ఉన్నట్టుండి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైలెంట్ అయిపోయారు. అదేమిటన్నది ఒక్క బీజేపీ మాత్రమే డీ కోడ్ చేయగలదేమో! ఎందుకంటే పొద్దున్న లేస్తే నోటికొచ్చినట్టు కామెంట్స్ చేసేస్తూ హెడ్ లైన్స్ లో నిలిచే దీదీ ఇలా గుజరాత్ ఎన్నికలు, పార్లమెంట్ శీతాకాల సమావేశాల ముందు కామ్ అయిపోవటం వింతగా ఉందని బెంగాలీలే అనుకుంటున్నారు. ఇంతకీ మమతా అంత బిజీగా ఏం చేస్తున్నారంటే మారుమూల గ్రామాల్లో తిరుగుతూ, వారితో మమేకం అయిపోతున్నారు.
హస్నాబాద్ అనే ప్రాంతంలోని ఓ మారుమూల గ్రామంలో ఉన్నట్టుండి మమతా బెనర్జీ కనిపించటం గ్రామస్థులకే నమ్మశక్యం కావటం లేదు. పైగా ఆమె అక్కడి స్థానికులతో మాటామంతీ కలిపి, ఏకంగా వారి కంచాల్లోనే వారు వండిన వంటలు తినేస్తూ ముచ్చట్లు పెట్టారు. మమతా సీఎం కుర్చీ అధిరోహించినప్పటి నుంచీ ఇలాంటి సర్ ప్రైజులు రాష్ట్ర ప్రజలందరికీ ఇస్తూనే ఉన్నారు. దారిలో వెళ్తున్నప్పుడు ఎక్కడపడితే అక్కడ కాన్వాయ్ ఆపటం, కంటికి కనిపించిన టీ కొట్టు, షాపు, ఇంటికి వెళ్లటం, అక్కడున్న వారితో కాలక్షేపం చేయటం, వారు చేస్తున్న పనిలో చేయి కలపటం, వాళ్ల తిండే తినటాన్ని మమతా స్టైల్ అనేలా ఆమె ట్రెండ్ సెట్ చేసేశారు.
ఇప్పుడు పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మళ్లీ గ్రామీణ ప్రాంతాల్లో ఇదిగో ఇలా సైలెంట్ గా హడావిడి చేస్తున్నారు దీదీ. పల్లెబాట పట్టిన దీదీ ఇప్పటివరకు ఏ పెద్ద రాజకీయ నేత వెళ్లని గ్రామాలను కూడా చుట్టేస్తున్నారు. తప్పదుమరి ఆలస్యంగానైనా గ్రామాలే రాజకీయాలకు పట్టు కొమ్మలని గుర్తించినందుకు మమతాకు జై కొట్టాలంటున్నారు బెంగాలీలు.
24 నార్త్ పరగణాలోని ఖాన్పుకర్ గ్రామంలోకి చిన్న నది కూడా దాటి వెళ్లారు. అసలు తమ టీఎంసీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు మీకు అందుతున్నాయా, మీకున్న సమస్యలేంటి అని స్వయంగా విచారించారు. అయితే తమకు పక్కా ఇళ్లు కావాలని, రోజూ బయటికి వెళ్లాలంటే స్థానికంగా ఉన్న చిన్న నదిని దాటేందుకు బ్రిడ్జి లేక అవస్థలు పెడుతున్నామని, తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని, వాటిని కొనలేక చస్తున్నామన్న గ్రామప్రజల మాటలను ఆమె సావధానంగా విన్నారు. స్థానికంగా చీపుర్లు తయారు చేస్తుంటే తాను కూడా వారితో చేతులు కలిపి కాసేపు చీపుర్లు కట్టారు మమతా బెనర్జీ.
