మైనర్ బాలిక పెళ్లివిషయంలో ఝార్ఖండ్ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. 15 ఏళ్ల ఆ బాలిక ముస్లిం మతానికి చెందినది కావడంతో..వారి మత ఆచారాల ప్రకారం ఆమె పెళ్లికి అర్హురాలేనని కోర్టు స్పష్టం చేస్తూ.. బాలిక వివాహానికి అనుమతి మంజూరు చేసింది. ముస్లిం పర్సనల్ లా బోర్డు సూత్రాల ప్రకారం 15 ఏళ్లు ఆపై వయస్సు ఉన్న అమ్మాయిలకు పెళ్లి చేసుకునే స్వేచ్ఛ ఉందని ధర్మాసనం తెలిపింది. ఇందులో యువతుల సంరక్షకుల జోక్యంతో పనిలేదని పేర్కొంది. ఓ ముస్లిం యువకుడు తన మతానికే చెందిన 15 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంటూ దాఖలైన క్వాష్ పిటిషన్ ను ఝార్ఖండ్ హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా ఆ తీర్పును వెలువరించింది.
యువకుడి పేరు మహ్మద్ సోను. అతని వయసు 24 సంవత్సరాలు. బీహార్ లోని నవాడా పట్టణంలో ఉంటాడు. ఝార్ఖండ్ లోని జుగ్ సలాయ్ ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల బాలికను మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడని అతడిపై కేసు నమోదైంది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు మహ్మద్ సోనుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్ ను సవాల్ చేస్తూ మహ్మద్ సోను ఝార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించాడు.
కానీ.. విచారణ సందర్భంగా అమ్మాయి తండ్రి మాట మార్చేశాడు. తాను ఈ పెళ్లిని వ్యతిరేకించడంలేదని, తన కుమార్తెకు తగిన భర్తను చూసినందుకు అల్లాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని కోర్టుకు వెల్లడించాడు. కొంత అవగాహనలేమి కారణంగా సోనుపై ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని వివరించాడు. అమ్మాయి కుటుంబం తరఫు న్యాయవాది కూడా దీనిపై స్పందిస్తూ, ఈ పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించాయని కోర్టుకు విన్నవించారు. అనంతరం, న్యాయమూర్తి జస్టిస్ ద్వివేది ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు.