Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Indian single women: 720 లక్షల మంది సింగిల్ వుమెన్ ఉన్న దేశం మనది

Indian single women: 720 లక్షల మంది సింగిల్ వుమెన్ ఉన్న దేశం మనది

మనదేశం ఒంటరి మహిళకు సురక్షితమైన దేశం కాదా? వివిధ కారణాలతో, జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఒంటరిగా బతకాల్సి వస్తే మన ఆడబిడ్డల పరిస్థితి ఏమిటి? ఇది ఇప్పుడు మన సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యగా మారింది. మ్యారేజ్అనేది మనదేశంలో ఎప్పటి నుంచో ఓ ‘సోషియల్ స్టేటస్’ గా ఉంటూ వస్తోంది. ఇంత ఆధునిక ప్రపంచంలో కూడా మనదేశంలో పెళ్లి అనేది తప్పనిసరిగా మారటం చాలామందిని ఇరకాటంలోకి పడేస్తోంది. ఇటు తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఎంత విజయవంతమైన కెరీర్ లో ఉన్నప్పటికీ పెళ్లి చేయకపోతే సమాజంలో చెడ్డ పేరు వస్తుందని తమ ఆడపిల్లలకు పెళ్లి చేసుకోవాల్సిందేనని కఠినమైన షరతులు విధించాల్సిన పరిస్థితులు నేటి సమాజంలో నెలకొన్నాయి.

- Advertisement -

శ్రద్ధా వాకర్, ఐశ్వర్యా ఉన్నిథన్, విస్మయ్ నాయర్..ఇలా లెక్కలేనన్ని ఉదంతాలు, ఘోరాలు మహిళలకు మనసమాజంలో ఉన్న డొల్ల భద్రతను మనకు గుర్తుచేసాయి, చేస్తూనే ఉన్నాయి. తాము నమ్మిన, తాము ఎంచుకున్నభాగస్వాముల చేతుల్లోనే ఎక్కువమంది అమ్మాయిలు తమ జీవితాన్ని ఛిద్రం చేసుకుంటున్నారు. పెద్దలు కుదిర్చిన వివాహ బంధమైనా, తామే ఎంపిక చేసుకున్న సంబంధమైనా, ఆఖరుకి నేటి తరం పిల్లలు ఎంతో ఆసక్తి చూపుతున్న సహజీవనమైనా తమ భాగస్వామి చేష్టలకు చిత్రవధ అవుతున్న ఉదంతాలు నిత్యం వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇక గృహ హింస కేసుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంతమంచిది. వరకట్నం వంటి సాంఘిక దురాచారాలు ఉండనే ఉన్నాయి. తరాలు మారినా ఇవేవీ మారకపోగా కొత్తతరం వారుకూడా మహిళలపట్ల నేరప్రవృత్తితో ప్రవర్తిస్తుండటం శోచనీయం.

అసలు పెళ్లీడుకు వచ్చిన మహిళ అయినా, పెద్ద వయసు మహిళ అయినా ఒంటరిగా, సురక్షితంగా ఉండగలిగే వాతావరణం ఉంటే బహుశా వారిపై ఈ హింస తగ్గే అవకాశం ఉండచ్చు. ఇలా ఒంటరిగా ఉండే మహిళలకు తాము ఉంటున్న చోట, పనిచేస్తున్న చోట సరైన గౌరవం ఉండకపోగా, అందరి కళ్లూ వీరిపైనే ఉంటాయి. దీంతో ఏదో ఒక బంధంలో వీరు బలవంతంగా కొనసాగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. పెళ్లి కాకుండా ప్రేమికుడి చేతిలో నలిగిపోయే బదులు బ్రేకప్ చెప్పుకుంటే? సహజీవనాన్ని వదులుకుని ఆ బలవంతపు బంధం నుంచి బయట పడగలిగి ఒంటరిగా, సంతోషంగా ఉండగలిగితే? వివాహ బంధం ఏదో కారణంతో వీగిపోయినా ప్రశాంతంగా ఉండగలిగితే? ఇలాంటి మార్పులు మన సమాజంలో రావాలి. ఆ సురక్షితమైన వాతావరణం ఏర్పడినప్పుడే ప్రమాదవశాత్తూ వితంతువులైన స్త్రీలు, అన్ని వయసుల్లోనూ ఒంటరిగా ఉండాల్సి వచ్చిన మహిళలు భద్రంగా తమ జీవితాన్ని తాము కోరుకున్నట్టు గడిపేయవచ్చు. ఒంటరి మహిళలను లైంగిక వాంఛలతో వేధించే అనాగరిక మనుషుల మధ్య తనను తాను రోజూ రక్షించుకోవటం ఒంటరి మహిళకు చాలా పెద్ద సవాలు. ఆర్థికంగా ఎంత స్వయంసమృద్ధిని సాధించినా ఒంటరి మహిళంటే అందరికీ లోకువే అన్నట్టు తయారైంది భారతీయ సమాజం. అయినవాళ్లు, తోటివాళ్లు, ఇరుగుపొరుగువారు అందరూ ఆమె శీలాన్ని శంకించడం, చులకనగా చూడటం మొదలుపెడతారు.

