Saturday, November 23, 2024
Homeపాలిటిక్స్Emmiganuru: TDP కంచుకోటలో టికెట్ ఎవరికి?

Emmiganuru: TDP కంచుకోటలో టికెట్ ఎవరికి?

ఎమ్మిగనూరు టీడీపీలో వర్గ విభేదాలు రోజు రోజుకు ముదురుతున్నాయి. పార్టీ కార్యక్రమాలు మొదలుకొని లోకేష్ పర్యటన వరకు ఎవరికి వారే యమునాతీరే ఆన్న చందంగా వ్యవహరిస్తున్నారు. టికెట్ తమ నేతకే వస్తుందంటే.. తమ నేత కే వస్తుందని ధీమా వ్యక్తంచేస్తున్నారు. ఇంతకు టికెట్ ఎవరికి ఇస్తారో..? తాము ఎవరి వెనుక వెళ్ళాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. దీంతో ఎమ్మిగనూరు టీడీపీ లో విచిత్ర పరిస్థితి ఏర్పడింది. లోకేష్ పర్యటన తోనైనా టికెట్ ఎవరికి వస్తుంది..? అనే అంశానికి తెర పడుతుందా..? లేదా..? అన్నది చర్చాంశ నేయంగా మారిన వైనం పై “తెలుగు ప్రభ” ప్రత్యేక కథనం…

- Advertisement -

ఎమ్మిగనూరు ఒక నాడు టీడీపీకి కంచుకోట. మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి 5 సార్లు ఎమ్మెల్యేగా ఈ నియోజక వర్గం నుంచి విజయం సాధించి ఎక్కువ కాలం మంత్రిగా కూడా పని చేశారు. అయితే గత ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలయ్యింది. వైసీపీ అభ్యర్థి ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికల తర్వాత నియోజకవర్గ టీడీపీ లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి.

ఎమ్మిగనూరు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కోట్ల సూర్య:
2019 ఎన్నికల్లో ఓటమి పాలయిన బీవీ జయనాగేశ్వర రెడ్డి ఇంచార్జీ గా ఉంటూ వస్తున్నారు. అయితే అనూహ్యంగా మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఎమ్మిగనూరు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రత్యేకంగా ఆఫీస్ ఓపెన్ చేసి తమ పాత వర్గాన్ని, మాజీ ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర రెడ్డి కి వ్యతిరేఖంగా ఉన్న వారందరినీ దగ్గర చేసుకొని ప్రత్యేక వర్గం తయారు చేసుకున్నారు. అంతే కాక పార్టీ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు కూడా కోట్ల వర్గం ప్రత్యేకంగా చేసుకుంటూ వెళుతోంది. చివరకు నారా లోకేష్ పాదయాత్ర లో కూడా ఎవరికీ వారుగా స్వాగతం పలికేందుకు వెళ్ళారు. ఇలా ప్రతి అంశంలో ఎవరికి వారుగా ముందుకు వెళుతున్నారు.

మాజీ ఎమ్మెల్యే బీవీ కి అసంతృప్తుల సెగ:
మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి మరణం తర్వాత ఆయన కుమారుడు బీవీ జయనాగేశ్వర్ రెడ్డి 2012 లో రాజకీయ అరంగేట్రం చేశారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. అయితే గెలిచిన అనంతరం తన వైఖరి పూర్తి గా మారి పోయిందని అనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా గెలిచిన తర్వాత చిన్న పనులు ఏవైనా ఉన్న వారిని నెలల తరబడి తన వెంట తిప్పుకున్నారని, పనుల కోసం వస్తే అమ్యామ్యా లేనిదే పనులు చేసేవారు కాదని కూడా ఆరోపణలు ఉన్నాయి. అలాగే తన వెనుక ఉన్న నాయకులు, కార్యకర్తల దగ్గర లక్షలకు లక్షలు అప్పులు చేశారంటూ, ఒక చెక్ బౌన్స్ కేసులో దోషిగా కూడా ఉన్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. గుర్రం రేసుల్లో ఆ ధనమంతా ఖర్చు చేస్తున్నట్లు ఆరోపణలను ఉన్నాయి. డబ్బులు ఖర్చు పెట్టే వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని, క్రమ శిక్షణ కలిగిన కార్యకర్తలను పూర్తిగా దూరం పెట్టారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా చాలా మంది కార్యకర్తలు అయన వైఖరి నచ్చక, పార్టీ పై అభిమానం చంపుకోలేక మౌనంగా ఉంటున్నారు. కొంత మంది ఆయనకు వ్యతిరేఖంగా ఆందోళనలు చేపట్టిన ఘటనలు కూడా ఉన్నాయి.

