తనపై ఎమ్మెల్యే రఘునందన్ రావు చేసిన ఆరోపణలు రుజువు చేస్తే తాను రాజీనామా చేసేందుకు రెడీ అంటూ వ్యవసాయ శాఖామంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 39 ఏళ్ల రాజకీయాల్లో ఇప్పటి వరకు ప్రజల జీవితాల మెరుగు కోసమే ప్రయత్నించినట్టు వారు చెప్పుకొచ్చారు.
ఆర్డీఎస్ ఎక్కడుందో, కృష్ణా నది ముంపు ఎక్కడుందో అవగాహన లేకుండా రఘునందన్ రావు మాట్లాడాడని, ఆయన చెప్పిన చండూరు భూములకు ఆర్డీఎస్ కాలువ రాదని సింగిరెడ్డి వాదించారు. సర్వే నంబర్ 60లో మంత్రి ఆధ్వర్యంలో ఉందని రఘునందన్ చెప్పిన మాట పూర్తిగా అవాస్తవమన్నారు. ఆయన చెప్పిన 17 ఎకరాల భూమిలో ముంపు కింద 12 ఎకరాలు పోగా మిగిలిన 5 ఎకరాలు మాత్రమే న్యాయంగా కొనుగోలు చేశారన్నారు. 80 ఎకరాలు కొని 80 ఎకరాలు కబ్జా చేశారని ఆరోపించారన్నారు. మొత్తం కాంపౌండ్ కట్టారని ఆరోపించారు .. కొంత మాత్రమే గోడ, మిగతాది ఫెన్సింగ్ ఉందని వివరించారు. సర్వే నంబర్ 60లో ఉన్నది శ్రీశైలం ముంపు భూములు ఆర్డీఎస్ కాదని, సర్వే ఖర్చులు మేమే భరిస్తాం .. రఘునందన్ రావు ఎప్పుడు వస్తారో చెప్పాలి .. మీ ఆరోపణలు దురుద్దేశపూర్వకం కాకపోతే వెంటనే స్పందించాలని సవాలు చేశారు. అక్కడ తప్పు జరగలేదని తేలితే రఘునందన్ క్షమాపణ చెప్పాలని, ఒక్క గుంట భూమి ఆక్రమించినా నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని, అక్కడ ఉన్నది 90 ఎకరాలుకు పైచిలుకని, 2008లోనే తెలంగాణలో భూరికార్డులు లామినేట్ చేసినట్టు ఆయన చెప్పుకొచ్చారు.
2009 వరదల్లో అలంపూర్ పూర్తిగా మునిగి రికార్డులు పాడయ్యాయి .. అప్పటి నుండి అక్కడ అన్నీ లావాదేవీలు డిజిటలైజ్ మీదనే నడుస్తున్నాయన్నారు. మానవపాడు తహసీల్దార్ ఆఫీసుల్లో రికార్డులు దగ్దం కావడం ఈ భూములకు లింకుపెట్టడం అత్యంత నీచం .. ఎవరి మీద ఆరోపణలు చేస్తున్నారో కూడా సోయి లేకుండా మాట్లాడుతున్నారన్నారు. చండూరులో శాశ్వత నిర్మాణాలు లేవు .. కూలీలు, బర్లు, ఆవులు, గొర్లు, ట్రాక్టర్ షెడ్లు మాత్రమే ఉన్నాయన్నారు. న్యాయవాద వృత్తిలో నేను రారాజును .. రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన దిగజారుడు ఆరోపణలు చేస్తారా అంటూ ఆయన నిప్పులు చెరిగారు.