Saturday, November 23, 2024
Homeహెల్త్Summer hair care: వేసవిలో జుట్టు సంరక్షణ

Summer hair care: వేసవిలో జుట్టు సంరక్షణ

వేసవిలో వెంట్రుకల సంరక్షణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. వేసవిలో తలెత్తే వేడి, మట, తేమల వల్ల కేశాలు దెబ్బతింటాయి. ముఖ్యంగా వేసవిలో సూర్యరశ్మి చర్మాన్ని ఎలా దెబ్బతీస్తుందో అలాగే వెంట్రుకల ఆరోగ్యంపై కూడా ఎండ తీవ్ర ప్రభావం చూపుతుంది. తేమ కారణంగా శరీరంలోని నీటి శాతం తగ్గుతుంది. దీంతో చర్మానికి మల్లే వెంట్రుకలకు కూడా నీరు అందక హెయిర్ టెక్సెచర్ దెబ్బతిని జుట్టు పీచులా తయారవుతుంది. ఇది వెంట్రుకలను దెబ్బతీస్తుంది. చిట్లిపోయేలా చేస్తుంది. వేసవిలోచాలామంది
వెంట్రుకలు రాలిపోతున్న సమస్యతో బాధపడుతుంటారు. అలాగే వెంట్రుకలు పీచులా, పొడారిపోయినట్టు ఉంటాయి. చిట్లిపోతుంటాయి. ఒత్తైన జుట్టు ఉన్న వారు తలలో తీవ్ర చెమట సమస్యను ఎదుర్కొంటారు. అంతేకాదు దురద, చుండ్రు వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లతో బాధపడుతుంటారు. ఎండల వల్ల జుట్టుకు ఎదురయ్యే ఇలాంటి సమస్యలను కొన్ని టిప్స్ పాటిస్తే మంచి ఫలితాలను చూడొచ్చు.
ఆయిల్ మసాజ్ చేయండి……

- Advertisement -

వేసవిలో జుట్టుకు తరచూ ఆయిల్ మసాజ్ చేయాలి. దీనివల్ల జుట్టు నల్లగా నిగ నిగలాడుతుంటుంది. అందుకే వారానికి కనీసం రెండుసార్లు తప్పనిసరిగా వేసవిలో తలకు ఆయిలింగ్ చేసుకోవాలి. కొబ్బరినూనె లేదా మోరకాన్ లేదా ఆర్గాన్ ఆయిల్ తో తలను మసాజ్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఆయిలింగ్ చేసుకోవడం వల్ల తలలో రక్తప్రవాహం బాగా జరుగుతుంది. ఆయిలింగ్ జుట్టకు, మాడుకు మంచి మాయిశ్చరైజర్ లా పనిచేస్తుంది. అలాగే వారానికి రెండుసార్లు సల్పేట్ లేని షాంపుతో వెంట్రుకలను రుద్దుకోవాలి. తలరుద్దుకున్న తర్వాత వెంట్రుకలకు తప్పనిసరిగా కండిషనర్ పెట్టుకోవాలి. కండిషనర్ పెట్టుకోవడం వల్ల వెంట్రుకలకు మాయిశ్చరైజింగ్ ఎఫెక్టు ఉంటుంది. జుట్టు పొడారినట్టు అవదు. అందుకే నాణ్యమైన హెయిర్ కండిషనర్లను వాడాలి. ఇలా చేయడంవల్ల వెంట్రుకల కుదుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. జుట్టుకు కండిషనర్ ను పెట్టుకుని ఎక్కువ సేపు అలాగే ఉంచుకుంటే కూడా వెంట్రుకలపై అది మరింత ప్రభావం చూపుతుంది. అలాగే హెయిర్ కేర్ లోషన్స్ వల్ల కూడా వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి.