బీవీ నుంచి కోట్లకు దగ్గరవుతున్న నేతలు:
బీవీ జయనాగేశ్వర రెడ్డి వ్యవహార శైలి నచ్చని నేతలు బీవీకి, పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు.టిడిపి పై అభిమానం ,మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి చేసిన మంచి పనులకు ఆకర్షితులై అనేక మంది టిడిపి ను వదిలి వెళ్ళడం లేదు. బీవీ మోహన్ రెడ్డి కు ఎన్టీఆర్ ,చంద్రబాబు లకు నమ్మకం ఉంది.దీనిని బీవీ జయనాగేశ్వర ఆసరాగా చేసుకుని ఇస్తానుసారంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. టిడిపి అధిష్టానం నన్ను కాదని ఎవరికి టికెట్ ఇవ్వదనే ధీమాతో బీవీజేఅర్ ఉన్నారు. కానీ ఎమ్మిగనూరు లో మాత్రం ఆ పార్టీ శ్రేణులు తీవ్ర అసంతృప్తి తో ఉన్నట్లు తెలుస్తుంది. అంకిత భావంతో పని చేస్తున్న వారికి ప్రాధాన్యం ఇవ్వకుండా డబ్బు ఎవరు ఇస్తారో వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆ పార్టీ శ్రేణులు వాపోతున్నారు. అయితే కోట్ల ఎమ్మిగనూరు లోకి అడుగుపెట్టిన తర్వాత సైలెంట్ గా ఉన్న నేతలంతా కోట్ల వర్గంలో చేరిపోయారు. మరి కొంత మంది ఆటో ఇటో తేల్చుకోలేక మథన పడుతున్నట్టు తెలుస్తోంది.

టికెట్ తమకంటే తమకే అని ప్రచారం:
వచ్చే ఎన్నికల్లో టికెట్ తమ నేతకు వస్తుంది అంటే తమ నేతకు వస్తుంది అని ఎవరి వర్గీయులు వారు జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు. బీవీ పై ఉన్న వ్యతిరేఖ ప్రభావం కూడా తమకు కలసి వస్తుంది అని చెబుతున్నారు. మరో పక్క టికెట్ కోసం కోట్ల తో పాటు చేనేత వర్గానికి చెందిన మాజీ ఎంపి, రాంపురం రెడ్డి సోదరులలో ఒకరు, అలాగే ఏళ్ల తరబడి ఎమ్మెల్యే కావాలంటూ ఆశతో ఉన్న రుద్ర గౌడ్ కూడా టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా అనేక ఎవరికి వారుగా టికెట్ ఆశిస్తుండడం, తమకే టికెట్ వస్తుంది అంటే తమకే వస్తుందని ఎవరి అనుచర వర్గం వారు చెప్పుకుంటూ తిరుగుతుండడం నేతలను, కార్యకర్తలను అయోమయంలో పడేస్తోంది. ముఖ్యంగా పార్టీ నిఖార్సైన, క్రమ శిక్షణ కలిగిన నేతలు చాలా మంది ఉన్నారు. పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే వారు వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. ప్రస్తుతం ఎమ్మిగనూరు లో విచిత్ర పరిస్థితి ఏర్పడడం తో టికెట్ ఎవరికి వస్తుందో..? ఎవరికి వెనుక వెళ్ళాలో అర్థం కాక చాలా మంది నేతలు సైలెంట్ గా ఇంటికే పరిమితం అయ్యారు. లోకేష్ పాద యాత్ర నేపథ్యంలో ఈ సస్పెన్స్ కు తెర దింపుతారా..? లేదా..? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. లోకేష్ జోక్యం చేసుకొని ఎమ్మిగనూరు లో వర్గ పోరుకు చెక్ పెట్టడంతో పాటు అభ్యర్థి ఎవరనేది కూడా తేల్చాలని కోరుతున్నారు. మరి లోకేష్ ఏమి చేస్తారో..? తెలియాలి అంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News