Rashtrapati Draupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. శీతాకాల విడిదికోసం ఈనెల 28న హైదరాబాద్‌కు చేరుకుంటారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆమె బస చేయనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల్లో వివిధ కార్యక్రమాల్లో రాష్ట్రపతి పాల్గొంటారని సమాచారం. 28న తెలంగాణలో అడుగుపెట్టనున్న ద్రౌపది ముర్ము.. 30న తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక సమాచారం అందింది. అయితే, రాష్ట్రపతి పర్యటకు సంబంధించిన షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు. మరో రెండుమూడు రోజుల్లో షెడ్యూల్ ఖరారు కానుంది.
ప్రతీ సంవత్సరం శీతాకాలం రాష్ట్రపతి హైదరాబాద్ లో విడిదికి రావడం ఆనవాయితీగా వస్తుంది. కానీ గత రెండేళ్లుగా కరోనా కారణంగా ఈ ఆనవాయితీకి బ్రేక్ పడింది. ప్రస్తుతం కొవిడ్ ఆంక్షలు ఎత్తివేయడం, ఎలాంటి ఇబ్బందికర వాతావరణం లేకపోవటంతో రాష్ట్రపతి హోదాలో ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు రానున్నారు. చివరిసారిగా 2019 సంవత్సరంలో అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హైదరాబాద్ కు వచ్చివెళ్లారు. ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడటంతో శీతాకాల విడిదికోసం రాష్ట్రపతి హైదరాబాద్‌కు రావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.