ఇలా ఉన్న అమ్మాయిల తల్లిదండ్రులకు మరో పెద్ద తలనొప్పి..”అదేంటి? మీ అమ్మాయి ఇంకా సెటిల్ కాలేదా? ఎందుకని? ఏమైనా సమస్యనా”? అంటూ సవాలక్ష ప్రశ్నలు ఎదురవ్వటం, వాటికి పరిష్కారాలన్నట్టు బోలెడన్ని ఉచిత సలహాలు. ఇవన్నీ భరించలేక ..”నిన్ను ఒక అయ్య చేతిలో పెడితే మేమెప్పుడు కన్ను మూసినా ప్రశాంతంగా పోవచ్చ”నే తల్లిదండ్రులు తమ ఒంటరి అమ్మాయిలను కంటి ముందు కదులుతున్న సమస్యలుగా చూస్తారు.

మహిళల అస్తిత్వం, ఇమేజ్ అన్నీ పెళ్లి అనే చట్రంలోనే బంధించి చూడటం మన సమాజంలో అతిపెద్ద లోపం అని నేటి తరం గుర్తిస్తోంది. లవ్ ఫెయిల్యూర్, బ్రేకప్, డైవర్స్, యాక్సిడెంట్స్ కారణంగా ఒంటరిగా ఉన్న మహిళలకు మనదేశంలో ఎదురయ్యే ప్రశ్నలు, అవమానాలు, సవాళ్లు ఎన్నని లెక్కపెట్టలేం. శారీరకంగా, మానసికంగా తమ జీవిత భాగస్వామి ఎన్ని వేధింపులకు గురిచేసినా వాటిని భరించి పడి ఉంటే కనీసం తల్లిదండ్రులు, సమాజంలో తలవంపులు ఎదురుకావని అవన్నీ పంటికింద భరించే ఆడబిడ్డలు మన చుట్టూ చాలామంది ఉన్నారు. మరి వీళ్లకు స్వేచ్ఛాయుత జీవితం ఎప్పుడు దక్కుతుంది?

ఇలా ఒంటరి మహిళకు తనకు నచ్చినట్టు స్వేచ్ఛగా, స్వతంత్రంగా, సురక్షితంగా బతికేందుకు మానవ హక్కులే మనదేశంలో లేవా? 30 ఏళ్లు దాటిన సింగిల్ వుమెన్ మనదేశంలో ధైర్యంగా ఉండేందుకు తెగింపు చూపాల్సిన అవసరం ఏమిటి? ఎందుకు తమకు నచ్చినట్టు మహిళలు ఒంటరి జీవితాన్ని ఎంపిక చేసుకునే పరిస్థితులు లేవు? ఇవన్నీ మారేదెన్నడు? మానవహక్కుల్లో మనం పై మెట్టు ఎక్కేదెప్పుడు? మహిళలు ఒంటరిగా ఉండటాన్ని సమాజమే కాదు, మనదేశ చట్టాలు, బ్యూరోక్రసీ కూడా ప్రోత్సహించదు.

పెళ్లి కాని మహిళలు, సింగిల్ మదర్స్, డైవర్స్..ఇలా వివిధ కారణాలుగా ఒంటరిగా ఉంటున్న మహిళా జనాభా మనదేశంలో 72 మిలియన్ లకు తక్కువ లేదు. అంటే అక్షరాలా 720 లక్షల మంది అన్నమాట. ‘సింగిల్ ఉమెన్’ కేటెగెరీని అధికారికంగా గుర్తించే వెసులుబాటు కూడా లేదు. ఎందుకంటే వాళ్లు ఇంకా సెటిల్ కాని వాళ్లుగానే, త్వరలో సెటిల్ అయ్యేవారిగా గుర్తిస్తారు కాబట్టి వీరి కోసమంటూ ఎటువంటి ప్రత్యేక రక్షణ చర్యలను మనదేశంలోని ఏ ప్రభుత్వాలు ఏర్పాటు చేయవు. అసలు ఈ విషయమే ప్రస్తావనలోకి రాదు. వీళ్లు ఎవరి మీదా ఆధారపడక పోయినప్పటికీ, ఆర్థికంగా మంచి స్థాయిలో ఉన్నాకూడా వీరిని అలాగే గుర్తిస్తున్నారు. పట్టణాల్లోనే ఇంత ఘోరంగా పరిస్థితి ఉంటే ఇక గ్రామాల్లోని ఒంటరి మహిళల పరిస్థితి మాటల్లో చెప్పలేం. ఓవైపు ఆర్థికంగా వీరు సొంత కాళ్లపైన నించునే అవకాశాలు తక్కువ కాబట్టి వీరు ఎంతో అవమానకరమైన, అసురక్షితమైన ప్రపంచంలో బతుకీడ్చాల్సి వస్తోంది.

తమ ఆత్మాభిమానం, సామాజిక గౌరవాన్ని వదులుకుని బతకటం ఏ ఒంటరి మహిళకైనా కత్తి మీద సామే. ఇంత సాహసోపేతంగా నిత్యం బతకడం కష్టసాధ్యం. ఇక భర్త చనిపోయిన భార్యలకైతే చాలామందికి దిక్కుమొక్కూ లేక, గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇష్టం లేకపోయినా కుటుంబ గౌరవం, వ్యక్తిగత గౌరవం కోసం మరో బంధంలోకి బలవంతంగానైనా అడుగుపెట్టక తప్పట్లేదు. ఏం ఇలాంటి వారు ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడితే మనమంతా మద్దతుగా ఎందుకు నిలబడరాదు?

చిన్న వయసులోనే ఒంటరిగా ఉండాల్సి వచ్చినప్పుడు వారు పడే నరకం గురించి మనందరికీ తెలిసినదే. ఇలాంటి వారిని నయానో భయానో లొంగదీసుకునేందుకు చుట్టూ ఉన్న మగవారు పన్నే కుట్రలు కుతంత్రాలకు అంతేలేకుండా పోతోంది. తోటి ఉద్యోగులు, చుట్టుపక్కల వారి వేషంలో వీరంతా గోటికాడ నక్కలా కాపుకాసి చూస్తుండటం ఒంటరి మహిళలను మరింత భయభ్రాంతులకు లోనుచేస్తోంది. పెళ్లైన మహిళల పట్ల చట్టం ఒకలాగ ప్రవర్తిస్తుంటే పెళ్లికాని ఒంటరి మహిళల హక్కుల సంగతేంటని ఏ కోర్టూ మాట్లాడదు.

లింగ వివక్ష కారణంగా మహిళలకు ఒంటరిగా జీవితమంతా గడిపే అవకాశం లేకుండా పోతోంది. తామంతకు తాము ఒంటరిగా బతకాలనుకున్న వారి పట్ల మన చట్టాలు, సమాజం వేరేలా ప్రవర్తిస్తే ఒంటరి మహిళలు సురక్షితంగా బతకే వాతావరణం వస్తుంది. ఒంటరి మహిళ అంటే ఇంట్లో వాళ్లకు ఓ బరువు, ఒక పెద్ద బాధ్యతగా కాకుండా చూడగలిగితే సగం సమస్య పరిష్కారం అయినట్టే. ఒంటరి మహిళలకు తలదాచుకునేందుకు గూడు, ఆరోగ్యం, జీవనాధారాన్ని కల్పించేలా చట్టంలో మార్పులు రావాలి. ఒంటరి మహిళ బతుకంటే అవమానకరమైన, అసురక్షితమైన జీవితాన్ని ఎంచుకోవటం అనే నిర్వచనం పోవాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News