బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మండలం బడాభీంగల్ గ్రామంలో ఏర్పాటు చేసిన బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రితో కలిసి రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆవిష్కరించారు.
తన జీవితాంతం బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన బాబు జగ్జీవన్ రామ్ లాంటి మహోన్నత వ్యక్తి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న బడా భీంగల్ ప్రజల నిర్ణయం పట్ల మంత్రి వేముల హర్షం వ్యక్తం చేశారు. డా.బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో బడుగు బలహీన వర్గాల ఉన్నతి కోసం పలు అంశాలు పొందుపరిస్తే..ఆయన అనంతరం వివిధ భారత ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేసి దాన్ని బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అమలు చేసిన దార్శనికుడు బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి స్వశక్తితో ఎదిగి భారత ఉపప్రధానిగా ఈ దేశానికి సేవలందించారని గుర్తు చేశారు. ఆ మహనీయుని ఆశయ స్ఫూర్తికి అనుగుణంగానే రాష్ట్రంలో సీఎం కేసిఆర్ ప్రభుత్వ పాలన సాగుతోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు, పలువురు బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.