Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Covid in China: కరోనాతో చైనా ఉక్కిరిబిక్కిరి

Covid in China: కరోనాతో చైనా ఉక్కిరిబిక్కిరి

కరోనా వ్యాపించిన దేశాలలో అనేకం ఆ మహమ్మారి నుంచి విముక్తి పొంది హాయిగా గాలి పీల్చుకుంటుండగా, కరోనా పుట్టిన చైనాలో మాత్రం ఆ ప్రాణాంతక వైరస్ ఇంకా విజృంభిస్తూనే ఉంది. నిజానికి ఇది ఎవరు తవ్వుకున్న గోతిలో వారే పడ్డారని సంబరపడాల్సిన సమయం కాదు. అక్కడ కూడా అన్నెం పున్నె ఎరుగని అమాయక ప్రజలే వందల సంఖ్యలో బలవుతున్నారు. దాదాపు రెండేళ్ల పాటు నరకం చవి చూసిన ప్రపంచ దేశాలు అనేకం అనేక నియంత్రణ, నిరోధక, నివారణ చర్యలతో ఈ మహమ్మారి నుంచి గట్టెక్కి క్రమంగా శక్తిని కూడగట్టుకుంటున్నాయి. కానీ, చైనాలో మాత్రం ఈ వైరస్ ఇదివరకటి కంటే మరింత శక్తిమంతంగా విజృంభించి, కార్చిచ్చులా వ్యాపిస్తోంది. సగటున ఒక్క రోజులోనే సుమారు 31 వేల కేసులు నమోదవుతున్నాయని అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి. మూడేళ్ల క్రితం ఈ వైరస్ వ్యాపించినప్పుడు కూడా ఇంత పెద్ద సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదు కాలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఆందోళన చెందుతోంది. గత పది పన్నెండు వారాల సమయంలో సుమారు 50 నగరాలు, పట్టణాలలో లక్షలాది మంది పౌరులు ఇళ్లకే పరిమితం కావాల్సి వస్తోందంటే ఈ కోవిడ్ వైరస్ వ్యాప్తి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలే ఆర్థికంగా కుదేలవుతున్న చైనా ఈ దెబ్బతో కుప్పకూలుతోందని అక్కడి ఆర్థిక నిపుణులు బెంబేలెత్తుతున్నారు.

- Advertisement -

ఆర్థిక మాంద్యం కారణంగా ఇప్పటికే ఆ దేశంలో వేలాదిమంది ఉద్యోగాలు కోల్పోయారు. ఉద్యోగాలు చేస్తున్నవారికి కూడా జీతభత్యాలు చెల్లించలేని పరిస్థితి చైనాను క్రమంగా చుట్టుముడుతోంది. ఫలితంగా ప్రజల్లో అసహనం, అశాంతి పెరిగిపోతోంది. జెంగ్ జో అనే నగరంలో ప్రపంచంలోనే అతి పెద్ద ఐ ఫోన్ పరిశ్రమ తమ ఉద్యోగులకు, కార్మికులకు వేతనాలు చెల్లించలేని పరిస్థితికి చేరుకుంది. ఉద్యోగులంతా వీధులకెక్కి నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శనలను అణచివేయడానికి పోలీసులు రంగ ప్రవేశం చేయడం కూడా జరిగింది. ఇక గ్వాంగ్ జో ప్రాంతంలో అయితే అత్యధిక సంఖ్యలో ఉన్న వలస కార్మికులను ఇళ్లకు పోనివ్వకుండా క్వారంటైన్ కేంద్రాలలో రోజుల తరబడి నిర్భంధించడం జరుగుతోంది. కోవిడ్ వైరస్ తో పాటు, ఒమిక్రాన్, బిఎఫ్7, బి.ఎ517 వంటి కోవిడ్ అవతారాలు కూడా అనేక ప్రాంతాలను కబళిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇందులో కొన్ని కేసులు మరీ అంత ప్రాణాతకం కాకపోయినా, పౌరులను తీవ్ర అనారోగ్యాలకు గురి చేస్తూ దాదాపు దేశమంతటా విస్తరించాయి. కరోనా ప్రారంభమైన తొలి నాళ్లలో ఈ మహమ్మారి గురించి ఏమీ తెలియక, దీనిని నివారించడానికి, నిరోధించడానికి ఏమి చేయాలో దిక్కు తోచక వైద్యులు, ఇతర ఆరోగ్య సిబ్బంది ఎంతగా ఉక్కిరిబిక్కిర అయ్యారో గుర్తుంది కదా. ఇప్పుడు కూడా చైనాలో అదే పరిస్థితి నెలకొని ఉందని అక్కడ దౌత్య అధికారులు తమ తమ దేశాలకు సమాచారం అందిస్తున్నారు. మళ్లీ చెప్పేవరకూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని చైనా అధికారులు తమ పౌరులకు ఆదేశాలు జారీ చేశారు.

