రాష్ట్ర చరిత్రలో ఎన్నడూలేని విధంగా రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండు పెరిగినప్పటికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మార్గదర్శకంలో పకడ్బందీ ప్రణాళికతో కోతలు లేకుండా కరెంటు సరఫరా చేస్తున్నామని రాష్ట్ర ఇంధన, భూగర్భ గనులు, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ప్రస్తుత వేసవిలో ఊహించని విధంగా విద్యుత్ వినియోగం పెరుగుతుందని ముందే గ్రహించి తదనుగుణంగా ఇంధనశాఖ అధికారులు ముందస్తు ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నారని అన్నారు. ఇందుకు వారిని అభినందించారు. వేసవిలో పెరుగుతున్న విద్యుత్ డిమాండును అధిగమించేందుకు తీసుకుంటున్న చర్యలు, విశాఖలో జరిగిన ఇన్వెస్ట్‌మెంట్ సదస్సులో కుదిరిన అవగాహన ఒప్పందాలకు అనుగుణంగా పరిశ్రమలు ఏర్పాటుపై గురువారం వెలగపూడిలోని సచివాలయంలో అధికారులతో మంత్రి సమీక్షించారు.
వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం..
వ్యయసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలన్న సీఎం జగన్ ఆశయాలకు అనుగుణంగా పెండింగులో ఉన్న 1.25 లక్షల దరఖాస్తుదారులకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇప్పటికే ఇచ్చామని మంత్రి పేర్కొన్నారు. ఇక నుంచి దరఖాస్తు చేసిన వెంటనే విద్యుత్ కనెక్షన్లు ఇచ్చే సదుపాయం కల్పిస్తామని చెప్పారు. ఇప్పటి వరకూ ఎన్నడూలేని విధంగా ఈ ఏప్రిల్‌లో ఈ రోజు (గురువారం) 246.3 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండు నమోదైందని మంత్రి వివరించారు.
33 కేవీ సబ్ స్టేషన్లకు కమిటీలు..
అన్ని అంశాలు పరిష్కరించేందుకు రాష్ట్రంలోని ప్రతి 33 కేవీ సబ్ స్టేషన్‌కు ఎంపీపీ, జెడ్పీటీసీ, ముగ్గురు రైతులతో కూడిన కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. గతంలో తాను మొదట ఎమ్మెల్యే అయినప్పుడు ఈ తరహా కమిటీలు ఉండేవని, ఇప్పుడు మళ్లీ మేం నియమిస్తున్నామని చెప్పారు. దీనివల్ల విద్యుత్ సరఫరా, లోఓల్టేజీ వంటి సమస్యలను స్థానికంగానే అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించుకునేందుకు వీలువుతుందని అన్నారు.
ప్రాజెక్టుల సాకారానికి పక్కా టైమ్‌లైన్
విశాఖపట్నంలో జరిగిన ‘సమ్మిట్’లో కుదిరిన అవగాహన ఒప్పందాల (ఎంఓయూల) ప్రకారం రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. విశాఖపట్నంలో జరిగిన ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌లో ఇంధన రంగంలో రూ. 9 లక్షల కోట్లతో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ సంస్థలు ఎంఓయూలు కుదుర్చుకున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. టైమ్‌లైన్ ప్రకారం పరిశ్రమలను గ్రౌండ్ చేయించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమీక్ష నిర్వహించామని మంత్రి తెలిపారు.
10 ప్రాజెక్టులకు జులై 15 లోగా శంకుస్థాపన
16,500 మెగావాట్ల విద్యుదుత్పాదన సామర్థ్యంతో రూ.82,500 కోట్ల పెట్టుబడుతులకు సంబంధించిన 10 ప్రాజెక్టులకు జులై 15 లోగా శంకుస్థాపనలు చేయించేలా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి ప్రకటించారు. ఎంఓయూల ప్రకారం పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరిస్తూ ముందుకెళ్లేందుకు జిల్లా స్థాయి అధికారులతో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రతి వారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షిస్తారని తెలిపారు. తాను రాష్ట్ర స్థాయిలో ప్రతినెలా సమీక్షించి పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామన్నారు.
సమగ్ర సమాచారంతో పోర్టల్
పారిశ్రామిక వేత్తలకు అవసరమైన సమగ్ర సమాచారంతో కాంప్రెహెన్సివ్ ప్రాజెక్టు మోనిటరింగ్ పోర్టల్‌ను ప్రారంభించాలని న్రెడ్‌క్యాప్ అధికారులను మంత్రి ఆదేశించారు. ఏ సమస్య ఉంటే ఏ అధికారిని సంప్రదించాలో కూడా అందులో ఫోన్ నంబరుతో సహా ఇవ్వాలని సూచించారు. పెట్టుబడులు పెట్టేవారికి సింగల్ విండో అనుమతులు, సదుపాయాల కోసం డిస్కమ్, ట్రాన్స్‌కో, న్రెడ్‌క్యాప్ అధికారులతో సంయుక్త కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
50 శాతమైనా గ్రౌండ్ చేయించే దిశగా సత్వర చర్యలు
పరిశ్రమలు ఏర్పాటు చేయించి రాష్ట్రాన్ని ప్రగతిబాటలో ముందుకెళ్లాలన్నదే సీఎం జగన్ ఆశయమని మంత్రి ఉద్ఘాటించారు. అందువల్ల ఎంఓయూల్లో 50 శాతం పరిశ్రమలైనా త్వరితగతిన ఏర్పాటు చేయించే దిశగా ముందుకెళుతున్నామని చెప్పారు. పంప్డ్ స్టోరేజి పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుపై అధికంగా దృష్టి పెట్టినట్లు వివరించారు. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ట్రాన్స్ కో సీఎడీ కె. విజయానంద్, జెన్ కో ఎండీ కేవీఎన్ చక్రధర్ బాబు, ఈపీడీసీఎల్ సీఎండీ పృద్వీతేజ్, ఇంధన శాఖ జేఎస్ కుమార్ రెడ్డి, న్రెడ్ క్యాప్ ఎండీ రమణారెడ్డి, సీపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ సీఎండీలు పద్మా జనార్దన్ రెడ్డి, సంతోష్ రావు తదితరులు సమీక్షలో పాల్గొన్నారు.