Aus vs WI1st Test : పెర్త్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో బ్యాటర్లు రెచ్చిపోవడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసింది. మార్నస్ లబుషేన్(204; 350 బంతుల్లో 20 ఫోర్లు, సిక్స్‌తో ), స్టీవ్ స్మిత్(200 నాటౌట్; 311 బంతుల్లో 17 ఫోర్లతో )లు డబుల్ సెంచరీలతో చెలరేగారు. వీరితో పాటు ట్రావిస్ హెడ్(99; 95 బంతుల్లో 11 పోర్లు) తృటిలో శతకాన్ని చేజార్చుకోగా, ఉస్మాన్ ఖవాజా(65; 145 బంతుల్లో 5 ఫోర్లు) అర్థశతకంలో రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 598/4 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది.
ఆసీస్ బ్యాటర్లలో వార్నర్(4) ఒక్కడే విఫలం అయ్యాడు. విండీస్ బౌలర్లలో క్రైగ్ బ్రాత్ వైట్ రెండు వికెట్లు తీయగా జైడెన్ సీల్స్, కైల్ మేయర్స్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన వెస్టిండీస్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 74 పరుగులు చేసింది. బ్రాత్‌వైట్ 18, టాగెనరైన్ చంద్రపాల్ 47 పరుగులతో క్రీజులో ఉన్నారు. వెస్టిండీస్ ఇంకా 524 పరుగులు వెనకబడి ఉంది.
బ్రాడ్‌మన్ రికార్డు సమం..
59 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ఆరంభించిన స్టీవ్ స్మిత్ టెస్టుల్లో 29 శతకాన్ని అందుకున్నాడు. దీంతో దిగ్గజ ఆటగాడు డాన్ బ్రాడ్‌మన్ రికార్డును సమం చేశాడు. బ్రాడ్‌మన్ 52 టెస్టుల్లో ఈ ఘనతను సాధించగా, స్మిత్ 88 టెస్టులో ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఆస్ట్రేలియా తరుపున అత్యధిక శతకాలు బాదిన ఆటగాళ్లలో నాలుగోస్థానంలో నిలిచాడు. రిక్కీ పాంటింగ్ (41) తొలి స్థానంలో ఉండగా స్టీవ్ వా (32), మాథ్యూ హెడెన్ (30) లు ఆ తరువాత ఉన్నారు. ఇక ఓవరాల్‌గా టెస్టుల్లో అత్యధిక శతకాలు చేసిన జాబితాలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 51 శతకాలతో అగ్రస్థానంలో ఉండగా స్మిత్ 14వ స్థానంలో కొనసాగుతున్నాడు.
ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న వారిలో టెస్టుల్లో విరాట్ కోహ్లి అత్యధికంగా ఏడు డబుల్ సెంచరీలు చేయగా 5 ద్విశతకాలతో జో రూట్ రెండో స్థానంలో ఉన్నాడు. స్మిత్, కేన్ విలియమ్సన్ చెరో 4 డబుల్ సెంచరీలు నమోదు చేశారు. ఓవరాల్‌గా చూస్తే మాత్రం టెస్టుల్లో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన ఆటగాడిగా డాన్ బ్రాడ్‌మాన్ (12) ఉన్నాడు.
ఈ సంగతి కాస్త పక్కన బెడితే.. ఈ మ్యాచ్ ద్వారా వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ శివ్‌నరైన్ చంద్రపాల్ కొడుకు టగ్‌నరైన్ చంద్రపాల్ టెస్టు అరంగ్రేటం చేశాడు. ఓపెనర్‌గా అడుగుపెట్టిన అతను ఎదుర్కొన్న తొలి బంతినే బౌండరీ తరలించాడు. రెండో రోజు ఆటముగిసే సమయానికి 47 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.