కపిగ్జెల్, ప్రొకాపిల్, రెడిన్సిల్ ( వెంట్రుకలు పెరిగేలా చేసే కాంపౌండ్లు) ఉన్న హెయిర్ లోషన్లు వాడితే జుట్టు బాగా పెరుగుతుంది. అంతేకాదు వేసవిలో నీటిని బాగా తాగడం వల్ల చర్మానికే కాదు వెంట్రుకలకు కూడా కావలసినంత హైడ్రేషన్ అంది వెంట్రుకలు దెబ్బతినకుండా ఉంటాయి. అలాగే వేసవిలో బయటకు వెళ్లాల్సి వచ్చినపుడు తలకు స్కార్ఫ్ లేదా క్యాప్ పెట్టుకోవాలి. లేదా గొడుగు వేసుకుని బయటకు వెళ్లాలి. ఇలా చేయడం వల్ల సూర్యరశ్మి కారణంగా వెంట్రుకలు దెబ్బతినకుండా ఉంటాయి. వేసవిలో తరచూ బ్యూటీ క్లినిక్ లేదా సెలూన్ కు వెళ్లి హెయిర్ కేర్ రొటీన్ చేయించుకుంటే మంచిది. ఇలా చేయడం వల్ల కూడా జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. డీప్ కండిషనింగ్ ట్రీట్మెంట్లు తీసుకోవడం వల్ల కేశాలు ఆరోగ్యంగా ఉంటాయి. పొడుగైన వెంట్రుకలను వేసవిలో కాపాడుకోవాలంటే వాటికి తీసుకోవాల్సిన కేర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే వేసవిలో హెయిర్ కట్ లేదా ట్రిమ్ చేయించుకుంటే మంచిది. అలాగే వెంట్రుకలు దెబ్బతినే అలవాట్లకు వేసవిలో స్వస్తిచెప్పాలి. ముఖ్యంగా వేడినీళ్లతో ఎక్కువసేపు షవర్ చేసే అలవాటును మానుకోవాలి. వేసవిలో వేడి షవర్ వల్ల వెంట్రుకలు తొందరగా దెబ్బతింటాయి. అంతేకాదు వెంట్రుకల్లో డీహైడ్రేషన్ సమస్య తలెత్తుంది. శిరోజాలు పొడారిపోయి బిరుసెక్కినట్టు అవుతాయి. హీటింగ్ హెయిర్ పరికరాల వాడకాన్ని కూడా వెంట్రుకలపై వాడడాన్ని తగ్గించుకోవాలి. వేసవిలో వెంట్రుకలకు కలరింగ్ వేసుకోవడం కూడా అస్సలు మంచిది కాదు. గాఢ రసాయనాలు బాగా ఉన్న హెయిర్ ప్రోడక్టులను వెంట్రుకలపై అప్లై చేయకుండా ఉండడం మంచిది. తలపై డ్రై షాంపులను అప్లై చేయడం వల్ల దురద తలెత్తుతుంది. జుట్టు చిట్లిపోతుంది. వీటిని దీర్ఘకాలం వాడడం వల్ల బాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఉంది. అందుకే షాంపు, నీళ్లతో తలను రుద్దుకోవడమే మంచిది.

వేసవిలో మీరు తినే డైట్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే హెయిర్ కేర్ లో డైట్ కూడా ఎంతో ప్రాధాన్యం కలిగి ఉంది. ప్రొటీన్లు, కాల్షియం, ఖనిజాలు పుష్కలంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. బాదం, జీడిపప్పు,వాల్నట్స్ వంటివి తినడం వల్ల వెంట్రుకలు బాగా పెరుగుతాయి. రోజూ ఆకుకూరలు, కాయగూరలు తినడం వల్ల ఒత్తైన కుదుళ్లు బలంగా అవుతాయి. పాలు, గుడ్లల్లో ప్రొటీన్లు, ఐరన్, జింకు, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇవి కూడా ఆరోగ్యమైన కేశసంపదను మనకు అందిస్తాయి. ఆరోగ్యమైన వెంట్రుకలు కావాలంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ కు, చక్కెరకు దూరంగా ఉండాలని మరవొద్దు. సో…ఈ వేసవిలో ఇవన్నీ పాటిస్తూ మీ వెంట్రుకల ఆరోగ్యాన్ని కాపాడుకోండి. నిగ నిగలాడే జుట్టుతో అందరినీ ఆకట్టుకోండి. ఏమంటారు?

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News