నిజానికి, చైనా ప్రభుత్వం ఈ వైరస్ మీద ఇప్పటికే పూర్తి స్థాయి యుద్ధం ప్రకటించింది. దేశవ్యాప్తంగా యుద్ధ ప్రాతిపదికన పరీక్షలు నిర్వహిస్తోంది. విచిత్రమేమిటంటే, చైనా ప్రభుత్వ అస్త్రశస్త్రాలలో వ్యాక్సినేషన్ మాత్రం ఒక ప్రధాన అస్త్రంగా కనిపించడం లేదు. ఇతరత్రా అనేక దేశాలకు ఇప్పటికీ వ్యాక్సిన్లను సరఫరా చేస్తున్న చైనా తమ పౌరులలో కొద్ది మందికి మాత్రమే ఈ రెండు మూడేళ్ల కాలంలో వ్యాక్సిన్ వేయించిందంటే ఆశ్చర్యం కలుగుతుంది. చాలా తక్కువ శాతం మందికి వ్యాక్సిన్ వేసింది. అందులోనూ ఎక్కువగా వయసు పైబడిన వారికి మాత్రమే వ్యాక్సిన్ వేయించడం గమనించాల్సిన విశేషం. అరవై ఏళ్లు పైబడిన వారిలో 85 శాతం మందికి వ్యాక్సిన్ వేయించినట్టు చైనా అధికారులు గతంలోనే ప్రకటించారు. ఈ గణాంక వివరాలు కూడా ప్రశ్నార్థకమేనంటున్నారు ఆరోగ్య నిపుణులు. వ్యాక్సినేషన్ ను మరింత విస్తృతం చేయాలంటూ ఆర్థిక మాంద్యం నేపథ్యంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐ.ఎం.ఎఫ్) చైనాపై ఒత్తిడి తెస్తోంది. మరీ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, దేశంలో తయారవుతున్న వ్యాక్సిన్ లను అటు ఆరోగ్య అధికారులు గానీ, ఇటు సామాన్య ప్రజానీకంగానీ ఒకపట్టాన నమ్మడం లేదు. ప్రైవేట్ రంగంలో ఉన్న సైనోవాక్ ఫార్మా కంపెనీ గానీ, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సైనో ఫార్మ్ ఔషధ సంస్థ గానీ తాము ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సిన్ లకు క్లినికల్ పరీక్షలు నిర్వహించిందీ లేనిదీ తెలియదు. అవి తమ వ్యాక్సిన్ లకు ఏ విధమైన ప్రయోగాత్మక పరీక్షలూ నిర్వహించలేదని మాత్రం ప్రజలంతా ఘంటాపథంగా నమ్ముతున్నారు. చైనాలో అత్యున్నత స్థాయి వ్యాధి నియంత్రణ నిపుణుడు గావ్ పూ ఈ మధ్య ఒక ప్రకటన చేస్తూ, తమ దేశంలో ఉత్పత్తవుతున్న వ్యాక్సిన్ ల వల్ల కోవిడ్ మహమ్మారిని అదుపు చేస్తున్న దాఖలాలేవీ లేవని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News