కొత్త సంవత్సరంలో పంచాయతీ ఎన్నికలు జరుగనుండగా కేంద్రం నుంచి ‘మన్రేగా; నిధులు రాక వెస్ట్ బెంగాల్ అల్లాడుతోంది. ఏడాదిగా ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులు రాకపోవటంతో రాష్ట్ర ప్రభుత్వం మోడీ సర్కారు నుంచి నిధులు ఎలా రాబట్టాలా అనే యోచనలో కూరుకుపోయింది. దీంతోపాటు పలు సంక్షేమ పథకాలకు ఏడాదిగా నిధులు కేంద్రం నుంచి రాబట్టుకోలేక, దీదీ సర్కారు సతమతమవుతోంది.
కాకపోతే ప్రతిష్ఠాత్మకమైన పంచాయతీ ఎన్నికల్లో పట్టు నిలుపుకునేందుకు, గ్రామాల్లో తృణముల్ పునాదులు మరింత బలోపేతమయ్యేందుకు ఎవరి ఊహకు అందని వ్యూహాన్ని మమతా బెనర్జీ ప్రయోగాత్మకంగా అనుసరించి చూపుతున్నారు. అదే “నో వయలెన్స్” అనే అస్త్రం. లోక్సభ ఎన్నికల్లో చేసినట్టు రక్తపాతానికి ఎట్టిపరిస్థితుల్లోనూ పాల్పడరాదని మమతా బెనర్జీ తన పార్టీ కార్యకర్తలకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. పార్టీ కార్యకర్తలు హింసకు పాల్పడితే ఏమాత్రం సహించమని దీదీ చెప్పటం పార్టీ కార్యకర్తలకే షాక్ ఇచ్చింది. పైగా పంచాయతీ ఎన్నికలకు ఏడాది ముంచు నుంచే మమతా ఇలా స్ట్రిక్ట్ రూల్స్ తు.చ. పాటించాలని చెప్పటం చూస్తుంటే పక్కాగా దీదీ వ్యూహం మార్చిందనే విషయం స్పష్టమవుతోంది.
వెస్ట్ బెంగాల్ అంటేనే అవినీతి, హింస అనేలా బ్రాండింగ్ చేశారు మమతా అంటూ బీజేపీ పదేపదే ధ్వజమెత్తుతోంది. నిజానికి ఆమె తత్వం తెలిసినవారు అనేది కూడా ఇదే. పార్టీని నడిపేందుకు పెద్ద ఎత్తున డబ్బు కావాలి..అదంతా ఆమె ఏదోలా దొడ్డిదారిన మేనేజ్ చేస్తున్నారు. కానీ దురదృష్టవశాత్తూ ఈ మూలాలు ఒక్కొక్కటే కూకటి వేళ్లతోసహా పెకిలించివేస్తోంది బీజేపీ. అయినా ప్రతి రాజకీయ పార్టీ చేసే ధందానే ఇది. కాకపోతే టైం బాలేనప్పుడు ఇలా వరుసపెట్టి అన్నీ బయటపడుతుంటాయి. పాపం మమతకు కూడా అలాగే టైం బాలేనట్టుంది.
