Telangana: తెలంగాణలో రాజకీయం ఇప్పుడు మాంచి కాకమీదుంది. ఒకపక్క గులాబీ పార్టీ జాతీయ స్థాయిలో కొట్లాటకు సిద్ధమవుతుంటే.. కమలం పార్టీ రాష్ట్రంలో జెండా పాతేందుకు సర్వశక్తులు ఒడ్డుతుంది. అసలు షెడ్యూల్ ప్రకారమే వచ్చే ఎన్నికలు జరుగుతాయా.. లేక మళ్ళీ కేసీఆర్ ముందస్తుకు జెండా ఊపేస్తారా అన్న అనుమానాలు, ప్రచారాలు తెలంగాణ రాకకీయాలకు మరింత అటెన్షన్ క్రియేట్ చేస్తున్నాయి. ఇక, రాష్ట్ర అధికార పార్టీ నేతల వ్యాపారాలు, ఇళ్లపై ఐటీ, ఈడీ సోదాలు ఒకరిపై మరొకరు మాటల యుద్దానికి దారితీస్తుంది.
మొన్నటి వరకు ఐటీ, ఈడీ మాత్రమే అనుకుంటే ఇప్పుడు సీబీఐ కూడా రంగంలోకి దిగింది. మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్రలకు తాజాగా సీబీఐ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ గురువారం ఢిల్లీలో తమ ఎదుట హాజరు కావాలని ఆ నోటీసుల సారాంశం. అయితే సహజంగా ఇక్కడ అందరికీ వచ్చే అనుమానాలు.. వాళ్ళ వ్యాపారాలకు అసలు సీబీఐకి సంబంధమేంటి అన్నదే. వ్యాపార లావాదేవీలలో అవకతవకలుంటే ఐటీ, ఈడీ చూసుకుంటుంది.
ఇప్పటికే ఐటీ, ఈడీ సోదాలు.. భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని కూడా కొన్ని మీడియా సంస్థల నుండి కథనాలొచ్చాయి. మరి ఇప్పుడు సీబీఐ ఎందుకు నోటీసులు ఇచ్చింది అన్నదే రాజకీయ వర్గాలలో ఆసక్తికరమైన చర్చ. దీనికి బీజేపీ నేతలు చెప్తున్న విషయం.. ఐటీ, ఈడీ కేసుల్లోనుంచి బయటపడేందుకు తెర వెనుక ప్రయత్నాలు చేసి దొరికిపోయారని.. ఈ వ్యవహారంలో నిజాలు తేల్చేందుకే సీబీఐ రంగంలోకి దిగిందన్నది వాదన.
ఓ మూడు రోజుల క్రితం కొవ్విడి శ్రీనివాస్ అనే నకిలీ సీబీఐ అధికారిని ఢిల్లీలో సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. అతని వద్ద కొందరి నేతల వివరాలు, వారిపై కేసుల వివరాలు ఉన్నాయని.. ఆరాతీస్తే గంగుల కమలాకర్, వద్ది రాజు రవిచంద్రల కేసులు లేకుండా సెటిల్మెంట్ చేసేందుకు లాబీయింగ్ కోసమే ఢిల్లీ వెళ్లారని ఇక్కడ బీజేపీ ప్రచారం చేస్తుంది. నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్ వ్యవహారంలో నిర్ధారణ కోసమే సీబీఐ నోటీసులు ఇచ్చినట్లు చెప్తున్నారు. అయితే, దీనికి ఢిల్లీ వరకు వెళ్లాల్సిన అవసరం ఉందా అన్నదే ఆలోచించాల్సిన అంశం. ఎందుకంటే హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో కూడా ఈ విచారణ జరిపించవచ్చు. కానీ, ఢిల్లీకి రావాలని పిలిపించడమే ఇక్కడ మరో అర్ధం కాని అంశం.