మహారాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ కు నీరాజనం పలుకుతున్నారని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంబాజీనగర్ జిల్లాలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ .. గులాబీ పార్టీ పట్ల ప్రజల్లో మంచి స్పందన వస్తూ, ప్రజలు కేసీఆర్ నాయకత్వానికి జైకొడుతున్నారన్నారు. ఈ నెల 24న ఔరంగాబాద్ అంకాస్ మైదానంలో లక్షలాది మందితో బీఆర్ఎస్ బహిరంగ సభను నిర్వహిస్తున్నామన్నారు. ఈ సభను విజయవంతం చేయడానికి భారీ సన్నాహాలు చేస్తున్నామన్నారు.
“మహారాష్ట్ర” ప్రజల ఆశీస్సులతో ముందుకు సాగుతున్నామని, గ్రామాల్లో తెలంగాణ మోడల్ గురించి వివరిస్తున్నప్పుడు ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తున్నదన్నారు. ఔరంగబాద్ సభా వేదికపై నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమంపై దిశానిర్దేశం చేస్తారన్నారు. ఔరంగాబాద్ సభావేదికపై కేసీఆర్ సమక్షంలో వివిధ పార్టీల నుంచి కీలక నేతలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ లో చేరనున్నారని జీవన్ రెడ్డి వెల్లడించారు. మహారాష్ట్ర దేశానికే ఆర్థిక రాజధానిగా ఉన్నప్పటికీ ఎందుకీ వెనుకబాటు తనమని? ఆయన నిలదీశారు.
మహారాష్ట్రలో ఆదాయ వనరులు సమృద్ధిగా ఉన్నాయని, బడ్జెట్ కూడా బాగానే ఉన్నా అభివృద్ధికి మాత్రం నోచుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ లవి అభివృద్ధి నిరోధక విధానాలని, ఈ రెండు జాతీయ పార్టీల నిర్వాకం వల్లే దేశం అభివృద్ధిలో వెనుకబడిందని జీవన్ రెడ్డి మండిపడ్డారు.
దేశమంతా తెలంగాణ పథకాలు అమలై దేశాభివృద్ధి సాధించడం ఒక్క కేసీఆర్ తోనే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. మోడీ గుజరాత్ మోడల్ ఫేక్ అని, ప్రగతికి ప్రతీక కేసీఆర్ మోడల్ అని ఆయన వ్యాఖ్యానించారు. నాందేడ్ లో నిర్వహించిన బీఆర్ఎస్ మొదటి సభకు మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు. కేసీఆర్ నాందేడ్ లో అడుగు పెట్టగానే మహారాష్ట్ర బడ్జెట్లో రైతుబంధు తరహా పెట్టుబడి సాయం కోసం రూ.6,900 కోట్ల నిధుల కేటాయింపు జరిగిందన్నారు. కందార్ లోహలో లక్ష మందికి పైగా హాజరైన ప్రజల ఆశీస్సులతో రెండో సభ విజయవంతం అయిందన్నారు. ఈ రెండు సభల్లో వివిధ పార్టీల నుంచి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, కీలక నేతలు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన విషయాన్ని జీవన్ రెడ్డి గుర్తు చేశారు.
నాందేడ్, కందార్ సభలకు మహారాష్ట్ర ప్రభుత్వం అనేక అడ్డంకులు సృష్టించినా, వాహనాలను అడ్డుకున్నా ఆ సభలు సక్సెస్ అయ్యాయన్నారు. కేసీఆర్ కు మహారాష్ట్రలో ఏం పనని ఉపముఖ్యమంత్రి ఫడ్నవీస్ అన్నారని జీవన్ రెడ్డి గుర్తు చేస్తూ తెలంగాణ లో అమలవుతున్న పథకాలను మహారాష్ట్రలోనూ అమలు చేస్తే తాను ఇక్కడికి రానని కేసీఆర్ సమాధనమిచ్చారన్నారు. మోడీ గోల్ మాల్ మోడల్ కావాలా?, అసలు సిసలైన కేసీఆర్ మోడల్ కావాలా అని ఆయన ప్రశ్నించారు.
ఈ విలేకరుల సమావేశంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ ,ఐ డీ సీ చైర్మన్ వేణుగోపాల చారి , మహారాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు మానిక్ కదం, మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ జాదవ్, అభయ్ పాటిల్, ఖదీర్ మౌలానాలతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.