Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Nanies: సాఫ్ట్‌ వేర్‌ జీవితాలను ఆవిష్కరించిన నానీలు

Nanies: సాఫ్ట్‌ వేర్‌ జీవితాలను ఆవిష్కరించిన నానీలు

21వ శతాబ్దం సాంకేతిక శతాబ్దం. మానవ పరిణామ క్రమంలో ఊహించని పురోగతిని సాధించిన శతాబ్దం. మానవుడు తన సుఖాల కోసం శాస్త్ర సాంకేతికతను పిడికిట బట్టి విశ్వ విజేతగా నిలుస్తున్నాడు. ప్రకృతి శాసనాలను సైతం అతిక్రమిస్తూ స్వార్థంతో తన పతనాన్ని తానే కొనితెచ్చుకుంటున్నాడు. ఈ క్రమంలో సమాజంలో అనాదిగా ఏర్పరచుకున్న సాంస్కృతిక నైతిక మానవీయ విలువలకు తిలోదకాలిస్తున్నాడు. డాలర్ల మోజులో నేటి విద్యా విధానం కూడా ఈ తరహా యాంత్రిక జీవనాన్ని ప్రోత్సహిస్తున్నదనే చెప్పాలి. పాఠశాల విద్య అనంతరం శాస్త్ర సాంకేతికత వైపు వెళ్లే విద్యార్థులకు నైతిక విలువలు నేర్పే పాఠాలు లేకపోవడం విషాదకరం. ఇంటర్‌ స్థాయిలో భాషా బోధనలో నైతిక విలువలకు సంబంధించిన పాఠాలు ఉన్నా కార్పొరేట్‌ కళాశాలలో వాటిని బోధి స్తున్న దాఖ లాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఇం జనీరింగ్‌ పూర్తి అయిన విద్యార్థులు యంత్రాలుగా కాక మానవత్వం ఉన్న మనుషులుగా తయారవుతారనుకో వడం అత్యాశ అవుతుంది. డాలర్‌ కలల ప్రపంచంలో విహరిస్తూ కన్న తల్లిదండ్రులను కూడా మర్చిపోతున్న లక్షలాదిమందిలో కుడికాల వంశీధర్‌ వంటి మానవీయ స్పృహ ఉన్న అతి కొద్ది మంది సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్లు ఇందుకు మినహాయింపు. కవిత్వం జీవితం నుంచే ఉద్భవిస్తుంది అనడానికి కుడికాల వంశీధర్‌ రచించిన సాఫ్ట్‌ వేర్‌ నానీలు ఒక ఉదాహరణ. వృత్తిరీత్యా సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగి అయిన వంశీధర్‌ తన చుట్టూ ప్రపంచాన్ని కవిత్వంలోకి తీసుకువచ్చారు. సాధారణంగా కవులు చూసే ప్రపంచం వేరు. సాఫ్ట్‌ వేర్‌ ప్రపంచం వేరు. సాఫ్టువేర్‌ రం గంలో లేని ఏ ఇతర కవి కూడా ఈ నానీలను ఇంత గొప్పగా రాయలేడని కచ్చితంగా చెప్పగలను. అత్యాధునిక వృత్తి అయిన ఈ రంగంలో సాధకబాధకాలను పైకి కనిపిం చని విభిన్న కోణాలను అద్భుతంగా ఆవిష్కరించారు. నానీలలో వాడిన ప్రతీకలు అలంకారాలు సైతం కంప్యూ టర్‌ పరిభాషలోనే ఉండడం వంశీధర్‌ సాధించిన నవ్యత. ప్రపంచీకరణ నేపథ్యంలో భద్రత లేని ఆధునిక వెట్టిచాకిరి వ్యవస్థను ఈ నానీలలో తూర్పారాబట్టారు.
ఇవాళ ప్రపంచమంతా కంప్యూటర్‌ గుప్పిట్లో దాగి ఉంది. ఈ విషయాన్నిఅందమైన నానిగా మలిచాడు.