ఇప్పటికే పార్టీలో మమతా తరువాత నంబర్ 2 అని భావించిన వాళ్లందరూ ఏదోలా దూరం అవుతూ వస్తున్నారు ఈమెకు. ఒక్క మేనల్లుడు అభిషేక్ బెనర్జీని పక్కనపెడితే మిగతా వాళ్లంతా ఏదో కారణంతో ఆమె నుంచి దూరంగా జరగక తప్పలేని పరిస్థితులు దాపురించాయి. ఉదాహరణకు సువేందు అధికారినే తీసుకుంటే ఒకప్పుడు పార్టీకి అన్ని విధాలా అండదండగా ఉంటూ వచ్చిన ఈయన బీజేపీ వైపు మళ్లారు. అంతే పార్టీకి ఫండింగ్, ప్రచారాలు అన్నీ కష్టమైపోగా ఏకంగా మమతానే ఆయన ఓటమిపాలు చేశారు. రాష్ట్రంలో ఇప్పుడు దీదీకి ప్రధాన ప్రత్యర్థిస ఒకప్పుడు తను సోదరుడిగా భావించిన ఈ సువేందునే కావటం విశేషం. ఎంతైనా రాజకీయాల్లో శాశ్వత శతృవులు, మిత్రులు ఎవరూ ఉండరనేది సత్యం. సువేందు తరువాతి వంతు పార్థ ఛటర్జీకి వచ్చింది. సెన్సేషనల్ రిక్రూట్మెంట్ స్కాంలో పార్థతో పాటు ఆయన గర్ల్ ఫ్రెండ్ చిక్కుకుని, ప్రస్తుతం జైళ్లలో ఉంటున్నారు. కోర్టు చుట్టూ తిరుగుతూ, బెయిల్ కోసం అవస్థలు పడుతున్న పార్థ అరెస్టు, కుంభకోణంపై మమతా ఇప్పటి వరకు పెద్దగా పెదవి విప్పి మాట్లాడింది లేనేలేదు. ఇక తప్పని పరిస్థితుల్లో ఈ విషయంపై దీదీ స్పందిస్తూ తాను అవినీతిని సహించనని, తన పార్టీలో ఎంతటివారైనా అవినీతికి పాల్పడితే తాను మద్దతివ్వనని తేల్చేసి చప్పట్లు కొట్టించుకున్నారు. అయితే పనిలో పనిగా తన జోలికి వస్తే మాత్రం అస్సలు ఊరుకోనని, అగ్గితో ఆడుకోవద్దని, ఆగ్రహంతో ఉన్న పులితో ఆటలు వద్దని చాలా గట్టి హెచ్చరికలు జారీ చేశారు శివంగి సీఎం.
ఇప్పుడు మమతా బెనర్జీకి బీజేపీ మాత్రమే కాదు మరో పార్టీతోనూ తలబొప్పి కట్టే పరిస్థితులు చుట్టుముట్టాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు దీదీకి పోటీ ఇచ్చేందుకు గ్రౌండ్ వర్క్ పూర్తి చేసింది. పంచాయతి ఎన్నికల బరిలో నిలిచేందుకు చాలా నెలలుగా ఆప్ క్షేత్రస్థాయిలో చాలా కార్యక్రమాలు చేసింది. 2014నుంచే బెంగాల్ లో ఆప్ ఉన్నప్పటికీ ఇప్పుడు పటిష్టమైన సంస్థాగత పార్టీగా ఆవిర్భవించేందుకు.. స్లోగా జనాల్లో చాలా కార్యక్రమాలను చాపకింద నీరులా చేపట్టింది ఆప్. ‘కర్మా తీర్థ’ వంటి డెవలప్మెంట్ ప్రాజెక్టులపై దీదీ చేసిన వాగ్దానాలు నిలుపుకోలేక పోవటంతో రాష్ట్రంలో నిరుద్యోగం తారాస్థాయికి చేరిందని కేజ్రీవాల్ పార్టీ ఇక్కడ పాట పాడటం మొదలుపెట్టింది. అంతేకాదు మమతా హయాంలో అంతా అవినీతిమయమయిందని ప్రజలకు వివరిస్తోంది.
‘సైలెంట్ గేమ్ ఛేంజర్’ గా ఎదుగుతున్న ఆప్ పై సీఎం మమతా గట్టి నిఘా పెట్టారు. పంజాబ్ లో చడీ చప్పుడు కాకుండా అధికారంలోకి వచ్చినట్టే తన ఇంట్లోనూ జరుగుతుందేమోనని బెంగ పెట్టుకున్న మమతా తనపై ఉన్న ప్రజా వ్యతిరేక ముద్రను క్రమంగా తుడుచుకునేందుకు వినూత్న ప్రోగ్రాములు వేసే పనుల్లో మునిగిపోయారు. ఇప్పటికే లక్ష మంది కార్యకర్తలతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ 100 ప్రోగ్రాములను చేపడుతున్న ఆప్ బెంగాలీ యువతపై దృష్టి నిలిపింది. లక్ష మంది వాలంటీర్లలో అత్యధికులు 25-35 ఏళ్ల మధ్య ఉన్నవారే కావటం హైలైట్. “నేతా ఔట్, జనతా ఇన్” అనే నినాదంతో ఆప్ ఇక్కడ పాగా వేసే పనుల్లో బిజీగా మారింది.
