ఏ దేశంలో సంక్షోభాలు తలెత్తినా, అంతర్యుద్ధాలు చోటు చేసుకున్నా భారత్‌కు అది తప్పకుండా సమస్యగా మారుతుంది. ప్రస్తుతం ప్రపంచంలో భారతీయులు స్థిరపడని, పర్యటించని దేశమంటూ లేకపోవడమే అందుకు కారణం. సూడాన్‌లో అంతర్యుద్ధం ప్రారంభం కాగానే భారత్ ‘ఆపరేషన్ కావేరి’ పేరుతో అక్కడి భారతీయులను స్వదేశానికి తీసుకు రావడానికి, సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి చర్యలు ప్రారంభించింది. అక్కడ 72 గంటల కాల్పుల విరమణ ప్రకటించగానే భారతీయ విమానాలు అక్కడి3,000 మంది భారతీయులను తరలించడానికి వాయు వేగంతో దూసుకుపోయాయి.భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో వైమానిక దళం, నౌకా దళం వెంటనే సహాయ చర్యలకు నడుం బిగించాయి. సూడాన్ సాయుధ దళాల అధినేత, పాలక పక్ష అధినేత అయిన జనరల్ అబ్దుల్ ఫతాహ్ అల్ బుర్హాన్‌కు విధేయులైన దళాలకు, గతంలో ఆయన దగ్గర ఉప సైన్యాధ్యక్షుడుగా పనిచేసిన భద్రతా దళాల (ఆర్.ఎస్.ఎఫ్) అధిపతి జనరల్ మహమ్మద్ హమేతీ హమ్‌దాన్ దగాలో విధేయులకు మధ్య ఖార్టూమ్‌లో భీకర స్థాయిలో పోరాటం ప్రారంభం అయింది. వివిధ దేశాలకు చెందిన పౌరులతో పాటు, సూడాన్ పౌరులను కూడా పోర్ట్ సూడాన్ వద్దకు అతి కష్టం మీద తరలించడం జరిగింది. వారినందరినీ ఇప్పుడు సముద్ర మార్గం ద్వారా, విమానాల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి ఉంది.
కాగా, భారత్ వెంటనే రంగంలోకి దిగి, అమెరికా, సౌదీ అరేబియా, బ్రిటన్, యు.ఏ.ఈతదితర దేశాల సమన్వయ, సహకారాలతో సూడాన్ నుంచి పౌరులను వారి వారి దేశాలకు తరలించడానికి శాయశక్తులా కృషి చేస్తోంది. పౌరులను తరలించడానికి సౌదీ విమానాలను, ఫ్రెంచ్ విమానాలను కూడా ఉపయోగించడం జరుగుతోంది. కరిబ్బియన్‌లో పర్యటన కోసం వెడుతున్న విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మధ్యలో న్యూయార్క్‌లో ఆగి, ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిని కలుసుకుని, సహాయం అర్థించారు. సూడాన్‌లో ఆహార ధాన్యాలను సరఫరా చేస్తున్న ట్రక్కుల మీదా, వైద్య సహాయం అందజేస్తున్న సిబ్బంది మీద, సహాయ సహకారాలు అందిస్తున్న సామాజిక సేవా కార్యకర్తల మీద కూడా సాయుధ దళాలు దాడులు చేస్తున్నందువల్ల, ఇతర దేశాలు చేపడుతున్న సహాయ, రక్షణ చర్యలకు విఘాతం ఏర్పడుతోంది. 1991లో గల్ఫ్ యుద్ధం జరిగినప్పుడు సహాయం అందించిన రక్షణ సిబ్బంది ఇప్పుడు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున సహాయ చర్యలు చేపట్టింది.
సూడాన్‌లో నివాసం ఉంటున్న, స్థిరపడిన భారతీయుల కోసం భారత ప్రభుత్వం మళ్లీ పెద్ద ఎత్తున సహాయ చర్యలు ప్రారంభించవలసి వచ్చింది. ఎక్కడ ఏ దేశంలో సంక్షోభాలు తలెత్తినా అది భారతదేశానికి ఒక పెద్ద సవాలుగా పరిణమిస్తోంది. ఇతర దేశాలలో సుమారు కోటి 40 లక్షల మంది భారతీయులు స్థిర నివాసం ఏర్పరచుకుని ఉండడం, ప్రతి ఏటా సుమారు 70 లక్షల మంది భారతీయులు వివిధ దేశాలలో పర్యటిస్తూ ఉండడం వల్ల ప్రపంచంలో ఎక్కడ ఏ యుద్ధం జరిగినా, ఏ సంక్షోభం తలెత్తినా దాని ప్రభావం భారత్ మీద తప్పనిసరిగా పడుతోంది. పైగా, ఈ భారతీయులు ఆయా దేశాలలో అతి కష్టతరమైన పరిస్థితుల్లో వృత్తి, ఉద్యోగాలు చేసుకోవాల్సి వస్తోంది. ఉదాహరణకు, ఉక్రెయిన్‌లో విద్యార్థులు, యెమెన్ లేదా ఇరాక్ దేశాలలో నర్సులు, లిబియా, సిరియా, లెబనాన్‌లలో కార్మికులు చాలావరకు ప్రతి నిత్యం సంక్షోభాలలోనే ఉండిపోవాల్సి వస్తోంది. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత అనివార్యంగా భారత ప్రభుత్వం మీద పడుతోంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఒక శాశ్వత సహాయ లేదా రక్షణ దళాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. 2022లో విదేశీ వ్యవహారాల శాఖకు చెందిన పార్లమెంటరీ కమిటీఒకటి ఈ మేరకు ప్రభుత్వానికి సిఫారసు కూడా చేయడం జరిగింది.
ఇటువంటి వ్యవస్థనొకదానిని ఏర్పాటు చేసే పక్షంలో విమర్శలకు, ఆరోపణలకు అవకాశం ఉండదు. రాజకీయంగా లబ్ధి పొందడానికి వీలుండదు. సహాయ చర్యలలో లోపాలున్నాయని, నిధుల దుర్వినియోగం జరిగిందని వేలెత్తి చూపించడానికి కూడా అవకాశం ఉండదు. ప్రపంచంలో ఎక్కడ ఏ విధమైన సంక్షోభం తలెత్తినా, భారత ప్రభుత్వం సకాలంలో స్పందించి, సహాయ చర్యలు చేపడుతుందనే పేరుంది. ఆ పేరు ప్రతిష్ఠలు కలకాలం కొనసాగాలంటే ఒక పటిష్ఠమైన సహాయ, రక్షణ వ్యవస్థ ఎంతగానో అవసరం అని ప్రభుత్వం గ్రహించాలి.