ఉమ్మడి వరంగల్ జిల్లా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా చైర్మన్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, టెలీ కాన్ఫరెన్స్ లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ పాల్గొన్నారు. బిఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సభలను పార్టీ సూచనలు, సలహాల మేరకు దిగ్విజయంగా నిర్వహించాలని రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ లు వరంగల్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలకు సూచించారు. వరంగల్ ఉమ్మడి జిల్లా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా చైర్మన్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నేతలతో వారు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, పార్టీ నేతలు, ఎమ్మెల్యేల కోసం పార్టీ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది. నియోజకవర్గాల పార్టీ ప్రతినిధుల సభ ఎజెండా, సభా నిర్వహణ, ఏర్పాట్ల పై పాటించాల్సిన సూచనలు, సలహాలను పాటిస్తూ, పార్టీ పరంగా చేయాల్సిన తీర్మానాల విషయంలోనూ చురుగ్గా, తగిన విధంగా నిర్వహించాలి. అన్ని వర్గాల పార్టీ నేతలు, ముఖ్యులు, సీనియర్లు, కార్యకర్తలు తప్పకుండా ఈ సభలకు హాజరయ్యే విధంగా చూడాలని సూచించారు. ఆత్మీయ సమ్మేళనాల లాగే, నియోజకవర్గ స్థాయిలో ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు కనీసం 5వేల మంది ప్రతినిధులతో ఈ సభలు నిర్వహించాలన్నారు. అమర వీరులకు నివాళులర్పించడం, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేయడం, ప్రతినిధులకు స్వాగతం పలకడం, అమర వీరులకు మౌనం పాటించడం, రాష్ట్ర స్థాయి, దేశ స్థాయి సమస్యలతోపాటు, స్థానిక సమస్యలపై కూడా తీర్మానాలు చేయాలని సూచించారు. ఆయా తీర్మానాలపై ఒకరు ప్రతిపాదిస్తే, మరొకరు బలపరచాలి. తీర్మానాల విషయంలోనూ సామాజిక సమతూకం పాటించాలని చెప్పారు. ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కూడా నియోజకవర్గ పార్టీ ప్రతినిధుల సభల నిర్వహణపై మంత్రులు, ఎమ్మెల్యేలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన విధంగా, వారు సూచించిన విధంగా నిర్వహించాలని మంత్రులు సూచించారు. అలాగే సభలో సభ్యుల సూచనలు, సలహాలు కూడా పాటించాలని చెప్పారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం పెట్టే భోజన కార్యక్రమంలోనూ మంచి రుచి, శుచికరమైన భోజనాలు పెట్టాలని, కార్యకర్తలతో ఎమ్మెల్యేలు కలిసి భోజనాలు చేయాలని చెప్పారు. అలాగే ఉపాధి హామీపై నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఉత్తర యుద్ధం ప్రకటించారు. ఉపాధి హామీ కూలీల వేతనాలు పెంచాలి. పెరిగిన గ్యాస్, పెట్రో, డీజిల్, నిత్యావసర ధరలు తగ్గించాలి. ధాన్యం కొనుగోలుపై కేంద్ర వైఖరిని ఖండించాలని, కేంద్రం పంటల నష్టాలకు పరిహారం చెల్లించాలని… ఇలా పార్టీ పరంగా తీర్మానాలు చేయాలని సూచించారు. మంచి సమన్వయంతో, సంయమనంతో, కలిసికట్టుగా, విజయవంతంగా సభలు నిర్వహించాలని వివరించారు.