ప్రస్తుతానికి గడప గడపకూ ఆమ్ ఆద్మీ పార్టీ జెండాను, అజెండాను తీసుకెళ్లటంతో వీరంతా పక్కా ప్రణాళిక ప్రకారం పనిచేస్తున్నారు. బీజేపీయేతర, కాంగ్రెస్సేతర ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు మమతా బెనర్జీ కృషి చేస్తుండగా, ఇదే ఫార్ములాపై కేజ్రీవాల్ కూడా పనిచేస్తున్నారు. వీళ్లిద్దరి లక్ష్యం 2024 పార్లమెంట్ ఎన్నికలే. అయితే 2019 ఎన్నికల్లోనూ మమతాతో జత కట్టేందుకు కేజ్రీవాల్ నిరాకరించారు. అసలు మెయిన్ స్ట్రీంలో ఉన్న ఏ రాజకీయ పార్టీతోనూ తాము పొత్తు పెట్టుకోమని ఆనాడే కేజ్రీవాల్ తెగేసి చెప్పటం దీదీకి పెద్ద షాక్ ఇచ్చింది. కానీ ప్రస్తుతానికి రాష్ట్రంలో రాజకీయ శూన్యత లేనందున ఆప్ కు ఇక్కడ ఛాన్స్ లేదని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నా ఎవరినీ తక్కువ అంచనా వేసేందుకు దీదీ రెడీగా లేరు.
మరో విచిత్రమైన పరిస్థితి ఏమిటంటే బెంగాల్ అంటేనే హింస..అందునా ఎన్నికలు ఏవైనా ఇక్కడ హింస చెలరేగడం ఖాయం. హింసాయుత సంఘటనలు ఏం జరిగినా వాటిపై ఆప్ ఒక స్టాండ్ తీసుకోలేదు కాబట్టి.. బెంగాలీ రాజకీయాల్లో ఆప్ కు స్థానం లేదని రాష్ట్ర రాజకీయ నేతలు కుండబద్ధలు కొడుతున్నారు. ఏదేమైనా దీదీ మాత్రం చాలా సైలెంట్ గా వ్యవహారాలను చక్కబెట్టడానికే ప్రధాన్యత ఇస్తున్నారు. అందుకే ఈమధ్య సంచలన వ్యాఖ్యలు చేయటాన్ని తగ్గించుకున్నారు. పైగా ప్రజలు, ప్రజల సమస్యలు అంటూ ఏదో ఊకదంపుడు ఉపన్యాసాలు, రొటీన్ పర్యటనలతో కాలం నెట్టుకొస్తూ డిప్లమెటిక్ గా వ్యవహరిస్తున్నారు.
మరోవైపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తనకు మాత్రమే జాతీయ స్థాయిలో రాజకీయంగా వెలుగులు చిందించే అవకాశం ఉందని ఆమె గట్టిగా నమ్ముతున్నారు. మూడవ కూటమికి సరైన ప్రధాని అభ్యర్థి అంటే మమతానే మిగిలిన ఏకైక ఛాయిస్ కాబట్టి మళ్లీ ‘ఖేలా హోబే’ స్టార్ట్ చేస్తానని ఆమె భావిస్తున్నారు. బెస్ట్ సీఎంగా, బెస్ట్ లీడర్ గా తనకున్న ఇమేజ్ మరే పార్టీ నేతకు లేదని మమతా ఇప్పటికీ గట్టిగా విశ్వసిస్తున్నారు. కానీ కాంగ్రెస్, ఇతర ప్రాంతీయ పార్టీలు ఏవీ మమతను లెక్కచేయటం లేదు. పైగా ఎవరికి వారే తామే ప్రధాన మంత్రి అభ్యర్థులమని విర్రవీగుతుండటం విశేషం.