నాకు టికెట్ ఇవ్వకపోవటమంటే కనీసం 20-25 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఓడిపోవటం ఖాయమని హెచ్చరించారు కర్నాటక మాజీ సీఎం జగదీష్ షెట్టర్. ఈమేరకు మీడియాతో ఘాటుగా వ్యాఖ్యలు చేసిన షెట్టర్, ఈ ఆదివారం వరకు వేచి చూసి ఆతరువాత తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానంటూ బీజేపీకి అల్టిమేటం ఇచ్చారు. హుబ్లి-దార్వాడ సెంట్రల్ నియోజకవర్గంలో షెట్టర్ ను కాదని వేరేవారికి టికెట్ ఇవ్వటంతో ఆయన అసహనంతో ఊగిపోతున్నారు. మరోవైపు ఇలా పార్టీకి వీర విధేయులు, సీనియర్లకే టికెట్ ఇవ్వకపోతే ఎలా అంటూ అసమ్మతి గట్టిగా రాజుకుంది. పైగా తిరుగుబాటు చేసేందుకు షెట్టర్, ఆయన అనుచరులు సిద్ధమయ్యారు. గుజరాత్ విన్నింగ్ ఫార్ములా ఫాలో అవుతున్న బీజేపీ అదే సూత్రాన్ని కర్నాటకలో రిపీట్ చేస్తూ, పలువురు సిట్టింగులు, సీనియర్లకు టికెట్ నిరాకరించి, కొత్త వారికి అవకాశం ఇచ్చింది. దీంతో కర్నాటక బీజేపీలో అసమ్మతి సెగ భారీగా రాజుకుంది. ఇక షెట్టర్ ను బుజ్జగించేందుకు మరో మాజీ సీఎం యడ్యూరప్పను రంగంలోకి దిగినా ప్రయోజనం మాత్రం కనిపించకపోవటంతో జగదీష్ షెట్టర్ కు టికెట్ ఇవ్వక తప్పని సందిగ్ధంగా బీజేపీ హైకమాండ్ కూరుకుపోయిందనే వార్తలు వస్తున్నాయి. కర్నాటక ఓటర్లలో బలమైన సామాజిక వర్గంగా పేరుగాంచిన లింగాయితుల నేత అయిన జగదీష్ షెట్టర్ అనుచరులు ఇప్పుడు భారీ ఎత్తున నిరసనలకు దిగటం విశేషం.