Thursday, September 19, 2024
Homeఓపన్ పేజ్Independent inquiry: స్వతంత్ర దర్యాప్తు అత్యవసరం

Independent inquiry: స్వతంత్ర దర్యాప్తు అత్యవసరం

మాజీ శాసనసభ్యుడు, మాఫియా డాన్‌ అతిక్‌ అహ్మద్‌ హత్య ఊహించిందే. రాష్ట్రంలో ఏ ఒక్క డాన్‌నూ బతకనివ్వమంటూ కొద్ది కాలం క్రితం ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ శాసనసభలోనే ప్రకటన చేశారు. చాలాకాలంగా పోలీసులు కూడా అతన్ని ఏరిపారేయడానికి ఎదురు చూస్తున్నారు. అతన్ని, అతని సోదరుడు ఖాలిద్‌ ఆజిమ్‌ను పోలీసుల సమక్షంలోనే, వారు సంకెళ్లలో ఉండగానే గుర్తు తెలియని వ్యక్తులు వారిని సమీపించి, అతి దగ్గర నుంచి కాల్చి చంపడం నిజానికి మామూలు విషయం కాదు. వారు పోలీస్‌ కస్టడీలో ఉండగా ఎవరో వచ్చి వారిని కాల్చి చంపడాన్ని పత్రికలు శాంతి భద్రతలు కుప్పకూలిపోవడంగా అభివర్ణిస్తున్నప్పటికీ, ఈ మాఫియా డాన్‌ ఆగడాలను ప్రత్యక్షంగా చూసినవారు, అతని వల్ల ప్రత్యక్ష నరకాన్ని అనుభవించినవారు మాత్రం బహిరంగంగానే సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్ర పోలీసులు తనను ఏదో ఒక కారణంపై బూటకపు ఎన్‌కౌంటర్‌ చేసే అవకాశం ఉందని అతిక్‌ అహ్మద్‌ కొద్ది రోజుల క్రితం సుప్రీం కోర్టుకు అపీలు చేసుకున్నాడు. అయితే, న్యాయస్థానం అతని వినతిని స్వీకరించలేదు. కాగా, గత గురువారం అతని కుమారుడు అసద్‌ అహ్మద్‌ను ఝాన్సీలో పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు.
తండ్రీ కొడుకులిద్దరూ గత ఫిబ్రవరిలో ఒక రాజకీయ కక్షలో ప్రధాన నిందితులుగా ఉన్నారు. ఒకప్పుడు సమాజ్‌వాదీ పార్టీకి, ఆతర్వాత అప్నా దళ్‌ అనే పార్టీకి నాయకుడుగా ఉన్న అతిక్‌ అహ్మద్‌ 17 ఏళ్ల వయసు నుంచే పోలీసుల రికార్డుల్లోకి వెళ్లాడు.అతను 60 ఏళ్ల వయసులో హత్యకు గురయ్యేనాటికి అతని మీద వందకు పైగా కేసులు నమోదయి ఉన్నాయి. ఇందులో హత్యలు, అత్యాచారాలు, డబ్బు అక్రమ రవాణా వంటి కేసులు కూడా చేరి ఉన్నాయి. అతను ఎన్నో నేరాలు చేసినప్పటికీ, ఒక రాజకీయ నాయకుడుగా, సమాజ్‌వాదీ పార్టీ శాసనసభ్యుడుగా 1990ల నుంచి అతని హవా సాగుతూ వచ్చింది. రాజకీయ నాయకుడుగా చలామణీ అవుతూనే అతను మాఫియా డాన్‌గా కూడా పట్టుపెంచుకుంటూ వచ్చాడు. విచిత్రమేమిటంటే, కొద్ది కాలం జైలు జీవితం కూడా గడిపిన అతిక్‌ అహ్మద్‌ అక్కడి నుంచే తన నేర సామ్రాజ్యాన్ని విజయవంతంగా నడిపాడు. 2019లో అతన్ని గుజరాత్‌లోని ఒక జైలుకు తరలించడం జరిగింది. అక్కడి నుంచి ఉత్తర ప్రదేశ్‌కు తిరిగి వచ్చిన అతిక్‌ మళ్లీ తన నేర సంబంధమైన కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగించాడు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఒక సవాలుగా నిలిచాడు.
యోగి ఆదిత్యనాథ్‌ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటి వరకూ 183 మంది కరుడుకట్టిన నేరస్థులను ఎన్‌కౌంటర్లలో హతమార్చినట్టు పోలీసుల సమాచారాన్నిబట్టి తెలుస్తోంది.2017 మార్చి నుంచి ఇప్పటి వరకు పోలీసులు 10,900 ఎన్‌కౌంటర్లు జరిపారు.నిజానికి ఉత్తర ప్రదేశ్‌ చాలాకాలంగా మాఫియా డాన్‌ల గుప్పిట్లోనే ఉంటోంది. ముఖ్యంగా ప్రస్తుత ప్రభుత్వానికి ముందు వరకూ వారి చెప్పు చేతల్లోనే ప్రభుత్వాలు, పార్టీలు పనిచేస్తున్నాయనే వార్తా కథనాలు కూడా వచ్చాయి. పలువురు డాన్‌లపై పోలీసు కేసులు, కోర్టు కేసులు విచారణలో ఉన్నాయి కానీ, విచారణలో ఆలస్యాలు జరగడాన్ని అవకాశంగా తీసుకుని వీరి అకృత్యాలు మరీ విజృంభించాయని పోలీస్‌ అధికారులు కూడా చెబుతున్నారు. పోలీసులు, కోర్టులు ఉండగా ఎవరైనా చట్టాలను తమ చేతుల్లోకి తీసుకోవడం అన్నది న్యాయసమ్మతం కాదనే విషయం వాస్తవమే కానీ, ఈడాన్‌ల ఆగడాలు, అకృత్యాలకు అడ్డూ ఆపూ లేకపోవడం ప్రజలను విపరీతంగా బాధిస్తోంది. పోలీసులు ప్రభుత్వ చేయూతతో, భరోసాతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్‌కౌంటర్లకు పాల్పడడం జరుగుతోందని అధికారులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు.

