బిజెపి పాలిత రాష్ట్రాల్లో ప్రజాస్వామిక హక్కులు కాలరాస్తున్నారని, పోలీసుల రాజ్యం నడుస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్పొరేట్, మతతత్వ ఎజెండా దేశానికే ప్రమాదకరమని తమ్మినేని విమర్శించారు. ఖమ్మం సుందరయ్య భవనంలో పార్టీ రాష్ట్ర కమిటి సభ్యురాలు మాచర్ల భారతి అధ్యక్షతన జరిగిన సిపిఎం జిల్లా కమిటి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ వల్ల పేదలకు ఎలాంటి ప్రయోజనం కలగలేదన్నారు. ఎలాంటి చర్చ లేకుండానే పార్లమెంట్ ఆమోదించిందని అన్నారు. ప్రజలకు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చలేదని, నిరుద్యోగం తీవ్రంగా వున్నా, తగ్గించే చర్యలు చేపట్టలేదని విమర్శించారు. అదానీ అక్రమాలపై హిండెన్‌బర్గ్ నివేదిక యిచ్చినా, దానిపై పార్లమెంట్‌లో చర్చ జరగలేదన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి.సుదర్శన్‌రావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, కళ్యాణం వెంకటేశ్వరరావు, బొంతు రాంబాబు, బండి రమేష్, సిహెచ్.కోటేశ్వరరావు, భూక్యా వీరభద్రం, వై.విక్రం తదితరులు పాల్గొన్నారు.