు వచ్చాయని, ఇంకా మనకు వస్తాయని విశ్వాసం వ్యక్తంచేశారు. మనకు దరి దాపుల్లో మిగతా గ్రామాలు లేనేలేవన్నారు. ప్రధాని మోడీ, అమిత్ షాల సొంత రాష్ట్రం గుజరాత్ రాష్ట్రానికి కూడా మనలాగా అవార్డులు రాలేదన్నారు ఆయన. అనంతరం ప్రజా ప్రతినిధులు తరలి వెళుతున్న బస్సుకు మంత్రి తదితరులు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం బస్సు ఢిల్లీ బయల్దేరింది.