బ్యాగులోకి/ దూరుతున్న ల్యాప్‌ టాప్‌/ భూగోళం/ తాబేలులా ముడుచుకున్నట్టు… చదువుతున్న పాఠకుడికి అందమైన భావ చిత్రం మనోఫలకం పై రూపు కట్టేలా రాయడం వంశీధర్‌ కే సాధ్యం. సమస్త విజ్ఞానం గూగుల్‌ లో లభిస్తుంది కానీ గుండెల్లో గుబళించాల్సిన ప్రేమ మాత్రం దొరకదు అని చెప్పడం మనిషితనాన్ని కాపాడు కోవాలని ప్రజలను హెచ్చరించడమే.
కొన్ని పరిచయాలు / దూరమవుతాయి / వాడని పాస్వర్డ్‌ / మరచిపోయినట్లు… నిజంగానే తరచుగా కలుసు కుంటూ ఉండడం మాట్లాడుకుంటూ ఉండడం ద్వారా స్నేహాన్ని బంధుత్వాలను నిలబెట్టుకోవచ్చు. అంతే గాని చాలాకాలం వరకు వారితో సత్సంబంధాలు నెరపక పోవడం వల్ల ఆ బంధం తెగిపోయే ప్రమాదం ఉంది. దీనిని చాలాకాలం వాడకుండా వదిలేసిన పాస్వర్డ్‌తో పోల్చడం ఎంతో సముచితంగా అనిపిస్తుంది. సాఫ్ట్‌వేర్‌ హార్డ్‌వేర్‌ అనే పదాలను ఆ రంగంలో లేని వారికి నిర్వచించడమే కష్టం. అరటిపండు ఒలిచి పెట్టినంత తేలికగా హార్డ్‌ వేరే/ సాఫ్ట్‌ వేర్‌కు కవచం/ కొబ్బరి చుట్టూ/పెంకులా… అంటారు. పామరులకు సైతం సాంకేతిక భాషను అలవోకగా అంది స్తున్న నాని ఇది . ఇటువంటిదే మరొక నాని లో మనిషి దేహాన్ని హార్డ్‌ వేరేగాను మనసు ప్రాణం అనే కనిపించని అంశాలను సాఫ్ట్‌ వేర్‌గాను పోల్చి చెప్తారు.
సమాజంలో మానవ స్వభావాన్ని చిత్రించడానికి కూడా ఈ కవి టెక్నాలజీ వాడుకున్నారు. ట్విట్టర్లో తిట్టు కుంటారు / ఫేస్బుక్లో పొగుడుకుంటారు / వారికి/ రెండు నాల్కలు… అంటూ మానవ మనస్తత్వాన్ని తేటతెల్లం చేశా రు. ఇవాళ సెల్ఫోన్‌ కంప్యూటర్‌ మనిషి జీవితాన్ని పూర్తిగా ఆక్రమించేశాయి. అవి లేకుండా క్షణం గడవని పరిస్థితిని కల్పించాయి. నిజంగా మనిషిగా జీవించే పరిస్థితులు కను మరుగవుతున్నాయి. ఈ దుస్థితిని కళ్ళకు కడుతూ జీవించే కాలాన్ని/ కోల్పోతున్న దైన్యం/ సోషల్‌ మీడియాదే /ఆ పుణ్యం అని సోషల్‌ మీడియా మనిషి జీవితంలో చొరబడ్డ వైనాన్ని వివరించారు.
