Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Telugu literature: విప్లవం సృష్టించిన ‘చింతామణి’ నాటకం

Telugu literature: విప్లవం సృష్టించిన ‘చింతామణి’ నాటకం

సుమారు వందేళ్ల క్రితం ప్రసిద్ధ కవి, సంఘ సంస్కర్త కాళ్లకూరి నారాయణ రావు 1921లో రచించిన ‘చింతామణి’ నాటకం ఆంధ్ర దేశాన్ని అప్పట్లో ఒక ఊపు ఊపింది.ఆ రోజుల్లో సమాజంలో ఉన్న దురాచారాలు, మూఢనమ్మకాలు, చెడు సంప్రదాయాలకు వ్యతిరేకంగా రాసిన ఈ నాటకం ప్రజలను ఎంతగానో చైతన్యవంతుల్ని చేసింది. ఇది వేశ్యావృత్తిన దురాచారాన్ని ఖండించే నాటకం. ఈ నాటకాన్ని లభించిన అపూర్వ జనాదరణ అంతా ఇంతా కాదు. అప్పటి సామాజిక పరిస్థితులను ఆధారం చేసుకుని రాసిన ఈ నాటకం రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల ప్రదర్శనలకు నోచుకుంది. నాటకకర్త, సంఘ సంస్కర్త, మొట్టమొదటి ఆంధ్ర ప్రచురణ కర్త, జాతీయవాది, ఛాయాగ్రహణ నిపుణుడు, మహాకవి అయిన కాళ్లకూరి నారాయణ రావు 1920 ప్రాంతంలో సమాజంలో వేళ్లూనుకుపోయి ఉన్న అనేక దురాచారాలను ఖండిస్తూ, వీటికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తూ చింతామణి, వర విక్రయం, మధుసేవ వంటి అపూర్వ, అపురూప నాటకాలను రచించారు. ఈ నాటకాలు, అందులోని సంభాషణలు ప్రజలకు కరతలామలకం అయ్యాయి. వీటిని వల్లె వేయని వ్యక్తి ఆంధ్ర దేశంలో లేడంటే అతిశయోక్తేమీ లేదు.
చింతామణి నాటకం రాసే సమయానికి తెలుగునాట వేశ్యావృత్తికి వ్యతిరేకంగా సర్వత్రా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఆ సమయంలో కాళ్లకూరి నారాయణ రావు ఇదే ఇతివృత్తంతో రాసిన చింతా మణి నాటకం ఉద్యమకారులకు ఒక అస్త్రంగా ఉపయోగపడింది. ఈ నాటకాన్ని ఊరూరా ప్రదర్శిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకు వస్తూ, ఈ నాటకాన్ని ప్రదర్శించడానికి ముందు, ప్రదర్శించిన తర్వాత ప్రసంగాలు, ప్రకటనలతో సామాజికంగా మార్పు తీసుకు రావడానికి పలువురు సంస్కర్తలు ప్రయత్నించారు. ఇందులో సుబ్బిశెట్టి అనే పాత్ర ద్వారా వేశ్యావృత్తి ద్వారా చితికిపోయే కుటుంబాల గురించి అద్భుతంగా చిత్రీకరించారు. ఈ నాటకంలో చివరికి వేశ్యావృత్తి నుంచి మారిపోయిన చింతామణి ఏ విధంగా భగవంతుడి సేవకు అంకితమైందీ ఆయన చాలా అద్భుతంగా మలచారు. వేశ్యావృత్తిలోని ప్రమాదాల గురించి, వ్యక్తిగతంగా, సామాజికంగా దురవస్థల పాలై, చితికిపోవడం గురించి ఆయన వివిధ పాత్రల ద్వారా, వ్యావహారిక సంభాషణల ద్వారా ఆయన కళ్లకు కట్టించారు.
నాటక ప్రదర్శనలకే కాకుండా, ఈ పుస్తకానికి కూడా న భూతో న భవిష్యతి అన్నట్టుగా ఆదరణ లభించడం నిజంగా విశేషం. కొన్ని లక్షల ప్రతులు అమ్ముడుపోవడంతో పాటు, ఇతర విదేశీ భాషల్లోకి కూడా ఈ పుస్తకం అనువాదం అయింది. ముఖ్యంగా స్పానిష్‌ భాషలో ఈ పుస్తకానికి ఎంతో ప్రజాదరణ లభించింది. 2020 వరకు తెలుగునాట అప్రతిహతంగా ప్రదర్శనలకు నోచుకున్న ఈ నాటకాన్ని చివరికి ఒక సామాజిక వర్గంవారు అభ్యంతరం చెప్పడంతో ప్రభుత్వం నిషేధించడం జరిగింది. ఇందులో సుబ్బిశెట్టి పాత్రకు సంబంధించిన సంభాషణలను కాళ్లకూరి నారాయణ రావు ఒక విధంగా, ఒక సామాజిక ప్రయోజనాన్ని ఆశించి రాయగా, ఆ తర్వాత కాలంలో కొందరు వీటిని మార్చి, అసభ్యతను, అశ్లీలతను జోడించి రాయడంతో ఆ సామాజిక వర్గంవారు అభ్యంతరం తెలియజేయడం జరిగింది. ఫలితంగా ఈనాటక ప్రదర్శనను ప్రభుత్వం నిషేధించాల్సి వచ్చింది. నిజానికి, ఈ నాటకాన్ని కాళ్లకూరి నారాయణ రావు కేవలం సంఘ సంస్కరణాభిలాషతో రాయడం జరిగింది. ఒక సంఘ సంస్కర్త రాసిన నాటకాన్ని ఈ విధంగా నిషేధించడంపై మేధావి వర్గం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. నాటకంలో కొత్తగాచేరిన వాక్యాలను తొలగిస్తే సరిపోయేదని, పూర్తిగా నాటకాన్నే నిషేధించడం సంఘ సంస్కర్త కాళ్లకూరి నారాయణ రావును అవమానించినట్టే అవుతుందని చాలామంది అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా, ఈనాటకం ద్వారా అప్పట్లో వేశ్యావృత్తి చాలావరకు వెనుకపట్టు పట్టింది. నిషేధానికి ముందే కాక, నిషేధం తర్వాత కూడా ఈ నాటకం ఒక విధంగా విప్లవం, సంచలనం సృష్టించిందనే చెప్పాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News