మానవ విలువలు దిగజారుతున్నాయి. చిన్న, పెద్ద తేడా లేకుండా.. ఆడపిల్ల కనిపించడమే పాపంగా.. అత్యాచారాలు, దాడులు మితిమీరుతున్నాయి. నిన్న బెంగళూరులోని వివిధ పాఠశాలల్లో విద్యార్థుల బ్యాగుల్లో కండోమ్ లు, సిగరెట్లు, మద్యం, గర్భనిరోధక మాత్రలు ఉండటం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. స్కూల్, కాలేజీకి వెళ్లే విద్యార్థులు చదువును పక్కనపెట్టి.. ఇతరత్రా వాటిపై దృష్టిపెడుతున్నారు. అందుకు కారణం స్మార్ట్ ఫోన్లు.
ఆరంగుళాల స్మార్ట్ ఫోన్లో అసాంఘిక కార్యకలాపాలను అదేపనిగా చూసి.. తమ కోరికను తీర్చుకునేందుకు రెచ్చిపోతున్నారు. తాజాగా ముంబైలో 8వ తరగతి విద్యార్థినిపై తోటి విద్యార్థులు తరగతి గదిలోనే అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. సెంట్రల్ ముంబైలోని హార్బర్ లైన్ లో ఉన్న ఓ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఇద్దరు తోటి విద్యార్థులు అత్యాచారానికి పాల్పడ్డారు. డ్యాన్స్ ప్రాక్టీస్ కోసం మిగతా విద్యార్థులంతా గ్రౌండ్ ఫ్లోర్ కు వెళ్లగా.. ఆ విద్యార్థిని ఒంటరిగా క్లాస్ రూమ్ లో కూర్చుని ఉంది.
అదే అవకాశంగా భావించిన విద్యార్థులు ఆమెపై దాడి చేసి అత్యాచారానికి తెగబడ్డారు. సమచారం తెలుసుకున్న బాలిక బంధువులు ఘటనపై ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇద్దరు మైనర్లపై కేసు నమోదు చేశారు. ఇద్దరు మైనర్ బాలురును జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరు పరిచారు. వైద్య చికిత్స కోసం బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. ఈ షాకింగ్ ఘటనతో స్కూల్లో మిగతా విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు.