Groom kisse Bride : పెళ్లి అవుతుందన్న ఆనందంలో వరుడు చేసిన ఓ కొంటె పని అతడి కొంప ముంచింది. పెళ్లిపీటలపై ముద్దు పెట్టాడని వధువు అతడిని పెళ్లి చేసుకునేందుకు నిరాకరించింది. దీంతో ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు ఆ పంచాయతీ పోలీసుల వరకు వెళ్లింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సంభల్ జిల్లాలో జరిగింది.
బహ్జోయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిస్లీ గ్రామానికి చెందిన ఓ యువకుడికి, సంభల్ జిల్లా పవాసకు చెందిన ఓ యువతితో పెళ్లి చేసేందుకు పెద్దలు నిర్ణయించారు. నవంబర్ 26న ఇద్దరికి వివాహాన్ని జరిపించారు. అయితే.. దండలు మార్చుకున్న తరువాత వధువుకు వరుడు ముద్దు పెట్టాడు. ఈ ఘటన వధువుకు కోపం తెప్పించింది. వెంటనే పెళ్లిపీటల పై నుంచి లేచి వెళ్లిపోయింది. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ పంచాయతీ పోలీస్ స్టేషన్‌కు చేరింది.
దాదాపు 300 మంది చూస్తుండగా వరుడు తనకు ముద్దు పెట్టాడని వధువు చెప్పింది. అతడి తీరు బాగాలేదని, తనకు భర్తగా అతడు వద్దని స్పష్టం చేసింది. పోలీసులు సర్దిచెప్పినప్పటికీ వధువు వినలేదు. వరుడితో వెళ్లేందుకు నిరాకరించింది.