సాఫ్ట్‌ వేర్‌ రంగం ఓ రంగుల ప్రపంచం. అద్దాల మేడలు ఇస్త్రీ చెరగని ఇన్‌ షర్టు సడలని వస్త్రాలంకరణ చూసేవాడికి గొప్ప కొలువు అని అనిపిస్తుంది. కానీ ఎవరికీ చెప్పుకోలేని వెట్టిచాకిరి, ఉద్యోగ అభద్రత వారిని వెన్నాడు తూనే ఉన్నాయి. ఆ రంగంలోని చీకటి కోణాలు తెలిసిన వాడు కనుకనే రోజు కూలికి ఎక్కువ/ వెట్టిచాకిరికి తక్కువ/ ఇదండీ/ సాఫ్ట్వేర్‌ ప్రపంచం… అని వంశీధర్‌ అనగలిగాడు. రోబోలను సృష్టించే సాఫ్ట్వేర్‌ ఇంజనీర్‌ కూడా రోబోలా పనిచేయవలసిన పరిస్థితులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మానసిక ఉద్వేగాలని అణచుకొని యాంత్రికంగా పనిచేయవలసిన స్థితి ఈ రంగంలో కనిపి స్తుంది. అందుకే వీకెండ్‌లో ఒక స్వేచ్ఛామయ ప్రపంచంలో విహరించాలని సాఫ్ట్వేర్‌ ఉద్యోగస్తులు తపిస్తుండడం సహ జమే. అందుకే ఐదు రోజులు/ పనితో చెమరింతలు/ వారాంతాలలో/ ఆగని కేరింతలు… ఇట్లాంటి మానసికపర మైన అంశాలు అనేకం వంశీధర్‌ కవిత్వీకరించగలిగారు. తరాల తరబడి సమాజంలో అన్ని కులాల భాగస్వామ్యంతో సామాజిక వ్యవస్థ నడుస్తూ వచ్చింది. పెరుగుతున్న ఆధునిక శాస్త్ర సాంకేతిక ఫలితంగా కులవృత్తులు ధ్వంసం అవుతున్నాయి. ఇదే సందర్భంలో కాలానుగుణంగా వచ్చే నూతన మార్పులకు అనుగుణంగా కొత్తవృత్తులు ఉద్భవిస్తున్నాయి. సాఫ్ట్వేర్‌ రంగం కూడా అటువంటిదే. దీనిని కంప్యూటర్‌ కులం అని నిర్వచిస్తారు వంశీధర్‌.
నిరంతరం కవిత్వం కోసం తపించే వంశీధర్‌ మగత నిద్రలో కూడా కవిత్వాన్ని కలవరిస్తున్నాడు. ‘మగతలో/ కీప్యాడపై చేయి పడింది /అల్లుకున్న /అక్షరాలు కవిత్వ మైనై’ అనే నాని దీనికి నిదర్శనం. పెన్‌ డ్రైవ్‌ లు వచ్చిన తర్వాత సిడిలు కాస్త తగ్గినవి కానీ ఇంతకుముందు సిడిల ద్వారానే సమాచారాన్ని కంప్యూటర్‌లో ప్రవేశపెట్టడం జరిగేది. కొన్నిసార్లు ఈ సిడీలు కంప్యూటర్‌లో ఇరుక్కుని ఇబ్బంది పెట్టేవి. ఈ స్థితిని భావాన్ని అందుకోలేని కవి మనసుతో పోల్చడం వంశీ కవి హృదయానికి నిదర్శనం. నేటి కవులు కూడా కంప్యూటర్‌ యుగానికి అనుగుణంగా అప్డేట్‌ అవుతున్నారు. కలం కాగితంతో పని లేకుండానే కవిత్వం రాసేస్తున్నారని చమత్కరిస్తారు.’కవిత్వం/ ఎప్పు డైనా రాసుకోవచ్చు/ కంప్యూటరే / నాకు కలం కాగితం’ అంటారు.
కంప్యూటర్‌ రంగంతో అంతగా పరిచయం లేని పాఠకులకు కూడా అలవోకగా నానీలు అర్థం కావడానికి వీలుగా తెలియని సాంకేతిక పదాలకు ఫుట్‌ నోట్స్‌ ఇవ్వడం బాగుంది. ఈ నానీలో అనంతరం కూడా వంశీ ధర్‌ ఇటీవల కాలంలో వివిధ పత్రికల్లో విరివిగా సాఫ్ట్వేర్‌ రంగంపై అద్భుతమైన కవిత్వాన్ని వెలువరిస్తున్నారు. ఈ రంగంలోని బహుముఖ పార్ష్వాలను కవిత్వంలోకి తీసుకు రావడానికి వంశీధర్‌ చేస్తున్న ప్రయత్నం తెలుగు సాహితీ లోకానికి ఒక గొప్ప చేర్పు. వంశీధర్‌ ప్రయత్నాన్ని అభినం దిస్తూ మరిన్ని గొప్ప కావ్యాలను తెలుగు సాహిత్యానికి అందిస్తారని ఆశపడుతున్నాను.

  • సాగర్ల సత్తయ్య
    7989117415
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News