ఇటీవల కాలంలో వంటలకు ఒవెన్ ని చాలామంది ఎక్కువగా ఉపయోగించడం చూస్తున్నాం. ఒవెన్ ర్యాక్స్ లేదా గ్రిల్స్ ను తరచూ ఉపయోగిస్తుండడం వల్ల వీటిపై జిడ్డు, వంటపదార్థాల మరకలు ఏర్పడతాయి. వీటిని ఎప్పటికప్పుడు శుభ్రంచేసుకుంటుండాలి. వీటిని ఒవెన్ నుంచి బయటకు తీసి రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం శుభ్రంగా తోమి కడగాలి. ఒవెన్ లోపలి గోడలు, పైభాగలపై కూడా వంటపదార్థాల తాలూకూ జిడ్డు అంటుకుని మురికిగా తయారవుతాయి. అందుకే ఒవెన్ లోపలి భాగాన్ని కూడా తరచూ శుభ్రం చేస్తుండాలి. ఒవెన్ తలుపు లోపలి భాగంలో, బయట కూడా మురికి అంటుకుని ఉంటుంది. అందుకే వీటిని కూడా ఎప్పటికప్పుడు తుడుచేస్తుండాలి. ఒవెన్ టెంపరేచర్ నాబ్స్, ఒవెన్ హ్యాండిల్స్ కి కూడా గ్రీజు పట్టి ఉంటుంది. వాటిపై మొండి మరకలు ఏర్పడతాయి. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించుకునేందుకు కొన్ని సింపుల్ టిప్స్ ఉన్నాయి.
ఒవెన్ పై ఏర్పడే మొండి మరకలు పోగొట్టడంలో బేకింగ్ సోడా బాగా పనిచేస్తుంది. అరకప్పు బేకింగ్ సోడాకు రెండు టేబుల్ స్పూన్ల నీటిని జోడించి పేస్టులా చేయాలి. ఈ మిశ్రమాన్ని ఒవెన్ లోపలి భాగంలో రాసి రాత్రంతా అలాగే ఉంచి ఉదయం శుభ్రంగా గుడ్డతో తుడిచేస్తే ఒవెన్ కొత్తగా తళ తళ మెరుస్తు కనిపిస్తుంది. ఒవెన్ లో చేరిన జిడ్డు, గ్రీజులు పోవాలంటే ఒక వంతు వెనిగర్ లో రెండు వంతుల నీరు కలిపి ఆ ద్రవాన్ని స్ప్రే బాటిల్ లో పోసి ఒవెన్ లోపల అంతా బాగా స్ప్రే చేయాలి. కొద్దిసేపైన తర్వాత గుడ్డతో ఒవెన్ లోపలి భాగాలను శుభ్రంగా తుడిచేయాలి. ఇలా చేస్తే ఒవెన్ ఎంతో శుభ్రంగా ఉంటుంది. నిమ్మరసం కూడా మరో శక్తివంతమైన క్లీనింగ్ ఏజెంటు. ఇది యాంటీబాక్టీరియల్ గా పనిచేస్తుంది కూడా. మీదగ్గర ఉండే క్లీనింగ్ సొల్యూషన్ లో నిమ్మరసం జోడించి ఒవెన్ ని శుభ్రం చేయొచ్చు. లేదా కొన్ని నీటిని తీసుకుని అందులో నిమ్మరసం కలిపి ఆ ద్రవంతో కూడా ఒవెన్ ని క్లీన్ చేయొచ్చు. ఇలా చేయడం వల్ల బాక్టీరియా లేకుండా ఒవెన్ ఎంతో శుభ్రంగా ఉంటుంది.