- Advertisement -

ప్రస్తుత ప్రభుత్వ మద్దతుదారులు, అభిమానులు ఈ ఎన్‌కౌంటర్ల వ్యవహారాన్ని స్వాగతించడాన్ని చూస్తే, సమాజ ఆలోచనా ధోరణి ఏ విధంగా మారుతోందో అర్థం చేసుకోవచ్చు. పోలీసుల కస్టడీలో ఉన్న వ్యక్తుల్ని పట్టపగలు అతి సమీపం నుంచి జర్నలిస్టుల ముసుగులో ముగ్గురు వ్యక్తులు వచ్చి హత్య చేయడాన్ని ఇతర పార్టీలు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నాయి. రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తోందంటూ ఆందోళన చెందుతున్నాయి. ఇటువంటి మాఫియా డాన్‌లను ప్రోత్సహించి, పెంచి, పోషించిన పార్టీలు కూడా ఈ ఆందోళన చెందుతున్న పార్టీల్లో కలిసిపోయాయి. ఒకటి రెండు పార్టీలు ఈ హత్యలకు మతం రంగు పులిమే ప్రయత్నం కూడా చేశాయి. ఈ జంట హత్యలపై విచారణ జరపడానికి ప్రభుత్వం ఒక మాజీ న్యాయమూర్తి సారథ్యంలో ముగ్గురు సభ్యుల కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఏది ఏమైనా, ఈ హత్యలపై స్వతంత్రం దర్యాప్తు జరిగితే తప్ప ప్రభుత్వంపై పడిన మచ్చ తొలిగే అవకాశం లేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News